ఎర్నాకులం టౌన్‌హాల్, కేరళ. చేతిలో ఓ కవర్‌తో సీనియర్ నిర్మాత వీవీ ఆంటోని ఓపికగా ఎదురుచూస్తున్నారు. ఆ మీటింగ్ కోసం సుమారు నలభై ఏళ్ల నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు ఆంటోని. పాత బాకీ తీర్చడం కోసం, తన మాట నిలబెట్టుకోవడం కోసం. 1979లో ‘పుష్యరాగం’ అనే మలయాళ సినిమాను నిర్మించారు ఆంటోని. మధు, జయన్, శారద, శ్రీవిద్య ముఖ్య పాత్రల్లో నటించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల శారదకు పూర్తి పారితోషికం ఇవ్వలేకపోయారు ఆంటోని. ఆ తర్వాత మరో రెండు సినిమాలకు భాగస్వామ్యం వహించినా లాభాలు చూడలేకపోయారాయన. కాలం ఫాస్ట్‌ఫార్వాడ్‌లో 40 ఏళ్లు గిర్రున తిరిగింది. ఆంటోని ఆర్థికంగా నిలదొక్కుకున్నారు.
కానీ శారదకు ఇవ్వాల్సిన పారితోషికం ఇంకా ఇవ్వలేదనే ఆలోచన మాత్రం తనని నిలబడనివ్వడం లేదు. శారదను కలసి మిగిలిన పారితోషికాన్ని ఇచ్చేద్దాం అనుకుంటున్న సమయంలో శారదే ఓ ఈవెంట్ కోసం కేరళ వస్తున్నారని తెలుసుకున్నారు ఆంటోని. ‘ఆది మక్కళ్’ అనే సినిమా 50 సంవత్సరాల వేడుక కోసం ముఖ్య అతిథిగా హాజరయ్యారు శారద. అక్కడే శారదను కలిశారు ఆంటోని. తనతో సినిమా నిర్మించిన నిర్మాతను గుర్తుపట్టి యోగక్షేమాలు మాట్లాడారు శారద. మాటల మధ్యలో మిగిలిన పారితోషికాన్ని అందజేశారు ఆంటోని. మిగిలిన పారితోషికం అందించడానికే ఆయన వచ్చారని తెలిసి శారద ఆశ్చర్యపోయారు. ఆమెకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చాక ఆంటోని కుదుటపడ్డారు. అలా నలభై ఏళ్లకు ఆంటోని తన బాకీ తీర్చుకున్నారు. ‘నిర్మాత నా పారితోషికం ఎగ్గొట్టారు’ అని నటీనటులు వాపోతున్న సందర్భాలు చూశాం. అయితే ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఇవ్వాల్సిన బాకీని చెల్లించిన ఆంటొనీలాంటి నిర్మాతలు అరుదుగా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment