radio jockeys
-
స్వరంతో గిన్నిస్ రికార్డు..ఏకంగా 72 గంటల 30 నిమిషాల..!
ఘనత సాధించిన రేడియో విష్ణు 90.4. వంద అంశాలపై 72 గంటల 30 నిముషాల 30 సెకన్లపాటు నిరంతర ప్రసారం. గిన్నిస్ రికార్డు నెలకొల్పిన వంద మంది రేడియో జాకీల్లో 90 మంది విద్యార్థినులే. శ్రావ్యమైన గొంతుతో రేడియో జాకీలుగా అలరిస్తున్న విద్యార్థినులు.‘గుడ్ మార్నింగ్... భీమవరం. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం’ అంటూ విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, వ్యాపారం, ఉపాధి, వాతావరణం.. ఇలా నిరంతర సమగ్ర సమాచారాన్ని శ్రావ్యమైన గొంతుతో ప్రజాపయోగకరమైన వంద అంశాలపై 72 గంటల 30 నిముషాల 30 సెకన్ల పటు నిరంతర ప్రసారంలో అనర్గళంగా మాట్లాడి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.కమ్యూనిటీ రేడియో !ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విద్య కేంద్రీకృత, చర్చా ఆధారిత తొలి రేడియో స్టేషన్‌గా ఈ కమ్యూనిటీ రేడియో గుర్తింపు పొందింది. సమాచార, ప్రసార శాఖ మార్గదర్శకాల మేరకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రసారాలను అందిస్తున్నారు. ఇప్పటివరకు సుదీర్ఘ రేడియో ప్రసారం 66 గంటల 6 నిముషాల 1 సెకనుగా నార్త్ ఆఫ్రికాలోని ట్యునీషియా పేరిట గిన్నిస్ రికార్డు ఉంది.15 ఏళ్లుగా గొంతు వినిపిస్తోంది!విద్యార్థుల్లో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, డిబేటింగ్ ఎబిలిటీస్, స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్ పెంపొందించడం లక్ష్యంగా భీమవరంలోని విష్ణు క్యాంపస్‌లో చైర్మన్ కేవీ విష్ణురాజు 2007 సంవత్సరంలో రేడియో విష్ణు ప్రారంభించారు. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. – విజయ్‌కుమార్ పెనుపోతుల, సాక్షి, భీమవరం -
ఫిమేల్ ఆర్జే: అహో... అంబాలా జైలు రేడియో!
అక్కడ ఒక ట్రైనింగ్ సెషన్ జరుగుతోంది. ‘మీ ముందు మైక్ ఉన్నట్లు పొరపొటున కూడా అనుకోకూడదు. మీ స్నేహితులతో సహజంగా ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడాలి! భవ్యా... ఇప్పుడు నువ్వు ఆర్జేవి. నీకు ఇష్టమైన టాపిక్‌పై మాట్లాడు...’ భవ్య మైక్ ముందుకు వచ్చింది. ‘హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవ్యను. ప్రతి ఒక్కరికీ జ్ఞాపకాలు ఉంటాయి. నాకు ఎప్పుడూ నవ్వు తెచ్చే జ్ఞాపకం ఒకటి ఉంది. మా గ్రామంలో సంగ్రామ్ అనే ఒకాయన ఉండేవాడు. ఆయన ఎప్పుడూ ఎవరికో ఒకరికి జాగ్రత్తలు చెబుతూనే ఉండేవాడు. అయితే అందరికీ జాగ్రత్తలు చెబుతూనే తాను పొరపాట్లు చేసేవాడు. ఒకరోజు వర్షం పడి వెలిసింది. ఎటు చూసినా తడి తడిగా ఉంది..కాస్త జాగ్రత్త సుమా! అని ఎవరికో చెబుతూ ఈ సంగ్రామ్ సర్రుమని జారి పడ్డాడు. అందరం ఒకటే నవ్వడం! ఒకరోజు సంగ్రామ్ ఏదో ఫంక్షన్‌కు వచ్చాడు. ఎవరికో చెబుతున్నాడు... వెనకా ముందు చూసుకొని జాగ్రత్తగా ఉండాలయ్యా. ఇది అసలే కలికాలం...అని చెబుతూ, తన వెనక కుర్చీ ఉందన్న భ్రమలో కూర్చోబోయి ధబాలున కిందపడ్డాడు!’ ....ఆ ఆరుగురు మహిళా ఆర్జేలు, హాస్యసంఘటనలను ఆకట్టుకునేలా ఎలా చెప్పాలనే విషయంలో కాదు, శ్రోతలు కోరుకున్న పాట ప్లే చేసేముందు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ‘సత్యమైన జ్ఞానమే ఆత్మజ్ఞానం’లాంటి ఆధ్యాత్మిక విషయాలను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఎలా సులభంగా చెప్పాలి... ఇలా ఎన్నో విషయాలలో ఒక రేడియోకోసం ఆ ఆరుగురు మహిళలు శిక్షణ తీసుకున్నారు. అయితే ఆ రేడియో మెట్రో సిటీలలో కొత్తగా వచ్చిన రేడియో కాదు, ఆ మహిళలు జర్నలిజం నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లు అంతకంటే కాదు. అది అంబాల జైలు రేడియో. ఆ ఆరుగురు మహిళలు... ఆ జైలులోని మహిళా ఖైదీలు. హరియాణాలోని అంబాల సెంట్రల్ జైలులో ఖైదీల మానసిక వికాసం, సంతోషం కోసం ప్రత్యేకమైన రేడియో ఏర్పాటు చేశారు. ఆరుగురు మగ ఆరేజే (ఖైదీలు)లు ఈ రేడియో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడిక మహిళల వంతు వచ్చింది. రేడియో కార్యక్రమాల నిర్వహణ కోసం ఆరుగురు మహిళా ఖైదీలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో ‘ఆర్జే’గా విధులు నిర్వహించనున్నారు. దిల్లీ యూనివర్శిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ వర్తిక నందా ఈ ఆరుగురికి శిక్షణ ఇచ్చారు. ‘ఒత్తిడి, ఒంటరితనం పోగొట్టడానికి, మనం ఒక కుటుంబం అనే భావన కలిగించడానికి ఈ రేడియో ఎంతో ఉపయోగపడుతుంది’ అంటుంది నందా. ఈ మాట ఎలా ఉన్నా మహిళా ఆర్జేల రాకతో ‘అంబాల జైలు రేడియో’కు మరింత శక్తి, కొత్త కళ రానుంది! -
కరోనాపై ప్రజలను చైతన్యం చేయండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి గురించి సమాచారాన్ని, నిపుణుల అభిప్రాయాలను ప్రజలకు చేరవేయాలని, ప్రజలు ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లు, కష్టాలపై అభిప్రాయాలు అందించాలని ప్రధాని నరేంద్రమోదీ రేడియో జాకీలకు పిలుపునిచ్చారు. వైరస్‌నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను కూడా తెలియజేయాలని కోరారు. శుక్రవారం ప్రధాని రేడియో జాకీలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజల కోసం పాటు పడుతున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతో దురుసుగా, అనుచితంగా ప్రవర్తించిన ఘటనలపై అవగాహన కల్పి ంచాలని, తద్వారా వాటిని అధిగమించొచ్చన్నారు. అదేవిధంగా, కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలపై ప్రతిరోజూ నివేదికలు ఇవ్వాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయం మంత్రులకు ఆదేశాలిచ్చింది. -
పలుకుబడికి పురస్కారాల జడి..
రేడియో జాకీలు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఐఆర్ఎఫ్-2015’ అవార్డులు ఈసారి నగరానికి నాలుగు కేటగిరీల్లో లభించాయి. జాతీయ స్థాయిలో వివిధ స్టేషన్స్ నుంచి అనేక కేటగిరీల్లో టౌన్ స్థాయి నుంచి మెట్రో సిటీస్ రేడియో స్టేషన్స్, ఆర్జేలు ఈ అవార్డుల కోసం పోటీ పడతారు. అంత పోటీని తట్టుకుని నగర ఆర్జేలు పురస్కారాలు సాధించారు. ఆ వివరాలు.. - సాక్షి, సిటీబ్యూరో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ షో.. శివ్ ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలను బ్రేక్ ఫాస్ట్షో, నాన్ బ్రేక్‌ఫాస్ట్ షోలుగా విభజిస్తారు. దీనిని బట్టి బ్రేక్ ఫాస్ట్షో ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. రేడియో సిటీ 91.1 ఎఫ్ఎంలో ప్రసారమయ్యే బ్రేక్‌ఫాస్ట్ షోకు ఆర్జే శివ్ అవార్డు అందుకున్నారు. ‘రెండవ అవార్డ్‌ను ఈ బ్రేక్‌ఫాస్ట్ షోకి అందుకోవడం చాలా ఆనందంగా వుంది. నా బ్రేక్ ఫాస్ట్‌లో న్యూస్ హెడ్‌లైన్స్, లోకల్ హ్యాపెనింగ్స్, జాబ్ అప్డేట్స్, హాట్సీట్లో ఒక సెలబ్రిటీని లేదా పొలిటికల్ పర్సనాలిటీని కూర్చోబెట్టి సెటైరిక్ ప్రశ్నలు వేయడం, సినిమాలో పంచ్ డైలాగ్స్‌కి రేడియో సిటీ మార్క్‌లో పంచ్ ఇవ్వటం వంటివి డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తుంటాను’ అని చెప్పారు శివ్. బెస్ట్ షో ఆఫ్ ది ఇయర్.. ‘జబర్ దస్త్ మస్తీ’ ‘అనుకున్నది క్లిక్ అయితే ఆ కిక్కే వేరు’ అంటున్నాడు రెడ్ ఎఫ్ఎం ఆర్జే చైతు. ఈయన చేసిన ‘జబర్ దస్త్ మస్తీ’కి అవార్డ్ అందుకున్నారు. ‘ముందు ఈ లేడిస్ షో నేను చేయనన్నా. కానీ వర్కవుట్ అవుతుందని ఒప్పించారు. ఐదు నెలల్లోనే అవార్డు వచ్చింది. బెస్ట్ ఆర్జే అవార్డ్ సాధించాలని కోరిక’ అంటూ చెప్పాడు. బెస్ట్ ఆర్జే.. శేఖర్ మామ ఎఫ్ఎం రేడియో వినే సిటీవాసులకు శేఖర్ మామ అంటే తెలియనివారు అరుదే. రేడియో జాకీగా, జెమిని యాంకర్‌గా చిరపరిచితుడైన శేఖర్ బాషా.. ఐఆర్ఎఫ్ నుంచి ‘బెస్ట్ ఆర్జే ఆఫ్ ది ఇయర్ అవార్డ్’ను మరోసారి అందుకున్నాడు. ‘లిజనర్స్‌కు నా షోస్‌ను నిర్విరామంగా ఆదరించడం వల్లే ఈ అవార్డ్‌ను వరుసగా దక్కించుకోగలిగా’ అంటూ ఆనందంగా చెప్పే శేఖర్.. అత్యధిక సంఖ్యలో ఐఆర్ఎఫ్ అవార్డ్స్ (బెస్ట్ ప్రోమోస్, బెస్ట్షోస్ సహా మొత్తం 15) అందుకున్న ఏకైక ఆర్జేగా ఇండియాలోనే రికార్డ్ సృష్టించాడు. వీటితో పాటు ఐఎస్బీ నుంచి ‘యంగ్ కమ్యూనికేటర్ అవార్డ్’ సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. బెస్ట్ ప్రోమో.. శ్రీరామ పవన్ ఈసారి ‘బెస్ట్ ప్రోమో ఇన్‌హౌజ్ ప్రొడక్షన్’ కేటగిరిలో మళ్లీ అవార్డు దక్కించుకున్నారు రెడ్ 93.5 ఎఫ్ఎం సౌండ్ ఇంజినీర్ శ్రీరామ పవన్ కుమార్. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘నా రేడియో కెరీర్లో మూడో నేషనల్ అవార్డ్ అందుకున్నాను. ‘రేడియో అండ్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ప్రాక్టీషనర్ అవార్డ్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (రాపా) ఇచ్చే అవార్డు కూడా నాకొక సర్ప్రైజ్. అలాగే 2012లో రెడ్ ఎఫ్ఎంలో చేసిన ‘సిల్లీ ఫెల్లో’ స్పార్క్లర్కు న్యూయార్క్ రేడియో అవార్డ్ అందుకున్నా’ అని చెప్పారు. -
బిగ్ ఎఫ్ఎంలో జూ॥జాకీ
మాటల ఊటలు.. స్పాంటేనిటీకి కేరాఫ్‌లు.. పంచ్‌లకు పర్మినెంట్ అడ్రస్‌లు.. రేడియో జాకీలు. ఎఫ్ఎంలో ముచ్చట్లు వినిపించే ప్రొఫెషనల్ ఆర్జేలకు ధీటుగా ఓ పన్నెండేళ్ల వసపిట్ట గొంతు సవరించింది. గలగల గోదారిలా.. మాటలతో మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ‘విను వినిపించు లైఫ్ అందించూ’ అంటూ బిగ్ ఎఫ్ఎం శ్రోతలను పలకరించింది. బాలల దినోత్సవం సందర్భంగా 92.7 ఎఫ్ఎం నిర్వహించిన చిన్నారి ఆర్జే హ ంట్లో ఒయాసిస్ స్కూల్‌కు చెందిన భావన సెలక్టయింది. ‘హియర్ హియర్ మేక్ ఏ లైఫ్ బ్యూటిఫుల్’ అంటూ జూనియర్ ఆర్జేగా అదరగొట్టింది. ఒయాసిస్ స్కూల్లో ఏడో తగరతి చదువుతున్న భావన మామూలుగానే కబుర్ల పోగు. ఫ్రెండ్స్ ధరణి, తన్మయి కలిశారంటే వాళ్ల మధ్య సరదా సంభాషణలు నాన్ స్టాప్‌గా సాగుతూనే ఉంటాయి. గతేడాది క్రిస్మస్ వేడుకల్లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 92.7 ఎఫ్ఎం ఆర్జేలు సందీప్, సుందరి.. భావన చదివే ఒయాసిస్ స్కూల్‌కు వచ్చారు. ఎవరైనా సరదాగా కాసేపు ఏదైనా టాపిక్‌పై మాట్లాడతారా? అనడమే తరువాత భావన, తన్మయి, ధరణి సై అంటూ ముందుకొచ్చి వహ్వా అనిపించారు. టెస్ట్.. వన్.. టూ.. త్రీ.. బాలల దినోత్సవం సందర్భంగా ఏటా 92.7 ఎఫ్ఎం జూనియర్ ఆర్జేలను సెలెక్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఒయాసిస్ స్కూల్‌కూ ఓ చాన్సిచ్చారు. మూడు రౌండ్ల సెలెక్షన్ ప్రాసెస్‌లో భావన అన్నింటా ముందు నిలిచింది. మొదటి రౌండ్లో కాస్త కామెడీగా వాళ్లను వాళ్లు పరిచయం చేసుకోవాలి. సెకండ్ రౌండ్లో దర్శకుడు ఒక సీన్‌కు యాక్షన్ చెప్పే సన్నివేశాన్ని కామెడీగా చేయాలి. మూడో రౌండ్లో రౌడీలు స్కూల్‌ను ఆక్రమిస్తే హీరో వచ్చి కాపాడే సన్నివేశాన్ని కామెడీ యాంగిల్లో నటించి చూపాలి. మూడు రౌండ్లకు కలిపి 30 మార్కులకు భావన 27 మార్కులు, ధరణి 26.5 మార్కులు సాధించి జూనియర్ ఆర్జేలుగా ఎంపికయ్యారు. సిటీలోని 13 స్కూల్స్ నుంచి బిగ్ ఎఫ్ఎం మొత్తం 40 మందిని ఎంపిక చేసింది. ఫైనల్స్‌లో అందరినీ వెనక్కి నెట్టి భావన ఈ సీజన్ జూనియర్ ఆర్జేగా ఎంపికైంది. తొలిరోజే సీనియర్ ఆర్జే జ్యోత్స్నతో కలసి తన సత్తా చాటింది. ఆదితో చిట్‌చాట్.. భావన తొలి రోజే హీరో ఆదితో ‘హాయ్ బాగున్నారా?.. నేను జూనియర్ ఆర్జే భావనను’ అంటూ మాట కలిపింది. పెళ్లి, భార్య వివరాలు, రఫ్ సినిమా విశేషాలను ఆసక్తికరంగా రాబట్టింది. చదువు, ఆటపాటలు.. చదువుతోపాటు ఆటపాటలు, ఉపన్యాస పోటీలంటే భావనకు ఆసక్తి ఎక్కువ. ఆయా అంశాల్లో ఇప్పటి వరకు 11 మెడల్స్, మూడు ట్రోఫీలు, 85 వివిధ రకాల సర్టిఫికెట్లు సాధించింది. చదువులోనూ రాణిస్తూ క్లాస్‌లో మొదటి ర్యాంక్ సాధిస్తోంది. గతేడాది బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది స్కూల్‌గా ఎంపికైంది కూడా. -
ఆ రేడియో జాకీలపై చర్యలు తీసుకోండి:ఎంపీలు
న్యూఢిల్లీ:పార్లమెంటరీయన్లను అదే పనిగా విమర్శిస్తూ జోక్ లు వేస్తున్న రేడియో జాకీలపై చర్యలు తీసుకోవాలని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో రేడియో జాకీలుగా పనిచేస్తున్న వారు ఎంపీలనే లక్ష్యంగా పెట్టుకుని మిమిక్రీ చేస్తున్నారని జయ బచ్చాన్ మండిపడ్డారు. ఈ మేరకు ఆమె గురువారం రాజ్యసభలో ప్రసంగిస్తూ.. అటువంటి రేడియో స్టేషన్లపై, ఆ తరహా మిమిక్రీ చేసే రేడియో జాకీలపై ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 'రాజ్యసభలో ఏ చర్చ జరుగుతున్నా ఆక్షేపణలకు గురౌతుంది. ప్రస్తుత కాలంలో కొన్ని స్టేషన్లు వార్తల కోసం పార్లమెంట్ ను ఎంచుకుంటున్నాయి. చాలా మంది ఎంపీలపై కామిడీ చేస్తూ ఆ స్టేషన్లు తప్పుదోవలో పనిచేస్తున్నాయి. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలి' అని జయ పేర్కొన్నారు. కాగా, ఆమె డిమాండ్ కు పలువురు ఎంపీల నుంచి మద్దతు లభించింది. ఆమె వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్, బీఎస్పీ ఎంపీ సతీష్ చంద్రాలు అండగా నిలిచారు. రాను రాను ఈ సంప్రదాయం మరీ ఘోరంగా మారిపోతుందని వారు జయకు మద్దతు తెలిపారు. అయితే ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు.