ఆ రేడియో జాకీలపై చర్యలు తీసుకోండి:ఎంపీలు
న్యూఢిల్లీ:పార్లమెంటరీయన్లను అదే పనిగా విమర్శిస్తూ జోక్ లు వేస్తున్న రేడియో జాకీలపై చర్యలు తీసుకోవాలని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో రేడియో జాకీలుగా పనిచేస్తున్న వారు ఎంపీలనే లక్ష్యంగా పెట్టుకుని మిమిక్రీ చేస్తున్నారని జయ బచ్చాన్ మండిపడ్డారు. ఈ మేరకు ఆమె గురువారం రాజ్యసభలో ప్రసంగిస్తూ.. అటువంటి రేడియో స్టేషన్లపై, ఆ తరహా మిమిక్రీ చేసే రేడియో జాకీలపై ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
'రాజ్యసభలో ఏ చర్చ జరుగుతున్నా ఆక్షేపణలకు గురౌతుంది. ప్రస్తుత కాలంలో కొన్ని స్టేషన్లు వార్తల కోసం పార్లమెంట్ ను ఎంచుకుంటున్నాయి. చాలా మంది ఎంపీలపై కామిడీ చేస్తూ ఆ స్టేషన్లు తప్పుదోవలో పనిచేస్తున్నాయి. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలి' అని జయ పేర్కొన్నారు. కాగా, ఆమె డిమాండ్ కు పలువురు ఎంపీల నుంచి మద్దతు లభించింది. ఆమె వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్, బీఎస్పీ ఎంపీ సతీష్ చంద్రాలు అండగా నిలిచారు. రాను రాను ఈ సంప్రదాయం మరీ ఘోరంగా మారిపోతుందని వారు జయకు మద్దతు తెలిపారు. అయితే ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు.