ఎప్పటికైనా హాలీవుడ్ సినిమా చేస్తా..
అదృష్టం, ఎ ఫిలిం బై అరవింద్, త్రీ, ఎ ఫిలిం బై అరవింద్ 2 లాంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు శేఖర్ సూరి త్వరలో గన్స్ ఆఫ్ బెనారస్ అనే బాలీవుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం నిర్మాణ దశలో ద్విభాషా చిత్రం డాక్టర్ చక్రవర్తి విశేషాలను సాక్షితో పంచుకున్నారు.
శేఖర్ సూరిగారు మీ బాలీవుడ్ మూవీ గన్స్ ఆఫ్ బెనారస్ త్వరలో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆల్ ది బెస్ట్...
థాంక్యూ..
ఎలాంటి సినీ నేపథ్యం లేని మీరు.. అసలు ఈ రంగంలోకి రావాలని ఎందుకనుకున్నారు.. మీకు ఇన్సిపిరేషన్ ఎవరు..?
నేను సినీ రంగంలోకి రావడానికి ముఖ్యంగా ఇద్దరు దర్శకులు కారణం ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొపోలా, గోవింద్ నిహల్ని. ఈ ఇద్దరి సినిమాలు చూసి నేను సినీ రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నాను. అయితే దర్శకుడిగా మారాలన్న నిర్ణయం మాత్రం రామ్ గోపాల్ వర్మ శివ రిలీజ్ అయిన తరువాతే తీసుకున్నా.
ఎక్కువగా కమర్షియల్, హీరో సెంట్రిక్ సినిమాలు నడుస్తున్న సమయంలో మీరు ఓ డిఫరెంట్ జానర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలా కొత్త పంథా ఎంచుకోవడానికి కారణం..
నాకు వ్యక్తిగతంగా థ్రిల్లర్స్ అంటే ఇష్టం. అయితే థ్రిల్లర్స్ మాత్రమే తీయాలని నేనేమి నిర్ణయించుకోలేదు. ఒక రెస్టారెంట్లో కూర్చున్న సమయంలో ఎ ఫిలిం బై అరవింద్ ఐడియా వచ్చింది. ఈ సబ్జెక్ట్ మీద వర్క్ అవుట్ చేద్దామనుకున్నా.. అలా ఆ ప్రాజెక్ట్ మీదే ముందుకెల్లా.. అంతేకాని ప్రత్యేకంగా ఓ జానర్ సినిమా చేయాలన్న ఆలోచనేమీ లేదు. అయితే ఎ ఫిలిం బై అరవింద్ సక్సెస్ తరువాత నిర్మాతలు అలాంటి కథలే కావాలనటంతో వరుసగా అలాంటి సినిమాలే చేస్తూ వచ్చాను. మధ్యలో కమర్షియల్ ప్రాజెక్ట్స్ చేద్దామనుకున్నా.. అవి సెట్ అవ్వకపోవటంతో థ్రిల్లర్ చిత్రాల దర్శకుడిగా ముద్రపడిపోయింది. అయినా ఇండస్ట్రీకి థ్రిల్లర్స్ తీసే దర్శకులు కూడా కావాలి కదా.. ప్రస్తుతం హిందీలో గన్స్ ఆఫ్ బెనారస్ చేస్తున్న అది గ్యాంగ్ స్టర్ సినిమా.. డాక్టర్ చక్రవర్తి అనే సినిమా చేస్తున్న అది నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నా.. అలా అన్ని రకాల కథలతో సినిమాలు చేస్తా.
మన దక్షిణాది నుంచి సినీ రంగంలోకి రావాలనుకునే వారు ఎక్కువగా చెన్నై, హైదరాబాద్లు వెళ్తారు.. కానీ మీరు మాత్రం సినీ రంగంలో అడుగుపెట్టడానికి ముంబై ఎందుకు వెళ్లారు..
నేను నా గ్రాడ్యూయేషన్ పూర్తవ్వగానే ముంబై వెళ్లిపోయాను.. దానికి ఓ కారణం ఉంది, నా చిన్నప్పటి నుంచి నాకు ఇంగ్లీష్ సినిమా చేయాలన్న కోరిక ఉండేది. అది రీచ్ అవ్వాలంటే ముందు బాలీవుడ్ అయితే కరెక్ట్ అన్న ఆలోచనతో నా సినీ ప్రయాణం ముంబై నుంచి స్టార్ట్ చేశాను. ఎప్పటికైనా కచ్చితంగా ఓ ఇంటర్నేషనల్ సినిమా చేస్తా. ఇండియన్ సినిమాకు బాలీవుడ్ అనేదే బేస్.. నేను అంతర్జాతీయ చిత్రం చేయాలన్నా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలన్నా బాలీవుడ్ అనేది ప్లాట్ ఫాం. అయితే అక్కడ నాకు అనుకున్న ప్లాట్ ఫాం దొరకలేదు. దీంతో తిరిగి హైదరాబాద్ రావాల్సి వచ్చింది. అదే సమయంలో టాలీవుడ్లో డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. ఎక్కడైన సినిమా చేయటం ముఖ్యం అన్న ఆలోచనతో ఇక్కడ సినిమా స్టార్ట్ చేశా.
బాలీవుడ్ ఇండస్ట్రీలోకి మీరు ఓ ఘోస్ట్ రైటర్గా ఎంట్రీ ఇచ్చారు.. అప్పటికే డైరెక్టర్ అవ్వాలన్న గోల్ ఉండేదా..?
బాలీవుడ్లో అడుగుపెట్టిన సమయంలో సర్వైవల్ కోసం చాలా మంది దగ్గర ఘోస్ట్ రైటర్గా వర్క్ చేశాను. కొన్ని థ్రిల్లర్ సీరియల్స్కు రైటర్గా వర్క్ చేశాను. మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన ఓ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా రాశాను. వాటిలో కొంత మంది క్రెడిట్ ఇచ్చేవారు.. క్రెడిట్ ఇవ్వని వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. అయితే అవ్వని డబ్బు కోసమే చేశా.. ఎప్పటికైన డైరెక్టర్ కావాలన్న ఆలోచనతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా.
మీరు డైరెక్టర్గా మారిన తరువాత వెంట వెంటనే మీ నుంచి సినిమాలు రాలేదు.. సినిమా సినిమాకు మధ్య రెండు మూడేళ్ల గ్యాప్ ఉండేది.. ఎందుకలా..
నా ప్రతీ సినిమాకు రెండేళ్ల గ్యాప్ వచ్చింది. అయితే అది నేను కావాలని తీసుకోలేదు.. అలా వచ్చిందంతే.. ఒక సినిమా అయిపోగానే నెక్ట్స్ వేరే జానర్ సినిమా చేయాలనుకోవటం. అది వర్క్ అవుట్ కాకపోవటం.. నిర్మాతలు థ్రిల్లర్ సినిమానే కావాలనటంతో అలా ఆలస్యమవుతూ వచ్చింది. కొంత మంది స్టార్స్కు కథ చెప్పినప్పుడు అది మెటీరియలైజ్ కాకపోవటం ఆ ప్రయత్నంలో చాలా టైం వేస్ట్ అవ్వటంతో గ్యాప్ వచ్చేది. నాకంటూ గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరు. నా అంతట నేనే వెళ్లి కథ చెప్పి కన్విన్స్ చేసి సినిమా సెట్స్ మీదకు తీసుకురావాలంటే టైం పట్టేది. ఇక మీదట వేగంగా సినిమాలు చేయాలని అనుకుంటున్నా.. ఏడాదికి రెండు సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నా. వాటిలో ఒకటి హిందీ, ఒకటి తెలుగు ఉండేలా చూసుకుంటా.
మీరు ఎవరి దగ్గరైనా దర్శకత్వ శాఖలో పనిచేశారా..? లేదా. ఏదైనా కోర్స్ చేశారా..?
నేను ఎవరి దగ్గరా అసిస్టెంట్గా పనిచేయలేదు.. ఏ కోర్సూ చేయలేదు. రోజుకు ఆరు ఇంగ్లీష్ సినిమాలు చూసేవాణ్ని అవి చూసే నేర్చుకున్నా.. నాకు సినిమాటోగ్రఫి మీద చాలా ఇంట్రస్ట్, ఒక దశలో సినిమాటోగ్రాఫర్ అవుదామని కూడా అనుకున్నా.. కానీ డైరెక్టర్ అయ్యా.. ఎంత మంచి కథైన సరిగ్గా తెరకెక్కిస్తేనే లైఫ్ వస్తుంది. అందుకే నా ప్రతీ సినిమాలో కెమెర వర్క్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటా.
త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న మీ బాలీవుడ్ మూవీ గన్స్ ఆఫ్ బెనారస్.. మీ గత చిత్రాల జానర్ లోనే ఉంటుందా..?
ఈ సినిమా ఒక గ్యాంగ్ స్టర్ మూవీ. ఆడియన్స్ శేఖర్ సూరి సినిమా నుంచి ఏం అయితే ఎక్స్పెక్ట్ చేయరో అవన్ని గన్స్ ఆఫ్ బెనారస్లో ఉంటాయి. అదే సమయంలో డాక్టర్ చక్రవర్తి కూడా పూర్తి కావచ్చింది. త్వరలో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాం. 2015లో ముంబైలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం.
థాంక్యూ శేఖర్ సూరిగారు.. మీ రాబోయే చిత్రాలు మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం.. ఆల్ ద బెస్ట్.