మళ్లీ ఆఫీసుల్లో ప్రత్యక్షంగా విధుల నిర్వహణకు ఉద్యోగులు సై అంటున్నారు. సహోద్యోగులతో సరదా సంభాషణలు, మాట్లాడుతూనే విధులు నిర్వర్తించడం, అంతా కలిసి కాఫీ, టీ బ్రేక్‌లు తీసుకోవ డం, వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌లు..ఆ మజానే వేరు అని అధికశాతం మంది అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో తలెత్తిన పరిస్థితులతో ఐటీ కంపెనీలు మూడేళ్లకు పైగా వర్క్ ఫ్రం హోం, ఇటీవలి కాలంలో హైబ్రిడ్, ఇతర పని విధానాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కంపెనీలు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోంనే కొనసాగిస్తుండగా, మూన్‌లైటింగ్ (2 లేదా అంతకు మించి ఉద్యోగాలు చేయడం) వెలుగులోకి రావడంతో కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని చేపట్టాయి.
మరికొన్ని ఉద్యోగుల్ని పూర్తిగా ఆఫీసులకు రప్పిస్తున్నాయి. హైబ్రిడ్ విధానంలో టెకీలు 2,3 రోజులు ఆఫీసుకు వెళుతూ, మిగతా రోజుల్లో ఇంటి నుంచి పని చేస్తున్నారు. అయినప్పటికీ 86 శాతం మంది భారతీయ వృత్తి నిపుణులు, టెకీలు రెగ్యులర్‌గా ఆఫీసుకు వెళ్లడం పైనే ఆసక్తి కనబరుస్తున్నట్లు తేలింది.
రోజూ ప్రత్యక్షంగా తమ తోటి ఉద్యోగుల్ని కలుసుకోవాలని, వారితో స్నేహ సంబంధాలు కొనసాగించాలని 78% కోరుకుంటున్నట్లు వెల్లడైంది. ఆఫీసులకు వెళితే మనోబలం, మానసికస్థైర్యం పెరుగుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ‘సెన్సస్ వైడ్’అధ్యయనం ఆధారంగా ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ సైట్ లింక్డ్ ఇన్ రూపొందించిన తాజా నివేదికలో పలుఅంశాలు వెల్లడయ్యాయి.
నివేదికలో ముఖ్యాంశాలు...
► వర్క్ ప్లేసెస్‌లో ‘చాయ్ బ్రేక్ బాండింగ్’
(కలిసి టీ తాగే మంచి సమయం) మిస్సవుతున్నామన్న 72 శాతం మంది.
► వర్క్ ఫ్రం హోం విధానానికే పరిమితమైతే ‘కెరీర్ గ్రోత్’(వృత్తి పరమైన ఎదుగుదల) తగ్గిపోతుందనే భావనలో 63% ఉన్నారు.
► ఆఫీసులో గురువారం కల్లా మొత్తం పని పూర్తిచేసుకుని, ఆ రోజునే ‘న్యూ ఫ్రైడే’గా మార్చుకోవాలని, శుక్రవారం ఆఫీసుకు వెళ్లకుండా లాంగ్ వీకెండ్ గడపాలని
79 శాతం మంది కోరుకుంటున్నారు.
► శుక్రవారాల్లో మరింత ఎక్కువ సమయం కుటుంబం, మిత్రులతో గడపాలని 50 శాతం మంది భావిస్తున్నారు.
► రిమోట్ వర్కింగ్ పద్ధతి వల్ల తమ వృత్తులపై ప్రతికూల ప్రభావం పడలేదని 63 శాతం మంది పేర్కొన్నారు.
► కేవలం కొలీగ్స్‌తో సోషల్ ఇంటరాక్షన్ కోసం ఆఫీసుకు వెళ్లాలనుకుంటున్నట్లు
43 శాతం మంది చెప్పారు.
► సహోద్యోగులతో ముఖాముఖి, ఆఫీసు మీటింగ్‌లు మరింత కార్యదక్షతతో పని చేసేందుకు దోహదపడతాయని 42 శాతం మంది చెప్పారు. మంచి స్నేహ సంబంధాలు పెరుగుతాయని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు.
► శని, ఆదివారాల బ్రేక్ తర్వాత మొదలయ్యే సోమవారాన్ని ‘మోస్ట్ ఫోకస్డ్ డే’గా 39% మంది పేర్కొన్నారు.
నైతిక బలం పెరుగుతుందని విశ్వసిస్తున్నారు
వృత్తి నిపుణులు, టెకీల వంటి వారు ఫ్లెక్సిబుల్ పని విధానాన్ని కోరుకుంటున్నారు. అదే సమయంలో ఆఫీసులకు రావడానికి అత్యంతప్రాధాన్యతనివ్వడంతో పాటు టీమ్‌వర్క్ ద్వారా తమ నైతిక బలం పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. చాయ్ బ్రేక్‌లు, కొలీగ్స్‌తో సరదా చర్చలు తమను చైతన్యపరచడంతో పాటు మరింత మెరుగైన ఫలితాల సాధనకు దోహదపడతాయని భావిస్తున్నారు.– నిరజిత
బెనర్జీ, లింక్డ్‌ఇన్(ఇండియా) మేనేజింగ్ ఎడిటర్
Comments
Please login to add a commentAdd a comment