విజితరెడ్డి, అమృత, రవిచంద్ర, అనిత
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలులో ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసగించిన నలుగురు సభ్యుల ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితులు టి.అనిత, జి.విజితరెడ్డి, భార్యభర్తలు పి.రవిచంద్ర, అమృతల నుంచి రూ.14,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...పదో తరగతి వరకు చదివిన కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ గ్రామవాసి టి.అనిత 1989లో మెదక్‌జిల్లా కౌడపల్లికి చెందిన ఓంప్రకాశ్‌ను వివాహం చేసుకొని 15 ఏళ్ల క్రితం ఉప్పల్‌లోని చిలుకానగర్‌కు వచ్చి స్థిరపడింది. భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో అనిత గృహిణిగా ఉంటూ తన ముగ్గురు పిల్లల బాగోగులను చూసుకునేది. బోడుప్పల్‌లో ఉంటూ ఘట్‌కేసర్‌లోని మెగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విజితరెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరు డబ్బులు సంపాదించాలనే ఆశతో మెట్రో రైలులో టికెట్ జారీ అధికారులు, ట్రాక్ ఇంజినీర్లు, ఇంటిగ్రేటెడ్ అసిస్టెంట్ మేనేజర్లు, అసోసియేట్ మేనేజర్ల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసగించాలని పథకం వేశారు.
అప్పటికే ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న విజితరెడ్డి రవిచంద్ర, అమృత దంపతులను సంప్రదించింది. అమీర్‌పేటలో ఆసియన్ బ్రైట్ కెరీర్ (ఏబీసీ) కన్సల్టెన్సీని ప్రారంభించి కమ్యూనికేషన్ స్కిల్స్, కెరీర్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ తదితర కోర్సులను ఆఫర్ చేస్తున్న వారిని కలిసి మెట్రో అధికారులతో తమకు మంచి పరిచయాలున్నాయని, అభ్యర్థులను చూపిస్తే కమీషన్ ఇస్తామని చెప్పారు. ఒక్కో అభ్యర్థికి రూ.1,20,000 తీసుకుంటామని చెప్పడంతో వీరు ఇన్‌స్టిట్యూట్‌లోని ఒక్కో అభ్యర్థి నుంచి రూ.50 వేల నుంచి రూ.3,50,000 చొప్పున దాదాపు 1,27,20,000 వసూలు చేశారు. ఇందులో తమ వాటా తీసుకుని మిగతా మొత్తాన్ని టి.అనిత, విజితరెడ్డి అందజేశారు. అనిత మెట్రో రైలు హెచ్‌ఆర్ మేనేజర్లుగా కొత్త ప్రకాశ్, శివ ప్రసాద్ పేర్లపై నకిలీ నియామక పత్రాలు సృష్టించి విజితరెడ్డికి ఇవ్వడంతో ఆమె రవిచంద్ర, అమృతలకు ఇవ్వగా అభ్యర్థులకు ఇచ్చారు. అభ్యర్థులు మెట్రోరైలు అధికారులను అభ్యర్థులు కలవగా అవి నకిలీవని తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం నిందితులను అరెస్టు చేసి రూ.14,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment