
‘‘నా సినిమాల్లో ఎంత ఫన్ ఉన్నా విలువలు ఉండేలానూ జాగ్రత్తలు తీసుకుంటాను. ‘సినిమా చూపిస్త మావ, నేను.. లోకల్, హలో గురూ ప్రేమకోసమే, ధమాకా!’... ఇలా నా చిత్రాల్లో డైలాగ్స్ రూపంలోనో, సీన్స్ రూపంలోనో విలువలు ఉండేలా చూసుకుంటాను. ఇక ప్రతి మగాడికీ ఓ మహిళ తోడు ఎంత అవసరమో ‘మజాకా’లో చూపించే ప్రయత్నం చేశాం’’ అన్నారు దర్శకుడు త్రినాథరావు నక్కిన(Nakkina Trinadha rao). సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, హాస్య మూవీస్‌పై రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో నక్కిన త్రినాథరావు చెప్పిన విశేషాలు.
⇒ ఇద్దరు మగాళ్లు మాత్రమే ఉన్న ఆడ దిక్కులేని ఓ ఇంట్లో ఓ మహిళ పని చేసేందుకు భయపడుతుంటుంది. అందుకే ఆ తండ్రీకొడుకులు తమకో ఫ్యామిలీ కావాలనుకుంటారు. వాళ్లు పడే తపన, చేసే ప్రయత్నాల సమాహారమే ‘మాజాకా’ కథ. ఈ సినిమా వినోదాత్మకంగా సాగుతుంది. కానీ చివరి 20 నిమిషాలు ఎమోషనల్‌గా ఉంటుంది. చిన్నప్పట్నుంచి అమ్మ ఎమోషన్‌ను అనుభూతి చెందని ఓ వ్యక్తి ఆ ఎమోషన్‌కు కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది? ఈ తండ్రీకొడుకులు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అనే ఆసక్తికరమైన విషయాలను సినిమాలోనే చూడాలి.
⇒ ప్రసన్నకుమార్ మంచి కథలు ఇస్తున్నారు. అందుకే ఆయనతో సినిమాలు చేస్తున్నాను. నా సొంత కథలతో చేయనని కాదు... నా సొంత కథలతో చేసిన సినిమాలూ ఉన్నాయి. ఇటీవల రైటర్ శ్రీనివాస్ ఓ కథ చెప్పాడు... నచ్చింది. ‘మజాకా’ రిలీజ్ తర్వాత ఆలోచిస్తాను.
⇒ నా ప్రొడక్షన్‌లోని ‘చౌర్యపాఠం’ సినిమాని ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలనుకుంటున్నాను. అలాగే ‘అనకాపల్లి’ అనే సెమీ పీరియాడికల్ లవ్‌స్టోరీ ఫిల్మ్ చేస్తున్నాను. ‘మజాకా’కు సీక్వెల్‌గా ‘డబుల్ మజాకా’ ఉంది. ‘ధమాకా’కు సీక్వెల్‌గా ‘డబుల్ ధమాకా’ అనుకుంటున్నాం. రవితేజగారితో చేస్తే బాగానే ఉంటుంది. మా ప్రయత్నం కూడా ఇదే... చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment