శారద (ఫైల్)
పెద్దకొత్తపల్లి (కొల్లాపూర్): ప్రేమించిన యువకుడితో పెళ్లి చేస్తారో లేదోనన్న అనుమానంతో ఓ యువతి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని జొన్నలబొగుడలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నరేష్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముడావత్ శారద(19) నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసింది. ఇదే గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడు హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వీరు గత కొం తకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఐదురోజుల క్రితం ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఈ విషయమై శారద తండ్రి బాలునాయక్ నాగర్‌కర్నూల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు వెళ్లి వారిని హైదరాబాద్ నుంచి తీసుకువచ్చారు.
పెద్దల సమక్షంలో మాట్లాడి పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. అయితే తల్లిదండ్రులు ప్రేమించిన యువకుడితో పెళ్లి చేస్తారో.. లేదోనన్న అనుమానంతో శుక్రవారం తెల్లవారుజామున పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరింది. గమనించిన కుటుంబ సభ్యు లు 108లో నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ మృతిచెందింది. ఈ ఘటనపై శారద తండ్రి బాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
విద్యార్థిని మృతిపై అనుమానాలు
నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్: పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడకు చెందిన శారద ప్రేమ విఫలమైందని ఫినాయిల్ తాగి మృతిచెందిన సంఘటనలో కుటుంబ సభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 9న డిగ్రీ పరీక్షలు రాసి ఇంటికి వెళ్లకుండా అదృశ్యమైందని, దీనిపై తండ్రి బాలునాయక్ 11న నాగర్‌కర్నూల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. వెంటనే పోలీసులు అనుమానం ఉన్న అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రమేష్‌ను విచారించగా తన వద్ద లేదని చెప్పాడు.
అనంతరం అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు హైదరాబాద్‌లో ఉందని, గురువారం రాత్రి పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ఓ ఇంట్లో ఉంచగా శుక్రవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడిందంటూ శుక్రవారం ఉదయం ఏడు గంటలకు చెప్పడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ బాలాజీ నాయక్, ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణ, సీనియర్ నాయకులు రాముడునాయక్ అనుమానం వ్యక్తం చేస్తూ శుక్రవారం కొల్లాపూర్ సీఐ సైదాబాబుకు తండ్రి బాలునాయక్‌తో కలిసి ఫిర్యాదు చేశారు. తన కూతురికి ఆత్మహత్యకు పాల్పడేంత పిరికితనం లేదని, ప్రేమించిందనే నెపంతోనే చంపించి ఉంటారని, ఆత్మహత్యకు పాల్పడి ఉంటే ఎలాంటి పాయిజన్ స్మెల్ రావాలని, కుడి, ఎడమ చేతులకు గాయాలు ఉన్నట్లు ఆరోపించారు. అయితే మృతదేహాన్ని నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తీసుకురాగా అక్కడ న్యాయం జరిగే వరకు పోస్టుమార్టం నిర్వహించేది లేదని ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు ఆందోళన చేశారు. పెద్దకొత్తపల్లికి చెందిన వ్యక్తులే ఏదైనా చేసి ఉంటారని అనుమానం ఉన్నట్లు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment