మలయాళ నటుడు ‘అంగమాలి డైరీస్’ ఫేం అంటోని వర్గీస్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ఇష్టసఖి అనిషా పౌలోస్‌తో కలిసి ఆగష్టు 8న ఏడడుగులు వేయనున్నాడు. పెళ్లి ఘడియలు దగ్గరపడుతుండటంతో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా హల్దీ ఫంక్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇందులో ఆంటోనీ వర్గీస్ తెల్లని కుర్తా, ధోతిని ధరించగా, అనిషా హల్దీ వేడుక కోసం ఆకుపచ్చ,పసుపు ధరించింది. ఈ జంట తమ స్నేహితులతో కలిసి సూపర్‌హిట్ పాటలకు హుషారుగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇక ఇటీవలే అనిషాతో నటుడు నిశ్చితార్థం చేసుకున్నాడు. కేరలోని అంగమాలిలో జరిగిన ఈ వేడుకకు కోవిడ్ కారణంగా అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు.
కాగా ఆంటోని, అనిషా పౌలోస్ చిన్ననాటి స్నేహితులు. అనిషా అంగమాలి ప్రాంతానికి చెందిన వృత్తిరీత్యా నర్సు. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వీరి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించడంతో లవ్ కమ్ ఆరేంజ్డ్ మ్యారేజ్‌గా మారింది. ఇక ఆంటోని విషయానికొస్తే 2017లో విడుదలైన అంగమాలి డైరీస్ చిత్రంతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
ఈ చిత్రంలో వెన్సెంట్ పెపే పాత్ర పోషించిన తనకు అనంతరం అభిమానులు ముద్దుగా పెపే పేరుతోనే పిలవడం ప్రారంభించారు. ఈ సినిమా ఘన విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు పొందడంతో ఆంటోని మంచి పేరు సంపాదించాడు. ఆ తరువాత జల్లికట్టు, స్వతంత్ర్యం అర్ధరాత్రి వంటి చిత్రాల్లో నటించగా ప్రస్తుతం అజగజంతరం, జాన్ మేరీ, ఆనప్రంబిలే వరల్డ్ కప్, ఆరవం చిత్రాలు చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment