పాటలే పాఠాలుగా... | Singer Saradha Head master Special Story | Sakshi
Sakshi News home page

పాటలే పాఠాలుగా...

Published Fri, Aug 9 2019 1:21 PM | Last Updated on Fri, Aug 9 2019 6:05 PM

Singer Saradha Head master Special Story - Sakshi

శారద, ప్రధానోపాధ్యాయురాలు

బోధనలో ఒక్కో ఉపాధ్యాయుడిది ఒక్కో శైలి. అయితే ఈ విషయంలో అందరి లక్ష్యమూ ఒక్కటే. పిల్లలను ఆకట్టుకుని పాఠం వాళ్ల మెదళ్లలో నిక్షిప్తమై పోయేలా చేయడమే. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ప్రధానోపాధ్యాయురాలు అందరికంటే భిన్నం. ఈ టీచర్‌ నైతిక విలువలతో కూడిన పాఠాలు చెప్పడమే కాకుండా పిల్లలకు విద్య గొప్పతనాన్ని తెలియజేయడం కోసం పాటలు రాశారు. వాటికి బాణీ కట్టారు. ఆలపించారు. పిల్లల నుంచి మంచి ఫలితాలను రాబట్టారు.

మంచిర్యాలలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్న శారద గాయని కూడా. వృత్తి బోధన అయితే ప్రవృత్తి పాటలు రాయడం, బాణీలు కట్టడం, పాడడం. శారద పాడే పాటలన్నీ సమాజ హితాన్ని కాంక్షించేవే. భావిభారత పౌరుల భవితకు బంగారు బాటలు వేసేవే. అలా ఇప్పటివరకూ 800 కుపైగా పాటలు పాడారు. ‘‘చెట్టమ్మా చెట్టమ్మా చెట్టమ్మా... నీ పుట్టుక ఎంత గొప్పదమ్మా..నీవు లేని లోకాన్ని ఊహించలేనమ్మా.. మానవ మనుగడకే నీవు తొలి మెట్టమ్మా’’ అనేది శారద గళం నుంచి వచ్చిన పాటల్లో మచ్చుకు ఒకటి. ’బడి బయట ఏముందిరా.. బడిలో భవిత ఉంది... రా.. బడిలో ఆట ఉందిరా.. చిన్నా బడిలోనూ పాట ఉందిరా.. బడిలో చదువుకో’’.. అంటూ పాడిన పాట పిల్లలతోపాటు పెద్దలను కూడా ఆలోచింపజేస్తుంది. బాల్యం నుంచే శారదకు పాటలంటే ఇష్టం. చిన్నప్పుడు బడి సెలవురోజుల్లో అమ్మతోపాటు పొలం వెళ్లేది.  పొలంలో పనిచేసే సమయంలో ఆ కష్టం తెలియకుండా ఉండడం కోసం, కూలీలను ఉత్సాహవంతంగా ఉంచడంకోసం శారద తల్లి లక్ష్మి పాటలు పాడుతుండేది. తల్లి శ్రావ్యమైన గానం శారదను కట్టిపడేసింది. చదువు పూర్తయ్యాక టీచర్‌గా విధుల్లో చేరిన శారద ఆ వృత్తిలో కొనసాగుతూనే తీరిక సమయంలో రాగాలు తీయడం ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలంపాటు ఓ గురువు వద్ద సంగీతంలో శిక్షణ పొందారు. ఆ తర్వాత పాడడం ప్రారంభించారు. అక్కడి నుంచి పాటలు రాయడం, పాడడం ప్రారంభించారు. అలా ఇప్పటిదాకా 800 పాటలు పాడారు. స్వరాంజలి మ్యూజిక్‌ అకాడమీకి చెందిన వేంకటేశ్‌ స్వరకల్పన, సంగీతం, రచనలో బడి బయట ఏముందిరా అనే పాటలతో పాటు, చెట్టుమ్మా పాటలు ఆడియో పూర్తయ్యాయి. ఇది విన్న వారంతా కొన్ని దృశ్యాలు జతచేసి వీడియో రూపంలో తీసుకువస్తే బాగుంటుందని శారదకు çసూచించారు. ఈ సలహా... శారదను ఆ దిశగా నడిపించింది. ఈ నేపథ్యంలో పాటలు పాడడమే కాకుండా నటించారు కూడా.

వసతుల కల్పన... విలువల బోధన
2002లో స్కూల్‌ అసిస్టెంట్‌గా చేరిన శారద... ఏడేళ్లలోనే ప్రధానోపాధ్యాయురాలిగా పదోన్నతి పొందారు. 2009లో బెల్లంపల్లి పాఠశాలలో చేరిన సమయంలో 200 మంది పిల్లలు ఉండగా ఆ తర్వాత ఆ సంఖ్య 850కి చేరుకుంది. పిల్లలను ఆకట్టుకునేలా బోధించడంలో వైవిధ్యమే ఇందుకు తోడ్పడింది. ఆశాజ్యోతి సంస్థ సహకారంతో పిల్లలకు ఉచితంగా బ్యాగులు అందేలా చేశారు. పాఠశాలలో అనేక మౌలిక వసతులు కల్పించారు.

ప్రస్తుతం శారద హెచ్‌.ఎం.గా విధులు నిర్వర్తిస్తున్న పాఠశాల ఫలితాల్లో జిల్లాస్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 92 శాతం ఫలితాలు వచ్చాయి.   పాఠాలే కాదు, ఈ బడిలో రోజుకు ఒకటి లేదా రెండు క్లాసులు తీసుకుని కేవలం నైతిక విలువలు బోధిస్తారు. దానికే అత్యధిక ప్రాధాన్యమిస్తారు. గతేడాది ఈ పాఠశాల విద్యార్థినులు జాతీయస్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనగా ఈ ఏడాది యోగా పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది.– కొల్లూరి సత్యనారాయణసాక్షి, స్కూల్‌ ఎడిషన్‌

ఆత్మరక్షణ విద్యలు నేర్పుతాం
’’పాఠాలతోపాటు నైతిక విలువలను ఎక్కువగా చెబుతుంటా. ఆడపిల్లలకు కర్రసాము, కత్తిసాము వంటి ఆత్మరక్షణ విద్యలను బడి సమయం తర్వాత ప్రత్యేకంగా నేర్పిస్తాం. ఏ పోటీలు పెట్టినా మా బడి పిల్లలే ముందుంటారు. ఢిల్లీలో జరిగిన ఎన్సీసీ ప్రోగ్రాంలో మా బడి పిల్లలు పాల్గొన్నారు. ఇది ఎంతో ఆనందం కలిగించే విషయం. గతేడాది 100 శాతం మార్కులు సాధించిన పిల్లలందరికీ నా చేత్తో అన్నం తినిపించా. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా తరచూ వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నాం. ఆశాజ్యోతి ఫౌండేషన్‌ సహకారంతో మా బడి పిల్లలకు బ్యాగు, పుస్తకాలు ఇప్పించాం.– శారద, ప్రధానోపాధ్యాయురాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement