చిత్రం: కార్తీక దీపం రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: సత్యం గానం: పి.సుశీల, ఎస్.జానకి
తెలుగు సినిమా పాటకు కావ్యగౌరవం కలిగించిన రచయితల్లో దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి కూడా ఒకరు. ఆయన రాసిన ప్రతి పాటా ప్రేక్షక శ్రోతల్ని అలరించింది, ఆలోచింపచేసింది. ‘కార్తీక దీపం’ చిత్రం కోసం దేవులపల్లి వారు రచించిన ‘ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం...’ పాట – 1979లో ఈ చిత్రం విడుదలైనప్పుడు ఇంటింటి పాట అయింది, దేశమంతటా మార్మోగిపోయింది. ఈ చిత్ర కథను అనుసరించి, కార్తీక మాసం స్ఫూర్తితో ఇద్దరు హీరోయిన్ల మీద చిత్రించటానికి అనువుగా రూపొందించిన పాట ఇది.
ఒక మగవానికి ఒక భార్య సహజం. పరిస్థితుల ప్రభావంతో, ప్రియురాల్ని రెండో భార్యగా వివాహం చేసుకోగా, ఒకరికి తెలియకుండా ఒకరు... వారిద్దరూ కార్తీకదీపాలు వెలిగించి, కోనేటిలో వదులుతూ పాడతారు.
చిక్కని సాహిత్యానికి అమరిన చక్కని బాణీ ఈ పాటలో వినిపిస్తుంది– ఆరనీకుమా ఈ దీపం–కార్తీక దీపం / చేరనీ నీ పాద పీఠం–కర్పూర దీపం / ఇదే సుమా నీ కుంకుమ తిలకం / ఇదే సుమా నా మంగళ సూత్రం... అంటూ మొదలై... ఇద్దరు స్త్రీల మనోభావాల్నీ అద్దం పట్టి చూపిస్తుంది. భర్తను చేరాల్సిన కర్పూర దీపం భార్యదైతే–భర్తను చేరాల్సిన ప్రాణ దీపం రెండో భార్యదన్న మాట. ఈ పాట మొత్తానికి కవితాత్మకమైన వాక్యాలు రెండే రెండు ఉన్నాయి.
ఆకాశాన ఆ మణిదీపాలేముల్తైదువులుంచారో..ఈ కోనేట ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారో... ఈ రెండు వాక్యాలలో కవి అద్భుతమైన ఊహను వ్యక్తపరిచిన పదాలు, శ్రోతలను మైమరపింప చేస్తాయి. మిగిలిన పాటంతా తెలివైన, చాకచక్యం గల కవి అల్లిన అందాల పదబంధాలే– ఆకాశంలో చుక్కల్ని కార్తీక దీపాలుగా ఊహించి, ఇక్కడి కోనేటిలోని కార్తీక దీపాల్ని ఆకాశంలో ముల్తైదువులు చుక్కలను కుంటారు అనుకోవడంలో కవిత్వం ఉంది. ఆ భావాన్ని అటూఇటుగా అందమైన మాటలతో, కథాంశంతో ముడిపెట్టి రక్తి కట్టించారు. కృష్ణశాస్త్రికి వేరెవ్వరూ సాటి రారు అని స్వయంగా నిరూపించుకున్నారు.
చివర– నోచిన నోములు పండెననీ ఈ ఆనంద దీపం– అని ఒకరు– నా దాచిన కోర్కెలు నిండుననీ ఈ ఆశాదీపం– అని మరొకరు పలుకుతారు–
ఒకరిది కల్యాణ దీపం–మరొకరిది ప్రాణ దీపం
ఇలాంటి పాట విన్నప్పుడు సినిమా పాటను తక్కువగా అంచనా వేయకూడదని ఎవరికైనా అనిపిస్తుంది.
– సంభాషణ: డా. వైజయంతి
Comments
Please login to add a commentAdd a comment