మజ్జిగ చిలికితేనే కదా వెన్న వచ్చేది.73 ఏళ్ల జీవితాన్ని వడగడితేనే కదా సూక్ష్మం తెలిసేది.ఎండ ఆవిరిని పుట్టిస్తేనే కదా మేఘం కురిసేది.చలి కొరికితేనే కదా జీవితం రుచి తెలిసేది. ఇంత చూసిన శారద... మంచి మాటల వెన్నముద్ద.
బర్త్‌డే సందర్భంగా మీ గురించి మాత్రమే కాదు.. మీతో సొసైటీకి ఉపయోగపడే నాలుగు మంచి మాటలు చెప్పించాలనుకుంటున్నాం శారదగారూ.. ముందుగా మీకిది ఎన్నో బర్త్‌డేనో చెబుతారా?
73 క్రాస్ చేశాను. నేను పుట్టింది 25–06–45. కానీ ఎవరికి వాళ్లు వాళ్లకు నచ్చిన డేట్ వేసుకుంటున్నారు. ఒక్క ఫోన్ చేసి అడిగితే కరెక్ట్ డేట్ చెబుతాను కదా. నేను ఒక్క భాషలో కాదు.. మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ.. ఇలా ఎన్నో భాషల్లో సినిమాలు చేశాను. ఇష్టం వచ్చిన డేట్ వేయడం వల్ల బోలెడన్ని ఫోన్ కాల్స్, మెసేజ్‌లు. చేసేవాళ్లకు, నాకు టైమ్ వేస్ట్. అందుకే ఈ ఇంటర్వ్యూలో క్లియర్ చేస్తున్నా. నా బర్త్‌డే జూన్ 25న.
చిన్నప్పుడు బర్త్‌డేలు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు ?
మా అమ్మగారు సత్యవతికి భక్తి ఎక్కువ. అమ్మమ్మ పేరు కనకమ్మ. తండ్రి వెంకటేశ్వర్లు. పేర్లు ఎందుకు చెబుతున్నానంటే ఇప్పటికీ మా అమ్మ పేరు కనకమ్మ అని రాస్తున్నారు. నా పుట్టినరోజుకి ఇంట్లో మా అమ్మగారు గణపతి హోమం, సుదర్శన హోమం చేయించేవారు. ఆకలితో ఉన్నవారికి భోజనాలు పెట్టించేవారు. ఆడంబరాలు ఉండేవి కావు. ఉన్నదల్లా ఇతరులకు ఉపయోగపడే పనులు చేయాలనే ఆలోచన తప్ప. నాక్కూడా అలంకారాలు ఇష్టం ఉండదు. పువ్వులు, లైట్లు కోసం డబ్బులు వేస్ట్ చేసే బదులు మంచి పనికి ఉపయోగించాలనుకుంటా.
మీ అమ్మమ్మగారు స్ట్రిక్ట్‌గా ఉండేవారట. నటనే అయి నా హీరోలను మిమ్మల్ని తాకనిచ్చేవారు కాదట?
అవును. మా అమ్మమ్మగారు భయంకరమైన స్ట్రిక్ట్ (నవ్వుతూ). నేను కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్నాను. నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి, ‘మా భూమి’ అనే కమ్యూనిస్ట్ నాటకంలో చెల్లెలిగా చేయమని అడిగారు. మా అమ్మమ్మగారు ఎలాగో ఒప్పుకున్నారు. రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు అక్కడే కుర్చీ వేసుకుని కూర్చునేవారు. మగవాళ్లను దూరంగా నిలబడి డైలాగులు చెప్పమనేవారు. నా మీద చేయి వేస్తారేమోనని ఆమె భయం. ఆ రోజుల్లో అమ్మమ్మ అంత స్ట్రిక్ట్‌గా ఉండబట్టే మేం క్రమశిక్షణగా పెరిగాం.
అంత స్ట్రిక్ట్‌గా ఉన్న అమ్మమ్మ మిమ్మల్ని సినిమా హీరోయిన్‌ని చేయడానికి ఎలా ఒప్పుకున్నారు?
అమ్మమ్మ ఇంటి వరకే. పైగా వయసు మీద పడేకొద్దీ పెద్దవాళ్లు వెనకబడిపోతారు. మనం ప్రపంచంతో పాటు ముందుకెళతాం కదా. నిజానికి నేను సినిమాల్లోకి రావాలన్నది మా అమ్మగారి ఆశ. ‘నా కూతురిలో ఏదో ఉంది’ అన్నది అమ్మ నమ్మకం. అందుకే మా నాన్నగారిని ఒప్పించారు.
ఒకానొక దశలో మిమ్మల్ని మలయాళీ అమ్మాయి అనుకున్నారట. అంతగా మలయాళంలో పేరు తెచ్చుకోవడం, అక్కడ ‘ఊర్వశి’ అవార్డు అందుకోవడం పట్ల మీ అనుభూతి?
నేను తమిళంలో ఓ సినిమా చేస్తున్నప్పుడు మలయాళ దర్శక–నిర్మాత కుంచకోగారు ‘ఇన్‌ప్రావుగళ్’ అనే సినిమా ప్లాన్ చేస్తున్నారు. తమిళ సినిమాకి చేసిన సౌండ్ ఇంజనీర్ కన్నన్‌గారు ‘శారద అనే అమ్మాయి బాగా యాక్ట్ చేస్తుంది’ అని నా గురించి చెబితే, కుంచకోగారు తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడ కంటిన్యూస్‌గా సినిమాలొచ్చాయి. అందుకే మలయాళీ అమ్మాయిని అని చాలామంది అనుకున్నారు. మలయాళంలో చేసిన ‘తులాభారం’ నాకు నేషనల్ అవార్డ్ కూడా తెచ్చింది. అదే సినిమాని తెలుగులో ‘మనుషులు మారాలి’గా తీశారు. ఆ సినిమాకి జెమినీ వాసన్‌గారు నిర్మాత. ‘ఆ అమ్మాయి ఏం చేస్తుంది?’ అని చాలామంది అంటే, ఎవరి మాటా వినకుండా వాసన్‌గారు నన్ను తీసుకున్నారు. ‘నేను తమిళ అమ్మాయిని అనుకుని తెలుగు నేర్పించండి. ఈ సినిమా ఆ అమ్మాయే చేయాలి’ అన్నారు. ‘ప్రతిధ్వని’ సినిమాలో రామానాయుడుగారు నన్ను పోలీసాఫీసర్ క్యారెక్టర్‌కి తీసుకున్నప్పుడు కూడా ‘చీర కట్టుకునే శారద పోలీస్ యూనిఫామ్‌లోనా’ అన్నవాళ్లూ ఉన్నారు. ఆయన నన్ను నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టాను. అలాగే ‘అనసూయమ్మగారి అల్లుడు’లో నాది కామెడీ వేషం. పరుచూరి బ్రదర్స్ రాశారు. వాళ్లిద్దరూ నాకు సొంత అన్నదమ్ముల్లా. ‘తులాభారం’ తమిళ, హిందీ రీమేక్స్‌లోనూ నేనే చేశా. నాకు తెలిసి ఒకే సినిమాని నాలుగు భాషల్లో చేసే అవకాశం నాకే దక్కిందేమో.
మీ అమ్మమ్మ గురించి మాట్లాడుతూ ఆవిడ స్ట్రిక్ట్‌గా ఉండటంవల్లే క్రమశిక్షణగా పెరిగామన్నారు. ఈ తరం పిల్లలను ఎలా పెంచాలి?
భక్తి నేర్పించాలి. చిన్నప్పుడు పిల్లలకు దేవుడికి దండం పెట్టాలని నేర్పితే అది అలవాటవుతుంది. స్కూల్‌కి వెళ్ళేటప్పుడు, ఏదైనా మంచి పని చేసే ముందు దండం పెట్టుకో అని చెప్పాలి. అది పాజిటివ్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఏదో ఫోర్స్ ఉందని తప్పు చేయడానికి భయపడతారు.
అంటే... భక్తిని పిల్లల మీద రుద్దుతున్నట్లు కాదా?
కాదు. మంచి చెప్పే పద్ధతుల్లో ఇదొకటి. అది తప్పు, ఇది రైట్ అని తెలియజేయడం కోసం చిన్నప్పుడు అలాంటివి పాటించాలి. పెద్దయ్యాక మంచీ చెడూ తెలుసుకుంటారు కాబట్టి, దేవుణ్ణి ఫాలో అవ్వాలా? వద్దా? అనే నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అప్పుడు వాళ్ల నిర్ణయాన్ని మనం ఆమోదించాలి. మనం కన్న పిల్లలే కదా అని మన పంతం నెగ్గించుకోవాలనుకోకూడదు.
ఇప్పుడు పిల్లలు చాలా సెన్సిటివ్‌గా ఉంటున్నారనిపిస్తోంది.. సీట్ దొరకలేదని ఆ మధ్య ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఏమనిపిస్తుంది?
టీవీలో చూసినప్పుడు బాధ అనిపించింది. ఆ పాప మనసులో ఏం ఉందో? ‘ఇంత కష్టపడి నన్ను మా ఇంట్లో చదివించారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను’ అని బాధపడిందేమో. లేదంటే పేరెంట్స్ బాగా స్ట్రిక్ట్ అయితే ‘నన్ను కొడతారు.. తిడతారు’ అని భయపడిందేమో. తన మనసులో ఏం ఉందో మనకు తెలియదు కదా. మానసికంగా బలహీనంగా ఉన్నవాళ్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే పిల్లలను బలహీనులుగా పెంచకూడదు. అలాగే పిల్లల మీద ప్రెషర్ పెట్టడం తప్పు. తల్లిదండ్రులు ఇద్దరూ డబ్బు సంపాదనలో పడిపోయి బిజీ అయిపోతున్నారు. వాళ్లకు పిల్లలతో మాట్లాడే ఖాళీ ఎక్కడుంటుంది? పిల్లలకు ఏం నేర్పుతారు? పిల్లల పెంపకంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భావితరం వాళ్లే కదా.
మరోలా అనుకోకండి.. మీకు పిల్లలు లేరు కదా.. పిల్లల పెంపకం గురించి ఇంత బాగా ఎలా చెప్పగలుగుతున్నారు?
నా తమ్ముడికి ఇద్దరు కూతుళ్లు. కంటేనే పిల్లలవుతారా? తోడబుట్టినవాళ్ల పిల్లలు పిల్లలు కాదా?
మీరు ఒంటరిగా ఉంటారేమో అనుకున్నాం?
తమ్ముడు ఫ్యామిలీతో ఉంటున్నాను. నా మరదలు మంచిది. నా మేనకోడళ్లను పెంచాను. వాళ్లు నన్ను బాగా చూసుకుంటారు. ఓ మేనకోడలు పేరు హేమా సుబ్రహ్మణ్యం. తనకి గొప్ప పేరుంది. తను యూట్యూబ్‌లో ఫేమస్. అల్లుళ్లు మంచివాళ్లు. నేను హ్యాపీగా ఉన్నాను. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. రోజూ పూజించేటప్పుడు ‘లోకాన్ సమస్తాన్ సుఖినోభవంతు’ అని ప్రార్థిస్తుంటా.
మీరు మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అనిపిస్తోంది. ఎంత స్ట్రాంగ్‌గా ఉండేవాళ్లకైనా ఏదైనా కష్టం వస్తే సపోర్ట్ కోరుకుంటారు. మరి మీకు సపోర్ట్?
నా మనసు. మనిషి బాగుండటానికి, బాగాలేకపోవడానికి మనసే కారణం. మనసు దృఢంగా లేకపోతే వీక్ అవుతాం.
ఫిజికల్లీ కూడా హెల్దీగా ఉన్నారనిపిస్తోంది...
కొంత కాలం క్రితం ఓ డాక్టర్‌గారిని కలిస్తే, ఆయన కొన్ని టెస్టులు చేశారు. నాకు బీపీ లేదు. షుగర్ లేదు. కొలెస్ట్రాల్ లేదు. ‘నాన్‌వెజ్ తినకపోవడం వల్లే ఇంత హెల్దీగా ఉన్నారు’ అన్నారా డాక్టర్. ఆహారపు అలవాట్లు మాత్రమే కాదు నేను వీలైనంత ప్రశాంతంగా ఉంటాను.
అంటే.. ఎప్పుడూ నాన్‌వెజ్ తినలేదా?
బేసిక్‌గా నేను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినదాన్ని. నాన్‌వెజ్‌కి దూరం. అయితే ఇంటి నుంచి బయటికొచ్చాక చుట్టుపక్కల ఉన్నవాళ్లతో కలిసినప్పుడు అలవాటైంది. లైట్‌గా తినేదాన్ని. తినేటప్పుడు కూడా పిల్లలకు అన్యాయం చేస్తున్నామా? అనే బాధ ఉండేది. మనం దేన్నయితే తింటున్నామో అది దాని పిల్లలకు ఆహారం సేకరించడం కోసం బయటకు వచ్చి ఉంటుందేమో. మనం దీన్ని తినేయడంవల్ల అక్కడ పిల్లలు ఆకలితో అలమటించిపోతా రనే బాధ ఉండేది. మానేశాక హాయిగా అనిపిస్తోంది.
ఆ ఫీలింగ్‌తోనే మానేశారా?
ఓ కారణం అది. హైదరాబాద్ నుంచి కర్ణాటక మధ్యలో గుల్బర్గాలో ధ్యానబొంది అని ఉంది. అక్కడ ‘మాణిక్యేశ్వరీ దేవి’ అని ఉంటారు. ఆమె ఒక గదిలో ఉంటారు. ఆహారం తీసుకోరు. గది నుంచి ఎప్పుడో కానీ బయటకు రారు. «ధ్యానం చేస్తుంటారు. నా కజిన్ ద్వారా ఆమె గురించి విని, వెళ్లాను. నా అదృష్టం కొద్దీ నేను వెళ్లిన రోజున ఆమె గది నుంచి బయటికొచ్చారు. ఆడవాళ్లను ‘ఏమే’ అని మగవాళ్లను ‘ఏరా’ అని అంటారు. నన్ను చూడగానే ‘ఏమే నీచు తింటున్నావా? నీకేం అధికారం ఉందని వాటిని చంపి తిన్నావు? నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చనిపోతే శవం అంటాం. మైలు అని పాటిస్తాం. ఆ ప్రాణిని చంపినప్పుడు అది శవం కాదా? మైలు కాదా? దాన్ని ఎలా తింటున్నావు?’ అని అడిగేసరికి సిగ్గుపడిపోయా. అప్పటినుంచి తినడం మానేశాను. ఇక్కడ మీకో విషయం గురించి చెప్పాలి. తినేవాళ్లను నేను విమర్శించడంలేదు. నాకు కలిగిన ఫీలింగ్‌ని మాత్రమే చెప్పాను. మనం ఒక విషయాన్ని ఇష్టపడకపోతే మిగతావాళ్లకూ నచ్చకూడదనుకుంటే అది మన ‘పిచ్చి’ అవుతుంది. ఆ పిచ్చి ప్రవర్తన నాకు లేదు.
సినిమాలు తగ్గించారు. ఎలా స్పెండ్ చేస్తున్నారు ?
రిలాక్స్ అవ్వడంలేదు. బిజీ. నాకు బోలెడన్ని ఫంక్షన్స్. ఫ్రెండ్స్ ఎక్కువ. సినిమా ఇండస్ట్రీలో అందరితో బాగుంటాను. కానీ బయట ఫ్రెండ్సే ఎక్కువ. నాకు రిలాక్స్‌డ్‌గా తిని కూర్చోవడం ఇష్టం ఉండదు. ప్రకృతిని ప్రేమిస్తుంటా. దైవం కంటికి కనిపించడు కాబట్టి కంటికి కనిపించే ప్రకృతిని దైవం అనుకుంటా. చెట్లంటే చాలా ఇష్టం. చెట్లు నాటడం వల్ల పర్యావరణానికి మంచిది. చాలామందికి ఉంటుంది చెట్లు నాటాలని. కానీ దాన్ని కార్యాచరణలో పెట్టేలా మోటివేట్ చేయాలి. పొల్యూషన్ తగ్గించొచ్చు. తులసి చెట్టుని తీసుకోండి. 24 గంటలూ తులసి చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది. దాని చుట్టూ తిరగడం ఆరోగ్యానికి మంచిది. పెద్దలు ఏదీ ఊరికే చెప్పరు.
అదే పెద్దలు పాత రోజుల్లో సతీసహగమనం అనీ, భర్త చనిపోగానే భార్య తెల్లచీర కట్టుకోవాలనీ అన్నారు కదా... వాటి గురించి ఏమంటారు?
ప్రాణంతో ఉన్న మనిషిని నిప్పుల్లోకి నెట్టడమా? భర్త చనిపోతే అతనితో పాటే భార్య చనిపోవాలా? అది కాకపోతే అప్పట్లో పదీ పదకొండు పన్నెండేళ్లకే పెళ్లిళ్లు చేసేసేవాళ్లు. పెళ్లయిన ఏడాదికే భర్త చనిపోతే ఆ పిల్లకు గుండు కొట్టిస్తారు. జీవితాంతం తెల్ల చీరలే కట్టుకోవాలి. ఎంత బాధ? నేను ఆచార వ్యవహారాల గురించి ఏమీ మాట్లాడటంలేదు. అయితే ఆ నిబంధనలు తప్పా? కరెక్టా? అనడిగితే పర్సనల్‌గా నాకు ఇష్టం లేదని చెబుతాను. మనిషిని ఇబ్బందిపెట్టే ఆచారాలు ఎందుకు? కానీ ఏ పెద్దలైతే ఇలాంటి కట్టుబాట్లు విధించారో.. వాటిని ఎదిరించడానికి వేరే పెద్దలు ఉండేవారు. తప్పు మాట్లాడేది పెద్దలే. వాటిని ఖండించేది వాళ్లే. అలా ఉండబట్టే కదా.. కాలక్రమేణా అవి లేకుండాపోయాయి.
ఆర్టిస్ట్‌గా ఏదైనా డ్రీమ్ రోల్?
ఒకటి ఉంది. మలయాళంలో ఉంటుంది. నాది లీడ్ రోల్. ఇద్దరు హీరోలు చేస్తారు.
మీ జీవిత చరిత్రతో ఎవరైనా సినిమా తీస్తానంటే?
బయోపిక్‌కి జీవిత చరిత్ర కావాలి. నా దాంట్లో చరిత్రే లేదు (నవ్వుతూ).
ఫైనల్లీ సరస్వతీదేవి నుంచి శారదగా.. ‘ఊర్వశి’ శారదగా ఎదిగినందుకు మీ ఫీలింగ్?
మా అమ్మానాన్న తర్వాత నాకు కళ అంటే ఇష్టం. కళను దైవం అనుకున్నాను. ఆ దైవం తర్వాత నాకు ఇండస్ట్రీ అంటే అభిమానం. ఆ తర్వాత ప్రేక్షకులు. వాళ్లు చూపించిన అభిమానం మరచిపోలేనేది. ఇప్పుడు నా ఆశయం ప్రకృతిని కాపాడుకోవడానికి ఏదైనా చేయడమే. స్వతహాగా ఎవరికీ హాని చేయకూడదనే మనస్తత్వం ఉన్న మనిషిని. అలాగని నేనొక్కదాన్నే మంచిదాన్ని అని ఎప్పుడూ అనుకోను. మంచి చేయడానికి మాత్రం ప్రయత్నిస్తాను.
మీ తరంతో పోల్చుకుంటే నేటి తరం హీరోయిన్ల గురించి మీ ఒపీనియన్?
అప్పట్లో స్టోరీలు బాగుండేవి. మాకు మంచి మంచి అవకాశాలు వచ్చాయి కాబట్టి, ప్రూవ్ చేసుకున్నాం. ఈ జనరేషన్ హీరోయిన్లను తక్కువ చేయలేం. వాళ్లూ బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నారు. అయితే మాకున్నంత స్కోప్ లేదు.
సినిమా ఇండస్ట్రీలో ‘హెరాస్‌మెంట్’ అని కొందరు హీరోయిన్లు బాహాటంగానే చెబుతున్నారు. అప్పట్లోనూ అలా ఉండేదా?
ఉండేది. కానీ మీడియా ఇంత లేదు కాబట్టి బయటకు రాలేదు. అయితే అప్పట్లో మగవాళ్లకు కొంచెం భయం ఉండేది. ఎలా పడితే అలా వ్యవహరించడానికి కాస్త సంశయించేవారు. ఇప్పుడు సినిమా పరిశ్రమలోనే కాదు.. సమాజ ధోరణి మారిపోయింది. అందరిలోనూ ఓ తెగువ వచ్చేసింది. ఆ తెగువతో ఏదేదో చేస్తున్నారు.
మీ బర్త్‌డే గురించి చెబుతున్నప్పుడు ఆడంబరాల పేరుతో డబ్బుని వేస్ట్ చేయడం నచ్చదనీ, ఇతరులకు ఉపయోగిస్తే మంచిదనీ అన్నారు. దాన్నిబట్టి మీలో సేవాగుణం ఉందేమో అనిపిస్తోంది?
చేసే సేవ గురించి చెప్పుకోకూడదు. మా నాన్నగారు నాకు చెప్పిన ఓ విషయం ఎప్పటికీ గుర్తుంటుంది. చిన్నప్పుడు కంచంలో నుంచి ఒక్క మెతుకు కింద పడినా.. ఆ మెతుకు కోసం ఎంతమంది ఆరాటపడతారో తెలుసా? అనేవారు. ‘నీకెంత కావాలో అంతే పెట్టుకో.. వృథా చేయొద్దు’ అనేవారు. ఏ ఫంక్షన్‌కి వెళ్లినా ఆ మాటలు గుర్తొస్తాయి. కంచం నిండా పెట్టుకుంటారు. సగమే తింటారు. మిగతా సగం చెత్తకుప్పలోకి. ఎంత బాధగా ఉంటుందో. మనం విసిరేసిన విస్తరిలో మిగిలింది తిని, ఆకలి తీర్చుకునేవాళ్లు ఉంటారు. కానీ విసిరేసే విస్తరిలో భోజనం కాకుండా, మనం కావాల్సినదే తిని, మిగిలిన భోజనాన్ని హుందాగా మంచి విస్తరిలో పెట్టొచ్చు. నేను చాలా మటుకు ఫంక్షన్స్‌లో భోజనం చేయడంలేదు. కంచం నిండా పెట్టుకుని, వృథా చేస్తుంటారు. నేను అది చూడలేను.
మీ తరం హీరోయిన్లను కలుస్తుంటారా?
3 నెలలకు ఒక్కసారి తప్పకుండా కలుస్తుంటాం. కన్నడ భారతి, జయంతి, మేనక (నటి, కీర్తీ సురేశ్ తల్లి) అందరం తరచూ కలుస్తుంటాం. జయంతి గురించి ఆ మధ్య రాయకూడని వార్త వచ్చింది. ఏంత నీచం? సోషల్ మీడియాని మంచికి ఉపయోగించాలి. ఇక్కడ గజం గజానికి ఒక నీచుడు ఉన్నాడు. వాట్సాప్‌లో నీతులు చెబుతూ ఇంతింత మెసేజ్‌లు రాస్తుంటారు. అది వాళ్లు ఫాలో అయ్యేదీ లేదూ.. చచ్చేది లేదు. నేనెప్పుడూ వెబ్‌సైట్లు చూడను. సోషల్ మీడియాలో ఉండను. నాకు తెలిసిందల్లా యాక్ట్ చేయడం. ఎవరైనా ఆకలితో ఉన్నాం అంటే అన్నం పెట్టడం. చదువుకోవాలని ఉండీ, స్తోమత లేదంటే ఆసరాగా ఉండటం. అంతే..
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment