
కోలీవుడ్ ప్రముఖ సినీ గేయ రచయిత స్నేహన్, నటి కనిక కుమార్తెలకు కమల్ హాసన్ అదరిపోయే కానుక అందించారు. తమిళ చిత్రపరిశ్రమలో పాటల రచయితగా స్నేహన్‌కు మంచి గుర్తింపు ఉంది. ఆయన తెలుగులో కూడా ప్రియమైన నీకు చిత్రంలో పాటలు రాశారు. మన్మధ, ఆటోగ్రాఫ్,ఆడుకాలం,ఆకాశం నీ హద్దురా, సామీ వంటి తమిళ చిత్రాలతో పాటు రజనీకాంత్, సూర్య, విజయ్, అజిత్,కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు ఆయన పనిచేశారు.

స్నేహన్, కనిక దంపతులు కవల పిల్లలకు ఈ ఫిబ్రవరిలో జన్మనిచ్చారు. అయితే, ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయిన వెంటనే ఈ జంట కమల్ హాసన్ ఆశీర్వాదం కోసం ఆయన ఇంటికి వెళ్లింది. ఇద్దరూ అమ్మాయిలు చాలా ముద్దుగా ఉన్నారంటూ కమల్ ఆశీర్వదించారు. ఆపై వారిద్దరికీ బంగారు గాజులు ఆయన తొడిగారు. ఆపై కనిక, స్నేహన్‌లతో పాటు పిల్లలకు బట్టలు కూడా అందించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్నేహన్ చాలా రోజులుగా కమల్‌కు దగ్గరగా ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన రాజకీయ పార్టీ మక్కల్ నీది మయ్యంలో ఆయన క్రియాశీలంగా పనిచేస్తున్నారు. 2019లో తమిళనాడులోని శివగంగ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఓటమి చెందినప్పటికీ సుమారు 25వేల ఓట్లు వచ్చాయి.

కోలీవుడ్ నటి కనిక రవిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కమల్ హాసన్ సమక్షంలోనే 2021లో వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. సుమారు పదేళ్ల క్రితం క్రితం వచ్చిన 'దేవరాట్టం' అనే మూవీలో కనిక నటించింది. ఆ మూవీ సమయంలోనే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సమయం నుంచి వారు రహస్యంగా ఉంటూ ఉంచారు. అయితే, కొంత కాలం తర్వాత ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో ఆశీర్వదించారు. వారి పెళ్లిని కూడా కమల్ హాసన్ దగ్గరుండి జరిపించడం విశేషం.