కార్పొరేట్ కంపెనీలు రిమోట్ వర్కింగ్ విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. కోవిడ్–19 కష్టకాలంలో తమ ఉద్యోగులను ఇంటి నుంచి లేదా అనువైన ప్రదేశం నుంచి పనిచేసేందుకు అనుమతినిచ్చిన సంస్థలు.. ఇప్పుడు వారిని కార్యాలయానికే వచ్చి పనిచేయమంటున్నాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం, అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్–2022 (బీఎల్‌ఎస్) నివేదిక ఈ అంశాలను వెల్లడించింది.
గత ఏడాది ఆగస్టు 1 నుంచి సెపె్టంబర్ 30 వరకు చేసిన సర్వేలో గతంలో వర్క్‌ఫ్రం హోం విధానాన్ని అవలంభించిన ప్రైవేట్‌రంగ సంస్థల్లో 72.5 శాతం ఆ విధానానికి స్వస్తి పలికాయని తేలింది. అంతకు ముందు 2021 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య చేసిన సర్వేలో ఈ సంఖ్య 60.1 శాతంగా ఉంది. అంటే సుమారు ఏడాది కాలంలో 12.4 శాతం కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానానికి స్వస్తి చెప్పాయి. కార్యాలయాల్లో ఉద్యోగులకు కల్పించే వివిధ రకాల సేవల ఖర్చును తగ్గించుకునేందుకు 2021లో సిబ్బందిని ఇంటి నుంచే పనిచేయమన్న కంపెనీలు 2022లో తిరిగి కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నట్టు బీఎల్‌ఎస్ నివేదిక పేర్కొంది. - సాక్షి, అమరావతి
తగ్గుతున్న టెలీ వర్కింగ్ విధానం
2021లో పలు కంపెనీలు తమ సిబ్బందిలో గరిష్టంగా 80 శాతం, కనిష్టంగా 40 శాతం టెలి/రిమోట్ వర్కింగ్‌కు అవకాశం కల్పించినట్టు బీఎల్‌ఎస్ నివేదిక పేర్కొంది. అయితే, 2022లో టెలీసరీ్వస్ సేవలు గరిష్టంగా 42 శాతానికి పడిపోయినట్టు వెల్లడించింది.
ఉత్పాదకతపై రిమోట్ వర్క్ ప్రభావం
బీఎల్‌ఎస్–2022 నివేదిక ప్రకారం ఇన్ఫర్మేషన్ రంగంలో వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న వారు తిరిగి కార్యాలయానికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి వారిలో కొత్తగా కెరీర్ ప్రారంభించిన వారు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఎందుకంటే వారు మహమ్మారి కాలంలో కొత్త పనివిధానానికి అలవాటుపడ్డారని తేల్చారు.
కార్యాలయాలకు వెళ్లాల్సివస్తే అత్యధికులు కంపెనీని వదిలేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. సిబ్బంది వర్క్ ఫ్రం హోమ్ విధానంలో సేవలు అందిస్తే ఉత్పాదకత తక్కువగా ఉంటుందని ఇటీవల కంపెనీల యాజమాన్యాలు భావిస్తుండడంతో, కార్యాలయాల నుంచి పనిచేసేవారికే ఉద్యోగాలు ఉంటాయని ఆయా కంపెనీలు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయని బీఎల్‌ఎస్ పేర్కొంది.
వస్తారా.. వదిలేస్తారా..
♦ కార్యాలయానికి దూరంగా ఉండి పనిచేస్తే సిబ్బంది శక్తిసామర్థ్యాలను అంచనా వేయలేమని చాలా కంపెనీలు భావిస్తున్నట్టు బీఎల్‌ఎస్ నివేదిక పేర్కొంది.
♦ నైపుణ్యం గల సిబ్బందిని సంస్థ విడిచి వెళ్లకుండా ఉంచేందుకు కార్యాలయ పని విధానమే బెస్ట్‌గా యాజమాన్యాలు భావిస్తున్నాయి.
♦ ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు సిబ్బందిని సామూహికంగా తొలగిస్తున్నాయి. దాంతో ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు కంపెనీలు తమ సిబ్బందిని తిరిగి రావాలని కోరుతున్నాయి.
♦ అయితే, చాలామంది ఉద్యోగులు రిమోట్ వర్కింగ్ సంస్కృతికి అలవాటుపడి కార్యాలయాలకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు.
♦ ఈ విధానం ఇష్టం లేని ఉద్యోగులు రాజీనామా చేసినా కంపెనీలు సానుకూలంగా తీసుకుంటున్నట్టు నివేదిక పేర్కొంది. ఉద్యోగులు ‘‘రావాలనుకుంటున్నారా లేదా వెళ్లాలనుకుంటున్నారా’’ అని ఆప్షన్లను ఎంచుకునే అవకాశం కంపెనీలు కల్పించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment