న్యూఢిల్లీ: ఉద్యోగం చేయడానికి ప్రాంతాల సంబంధం ఉండదు. ఎక్కడ ఉద్యోగం దొరికినా ఆగమేఘాలపై అక్కడికి వాలుపోతుంటారు. ఇందులో పురుషులు, మహిళలు అనే తారతమ్యలుండవు. బ్రతకడానికి ఏ ప్రాంతమైనా ఎన్నుకుంటారు. విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి కూడా మహిళలు వెనుకంజవేయని రోజులివి. అయితే మన దేశంలో పరిస్థితి ఇందుకు భిన్నం. దేశ రాజధాని ఢిల్లీలో ఉద్యోగాలు చేయాలంటే మాత్రం హడలిపోతున్నారు. గతంలో చోటు చేసుకున్న నిర్భయ ఘటనతో భయభ్రాంతులకు గురైన మహిళలు ఢిల్లీలో ఉద్యోగాలు చేయడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు.పీహెచ్ డీ చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ నిజాలు వెలుగుచూశాయి.
విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు తమకు ఢిల్లీ కంటే వేరే ప్రాంతమైతేనే ఉపాధికి అనువుగా ఉంటుందని భావిస్తున్నారని తేల్చింది. తమకు వచ్చే జీతం కాస్త తక్కువైనా ఫర్వాలేదని అంటున్నారు. వీరిలో 83 శాతం మంది ఉద్యోగినులు ఢిల్లీలో పగలు మాత్రమే పనిచేస్తామని చెబుతుండగా, 43 శాతం మంది మాత్రం వేరే ప్రాంతాలే అనువుగా ఉంటాయని తెలిపారు. కాగా, 9 శాతం మంది మహిళలు పని చేసే వేళలు అనుకూలంగా ఉంటే సరిపోతుందని చెబుతుండగా, 7 శాతం మంది మాత్రం రోటేషన్ పద్దతైనే ఫర్వాలేదని చెబుతున్నారు. తమ పట్టణానికి దగ్గరగా ఉండే నగరాలైతే మరీ సురక్షితంగా ఉంటాయని వారు భావిస్తున్నారు.