
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్(Sundeep Kishan), రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మజాకా’. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శివరాత్రి కానుకగా ఈ నెల 26న విడుదల కానుంది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. నేను లోకల్,హలో గురు ప్రేమకోసమే,సినిమా చూపిస్త మావ ,ధమాకా వంటి సినిమాలతో దర్శకుడిగా త్రినాథరావుకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆయన నుంచి మజాకా మూవీ వస్తుండటంతో ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి.
తాజాగా విడుదలైన మజాకా ట్రైలర్ టైటిల్ కార్డ్‌లో హీరో సందీప్ కిషన్‌కు 'పీపుల్స్ స్టార్' అనే ట్యాగ్‌లైన్ చేర్చారు. పీపుల్స్ స్టార్ అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చే పేరు ఆర్. నారాయణమూర్తి అని తెలిసిందే. దీంతో ఈ విషయంపై పలు అభ్యంతరాలు రావడంతో ఆయన వెంటనే స్పందించారు. ఆర్ . నారాయణమూర్తికి పీపుల్స్ స్టార్ ట్యాగ్ లైన్ ఉన్న విషయం తనకు తెలియదని సందీప్ కిషన్ వివరణ ఇచ్చారు. తనకు ట్యాగ్ లైన్స్‌తో ఎలాంటి పనిలేదన్నారు. వాటిని పెద్దగా పట్టించుకోనని తెలిపారు. అయితే, నారాయమూర్తి సినిమాలు చాలా బాగుంటాయని, ఆయనకు తాను కూడా అభిమానినని పేర్కొన్నారు. మజాకా సినిమా కోసం పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్ లైన్‌ను తాను పెట్టుకోలేదు. నిర్మాత అనిల్ సుంకర పెట్టారని సందీప్ కిషన్ వివరణ ఇచ్చారు.
మజాకా చిత్రంలో సందీప్ కిషన్ - రావు రమేశ్ తండ్రీ తనయుల పాత్రల్లో సందడి చేయనున్నారు. తనయుడు ఒక అమ్మాయితో.. తండ్రి మరో అమ్మాయితో ప్రేమలో పడటం.. సరదాగా సాగే జీవితాల్లో వారికి వచ్చిన సమస్య ఏమిటి? దానిని వారెలా అధిగమించారు? అనే అంశాలతో ఈ సినిమా రూపొందుకున్నట్లు తెలుస్తోంది.