శారదా, నారదా, రోజ్‌ వ్యాలీల కథ ఇది | Mamata Banerjee’s 6-year rule riddled with Saradha, Narada, Rose Valley scams | Sakshi
Sakshi News home page

శారదా, నారదా, రోజ్‌ వ్యాలీల కథ ఇది

Published Sat, Mar 18 2017 10:37 AM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM

శారదా, నారదా, రోజ్‌ వ్యాలీల కథ ఇది

శారదా, నారదా, రోజ్‌ వ్యాలీల కథ ఇది

నారదా స్టింగ్‌ ఆపరేషన్‌పై సీబీఐ విచారణ చేయాలంటూ శుక్రవారం పశ్చిమ బెంగాల్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో షాక్‌ తగిలింది. అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో మూడు అతిపెద్ద అవినీతి కేసులు తృణమూల్‌ కాంగ్రెస్‌ను కుదిపేస్తున్నాయి. ఈ మూడు కేసుల్లోనూ మమతకు సన్నిహితులే నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. సరిగ్గా మూడేళ్ల క్రితం శారదా చిట్స్‌ ఫండ్స్‌ కుంభకోణంపై ఆదేశాలు జారీ అయ్యాయి. రోజ్‌ వ్యాలీ స్కాం.. మమత అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో బయటపడిన అతిపెద్ద కుంభకోణం. దాదాపు రూ.17 వేల కోట్ల రూపాయల అవినీతి ఇందులో జరిగినట్లు భావిస్తున్నారు. వేల కోట్లలో కుంభకోణాలు జరిగిన వీటి గురించి ఓ సారి చూద్దాం.

శారదా కుంభకోణం
చిట్స్‌ ఫండ్స్‌ పేరుతో వేల మంది సామాన్యులకు కుచ్చుటోపి పెట్టింది శారదా చిట్‌ ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. దీని బాధితులు కేవలం బెంగాల్‌లోనే కాకుండా ఒడిశా, జార్ఖండ్‌, అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. దాదాపు రూ.2,500 కోట్లతో ఉడాయించిన శారదా చైర్మన్‌ సుదీప్త సేన్‌, ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ డెబ్జానీ ముఖర్జీలను పోలీసులు కశ్మీర్‌లో పట్టుకున్నారు. శారదా కుంభకోణం కారణంగా బెంగాల్‌లో వందల మంది సామాన్య ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. కోల్‌కతా మహానగరం నుంచి చిన్న పట్టణాలు, గ్రామాల్లోని ఏజెంట్లు, డిపాజిటర్లు బలవన్మరణం చెందారు.

శారదా చిట్‌ఫండ్స్‌ నడిపిన వారే తృణమూల్‌ కాంగ్రెస్‌లో ఉన్నా 2013 గ్రామీణ ఎన్నికల్లో ఆ పార్టీ జయకేతనం ఎగరేసింది. 2014 మే నెలలో శారదా కేసును విచారించాలని సీబీఐను సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ఒక్కసారిగా తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ప్రారంభమైంది. వారు అనుకున్నట్లే రాష్ట్ర క్రీడా, రవాణా శాఖల మంత్రి మదన్‌ మిత్రాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 21 నెలల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలైయ్యారు. తృణమూల్‌కే చెందిన ఎంపీ శ్రీనిజాయ్‌ బోస్‌, ఉపాధ్యక్షుడు రజత్‌ మజుందార్‌ మరికొందరు పార్టీ నాయకులు ఈ కేసులో అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు.

రోజ్‌ వ్యాలీ కుంభకోణం
చిట్‌ఫండ్స్‌ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్‌లో వెలుగులోకి వచ్చిన మరో స్కాం.. రోజ్‌ వ్యాలీ. ఈ కుంభకోణంలో రోజ్‌ వ్యాలీ గ్రూప్‌ రూ.17 వేల కోట్లతో బోర్డు తిప్పేసింది. దీంతో మరోసారి బెంగాల్‌ ప్రజలు రోడ్డున పడ్డారు. తృణమూల్‌ పార్టీకి చెందిన ఎంపీలు సుదీప్‌ బందోపాధ్యాయ, తాపస్‌ పాల్‌లు ఈ కేసులో అరెస్టు అయ్యారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ మరికొంత మంది తృణమూల్‌ లీడర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం ఈ కేసులో బసుదేబ్‌ బగ్చీ, అవిక్‌ బగ్చీలను అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్‌లో ఫిల్మ్‌సిటీ కలిగివున్న ప్రముఖ ప్రయోగ్‌ గ్రూప్‌(రూ.12,500కోట్ల విలువైనది) వీరిదే.

నారదా కుంభకోణం
నారదా కుంభకోణంలో చేతులు మారిన డబ్బు విలువ రూ. 5 లక్షలే. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కొందరు నేతలు డబ్బులు తీసుకుంటున్న వీడియోను 'నారదా న్యూస్‌.కామ్‌' విడుదల చేసింది. అంతే ఒక్కసారిగా రాష్ట్రంలోని వార్తా చానెళ్లు అన్నీ ఆ వీడియోను ప్రసారం చేశాయి. తృణమూల్‌కు చెందిన నేతలు స్వయంగా ఈ వీడియోలో కనిపించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శుక్రవారం నారదా స్కాంపై ప్రాథమిక విచారణ జరిపి 72 గంటల్లో రిపోర్టు ఇవ్వాలని సీబీఐను పశ్చిమ బెంగాల్‌ హైకోర్టు ఆదేశించింది. శారదా, రోజ్‌ వ్యాలీ కుంభకోణాల కంటే ఎక్కువ మంది నారదా స్కాంలో సంబంధాలు కలిగివున్నట్లు తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement