ప్రేమ నాటకం.. పెళ్లిళ్ల బూటకం.. నమ్మారో ఇక అంతే! | HYD Police Arrested A Couple For Allegedly Extorting Money In FB | Sakshi
Sakshi News home page

భార్యభర్తల పక్కా స్కెచ్‌.. సింగిల్‌ స్టేటస్‌ ఉన్న యువకులే టార్గెట్‌

Published Fri, Jul 9 2021 9:57 AM | Last Updated on Fri, Jul 9 2021 11:43 AM

HYD Police Arrested A Couple For Allegedly Extorting Money In FB - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌ ద్వారా అనేక మందిని పరిచయం చేసుకుని, పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చి,, ఉద్యోగం పేరుతో డబ్బు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న భార్యభర్తల్ని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా... చిత్రంగా నిందితురాలే మరో బాధితుడిని వెంట బెట్టుకుని వచ్చి రెండే కేసు రిజిస్టర్‌కు కారణమైంది. ఈ కేసులో భర్తను అరెస్టు చేసిన అధికారులు, మూడు నెలల చిన్నారి ఉన్న నేపథ్యంలో భార్యకు సీఆర్పీసీ 41–ఏ నోటీసులు జారీ చేశారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గి ప్రాంతానికి చెందిన పున్నం నవీన్‌కుమార్‌ గత ఏడాది శిరీష అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కోస్గిలో కాపురం పెట్టినా తరచుగా హైదరాబాద్‌కు వచ్చి హోటళ్లలో బస చేసే వాళ్లు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ఇద్దరూ కలిసి సైబర్‌ నేరాలు చేయాలని పథకం వేశారు. ఇందులో భాగంగా శిరీష ఫేస్‌బుక్‌లో స్వప్నరెడ్డి పేరుతో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసింది. దీని నుంచి అనేక మందికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపింది. 

ప్రధానంగా తమ స్టేటస్‌ను సింగిల్‌ అంటూ సూచించే అవివాహిత యువకుల్నే ఎంచుకుంది. వీటికి స్పందించిన ఫ్రెండ్స్‌గా మారిన వారితో శిరీష, ఆమె మాదిరిగా నవీన్‌ చాటింగ్‌ చేసేవాళ్లు. ఫేస్‌బుక్‌ చాటింగ్‌ తర్వాత తమ నెంబర్లు ఇచ్చిపుచ్చుకుని వాట్సాప్‌కు మారేవాళ్లు. కొన్ని రోజుల తర్వాత ప్రేమ, పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చే వారు. కొన్నిసార్లు బాధితులు ఫోన్లు చేస్తే శిరీష మాట్లాడుతూ వారికి నమ్మకం కలిగించేది. పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం కావాలంటూ చెప్పే ఈమె తనకు పరిచయస్తుల ద్వారా మంచి ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికేది. ఆపై రంగంలోకి దిగే నవీన్‌ రకరకాల పేర్లు చెప్పి డబ్బు గుంజేవాడు.  

నగరానికి చెందిన ఓ యువకుడికి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం పేరుతో రూ.8 లక్షలు తీసుకుని మోసం చేశారు. అతడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం నవీన్‌కుమార్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న శిరీష ఇటీవల రూ.2 లక్షలు ఇచ్చిన మరో వ్యక్తిని వెంట పెట్టుకుని సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు వచ్చింది. అతడితో రాజీ పడుతున్నామని, భర్తను విడిచిపెట్టాలని కోరింది. అయితే ఈ బాధితుడు జరిగిన విషయం తెలుసుకుని మరో ఫిర్యాదు అందించడంతో ఇంకో కేసు నమోదైంది.

ఇలా వచ్చిన డబ్బుతో భార్యభర్తలు గోవా తదితర ప్రాంతాల్లో జల్సాలు చేసినట్లు తేలింది. నవీన్‌ను అరెస్టు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మూడు నెలల చిన్నారి ఉన్న శిరీషకు నోటీసులు జారీ చేసి పంపారు. ఈ పంథాలో వీళ్లు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని మోసం చేశారనే ప్రాథమిక ఆధారాలు ఉండటంతో ఆ కోణంలో ఆరా తీస్తూ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement