జడ్జినే బురిడీ కొట్టించబోయి.. బుక్కయ్యారు! | The Gang That Judge Cheat With Fake Documents | Sakshi
Sakshi News home page

జడ్జినే బురిడీ కొట్టించబోయి.. అడ్డంగా బుక్కయ్యారు!

Published Fri, Nov 29 2019 11:37 AM | Last Updated on Fri, Nov 29 2019 11:41 AM

The Gang That Judge Cheat With Fake Documents - Sakshi

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రసాద్, చిత్రంలో సీఐ రోశయ్య, వెనుక  నిందితులు

సాక్షి, కావలి: నకిలీ పత్రాలతో జడ్జినే బురిడీ కొట్టించబోయి నకిలీ జామీన్‌దారులు అడ్డంగా దొరికిపోయారు. న్యాయమూర్తి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు ముఠా సభ్యులను గురువారం అరెస్ట్‌ చేశారు.శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ డి.ప్రసాద్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జలదంకి మండలం బ్రాహ్మణక్రాక పంచాయతీ హనుమకొండపాళెం చెందిన కర్రా బాలరాజు కన్నకూతురిపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో తండ్రిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయడంతో ఈ ఏడాది జూలై 31వ తేదీ నుంచి కావలి సబ్‌జైలులో రిమాండ్‌ అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో జిల్లా కోర్టు బాలరాజుకు బెయిల్‌ మంజూరు చేసి, కావలి అడిషనల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో జామీనులను హాజరుపరచాలని ఆదేశించింది. అయితే బాలరాజుకు జామీన్‌ ఇచ్చేందుకు స్వగ్రామస్తులను అతని తండ్రి వెంకటయ్య కోరితే ఈసడించుకొన్నారు.

న్యాయవాది సహకారంతో..
తన కుమారుడికి జామీన్‌ ఇచ్చేందుకు వెంకటయ్య కావలిలోని బంధువైన రమణమ్మను సంప్రదించాడు. ఆమె సూచన మేరకు రహమాన్‌ అనే న్యాయవాదిని కలిశాడు. ఆయన రూ.20 వేలు ఫీజు అవుతుందని, అవసరమైన జామీనుదారుల కోసం కావలికే చెందిన యాకోబును కలవమని సూచించాడు. వెంకటయ్య యాకోబును కలిస్తే తాను ఇప్పుడు అలాంటి పనులు చేయడం లేదని, నెల్లూరులోని మీరామొహిద్దీన్‌ను కలవమని చెప్పి పంపాడు. అతన్ని వెంకటయ్య సంప్రదించగా రూ.10 వేలు ఖర్చు అవుతుందని చెప్పి నెల్లూరు నగరంలోని పడారుపల్లి జగ్జీవన్‌రామ్‌నగర్‌కు చెందిన కాకుముడి సుబ్బరామయ్య అలియాస్‌ చిన్నాతో డీల్‌ కుదిర్చాడు. చిన్నా నకిలీ రబ్బర్‌ స్టాంప్‌లు తయారు చేశాడు.

స్వాధీనం చేసుకొన్న నకిలీ రబ్బర్‌ స్టాంపులు

అదే ప్రాంతానికి మందా విద్యాసాగర్, తాటిపర్తి శివలను జామీన్‌దారులుగా సిద్ధం చేశాడు. అక్కుర్తి సుమన్‌ జామీన్‌దారులకు సంబంధించిన నకిలీ ప్రాపర్టీ ఫాంలను ఇందుకూరుపేట మండలం ఎంపీడీఓ, అదే మండలం మైపాడు పంచాయతీ కార్యదర్శి సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ జామీన్‌ పత్రాలు సృష్టించారు.
 
న్యాయమూర్తి అప్రమత్తతతో.. 
ఈ నెల 16వ తేదీ కర్రా బాలరాజు బెయిల్‌కు సంబంధించిన జామీన్‌దారులుగా మందా విద్యాసాగర్, తాటిపర్తి శివలను కావలిలోని అడిషనల్‌ మేజిస్ట్రేట్‌ పి.చైతన్య ముందు నాయ్యవాది రహమాన్‌ హాజరుపరిచారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే కేసు కావడంతో మేజిస్ట్రేట్‌ చైతన్య జామీన్‌దారుల్లో మందా విద్యాసాగర్‌ను నిందితుడు నీకు ఏమవుతాడని ప్రశ్నించారు. బాలరాజు తన చెల్లెలు భర్త అని చెప్పడంతో, మీ చెల్లెలు పేరేమిటని ప్రశ్నించడంతో తెల్లముఖం పెట్టేశాడు. దీంతో మేజిస్ట్రేట్‌ చైతన్యకు అనుమానం వచ్చి మళ్లీ విచారిస్తానని ఫైల్‌ పక్కన పెట్టారు. కోర్టులో మేజిస్ట్రేట్‌ ప్రశ్నలు అడుగుతుండగానే నకిలీ పత్రాలు సృష్టించి, వారితో పాటు వచ్చి కోర్టు బయటనే ఉన్న అక్కుర్తి సుమన్‌ పరారీ అయ్యాడు. జామీన్‌దారులుగా వచ్చిన మందా విద్యాసాగర్, తాటిపర్తి శివ కోర్టు హాలు నుంచి బయటకు వచ్చి అదృశ్యయ్యారు.

ఈ విషయంపై కావలి వన్‌ టౌన్‌ పోలీసులకు మేజిస్ట్రేట్‌ చైతన్య ఫిర్యాదు చేయడంతో సీఐ ఎం.రోశయ్య దర్యాప్తు చేపట్టారు. ముఠా బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాలోని సభ్యులైన కాకుమూడి సుబ్బరామయ్య, అలియాస్‌ చిన్నా, అక్కుర్తి సుమన్, మందా విద్యాసాగర్, తాటిపర్తి శివలను అరెస్ట్‌ చేశారు. కావలిలోని న్యాయవాది రహమాన్‌ ప్రోద్భలంతో నకిలీ షూరిటీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లుగా అంగీకరించారు. వారి వద్ద నుంచి నకిలీ రబ్బర్‌ స్టాంపులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ముఠాలో ఇంకా సభ్యులను అరెస్ట్‌ చేయాల్సి ఉందని డీఎస్పీ డి.ప్రసాద్‌ చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐ ఎం.రోశయ్య, ఎస్సై  సీహెచ్‌ కొండయ్య పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement