‘శివమణి’ సినిమాలో ఆపదలో ఉన్న ఆడపిల్ల ఒక ఫోన్ కొడితే చాలు, పోలీస్ ఆఫీసర్ నాగార్జున వెంటనే అక్కడ ప్రత్యక్షమై ఆ అమ్మాయిని వేధిస్తున్న పోకిరీల పని పడతాడు! అంతకన్నా పెద్ద ఉమెన్ ప్రొటెక్షన్.. ‘శక్తి’! ఒక్క ఫోన్ కాల్, ఒక్క మెయిల్, ఒక్క వాట్సాప్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు ‘శక్తి’ వెళ్లి ఎంతటివాడినైనా సెట్‌రైట్ చేస్తుంది. ‘సబల’గా మొదట గుంటూరు జిల్లాలో మొదలైన ఈ మహిళా రక్షణ వ్యవస్థ.. ‘శక్తి’గా ఇప్పుడు రాష్ట్రమంతటా విస్తరించి ఆపద్బాంధవిగా సేవలు అందిస్తోంది.
భర్త విదేశాల్లో ఉండటంతో కుమార్తెతో కలిసి ఉంటున్న ఓ మహిళను.. భార్య, ఇద్దరు పిల్లల ఉన్న ఓ కారు డ్రైవర్ ట్రాప్ చేసి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ న్యూడ్ ఫొటోలు, వీడియోలు దగ్గర ఉంచుకున్నాడు. తర్వాత ఆమె కుమార్తెను సైతం మాయ మాటలతో లోబరుచుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ కుమార్తె న్యూడ్ ఫొటోలు, వీడియోలను తీసి, పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలంటూ ఆ మహిళను బ్లాక్‌మెయిల్ చెయ్యడం మొదలుపెట్లాడు. దీంతో ఆమె చివరి ప్రయత్నంగా ‘శక్తి’ బృందాన్ని ఆశ్రయించింది. శక్తి బృందం ఆ కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న అశ్లీల ఫొటోలు, వీడియోలని తొలగించి ఆమెకు రక్షణగా నిలిచింది.సొంత బాబాయే పలుమార్లు అత్యాచారానికి పాల్పడడంతో బయటకు చెప్పుకోలేక గర్భం వస్తుందనే భయాన్ని దాచుకోలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్న ఓ యువతి ‘సబల’ బృందాన్ని ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుని రోదించింది.
విషయం బయటకు పొక్కితే కుటుంబం పరువు పోతుందని వేడుకుంది. ఆమె వివరాలు గోప్యంగా ఉంచిన సబల బృందం విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి ఆమెకు ఆ టార్చర్ నుంచి విముక్తి కల్పించారు.ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి, యువకుడు తమ స్నేహాన్ని ప్రేమగా మార్చుకునేందుకు ఒకరినొకరు కలుసుకున్నారు. ఫేస్‌బుక్‌లో యువకుడి చాటింగ్‌లకు ఆకర్షితురాలైన యువతి నేరుగా అతన్ని చూసి అందంగా లేకపోవడంతో ప్రేమ వద్దని, స్నేహంగా మెలుగుదామంటూ సూచించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు యువతికి సంబంధించిన వివరాలతో ఫేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్‌ను తెరిచి యువతి, ఆమె కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు అందులో ఉంచి ఆమె కావాలంటే గంటకు రూ. 5వేలు చెల్లిస్తే చాలంటూ అసభ్యకరంగా పోస్ట్‌లు పెట్టాడు. మెడిసిన్ చదువుతున్న ఆ యువతి పోలీసుస్టేషన్‌కు వెళితే పరువు పోతుందనే భయంతో ‘సబల’ను ఆశ్రయించింది. వారు ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగిని పట్ల తోటి ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వైనంపై బాధితురాలు సబలను ఆశ్రయించగా, ఇద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
అతడు మహిళా ఉద్యోగికి క్షమాపణ చెప్పడంతోపాటు, వేరేచోటకు బదిలీ చేయించుకుని వెళ్లి పోవడంతో సమస్య పరిష్కారం అయింది.ఇలా దారుణమైన సంఘటనలు ఎన్నో çశక్తి (సబల) బృందాల దృష్టికి రావడం, వెంటనే స్పందించి వాటిని పరిష్కరించడంతోపాటు, ఫిర్యాది వివరాలు గోప్యంగా ఉంచుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ‘సబల’కు ఆదరణ పెరిగిపోయింది. ఐదేళ్ల పసిపాపల నుంచి 80 ఏళ్ల వృద్ధురాళ్ల వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆకృత్యాలలో కేవలం 20 శాతం మాత్రమే పోలీసు స్టేషన్‌ల వరకు వెళుతున్నాయి. మిగతా వారంతా పరువు పోతుందనో... కేసులకు భయపడో .. తమలో తాము కృంగిపోతూ తమకు జరిగిన అన్యాయాలను బయటకు చెప్పుకోలేక లోలోనే మధనపడుతున్నారు. ఈ పరిస్థితిని మెరుగుపరచడం కోసం సమాజంలో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న దురాగతాలను అరికట్టే దిశగా గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ సి.హెచ్.వెంకటప్పలనాయుడు గత ఏడాది జూన్ 29వ తేదీన ‘సబల’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో ‘సబల’ పేరుతో 126 మంది మహిళ కానిస్టేబుళ్లతో 62 బృందాలను ఏర్పాటు చేశారు.
జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలలు, బాలికల హాస్టళ్లు, కళాశాలలు, మహిళలు ఎక్కువగా ఉండే ప్రతి ఇనిస్టిట్యూట్‌కు ఈ సబల బృందాలు వెళ్లి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నాయి. ‘సబల’ బృందాలు ఇలా విజయవంతం అవడంతో అనంతరం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించాలని నిర్ణయించిన పోలీసు ఉన్నతాధికారులు ‘శక్తి’ పేరుతో ఇప్పుడీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో తిరిగే సబల బృందాలకు సైకిల్‌తోపాటు.. వారి రక్షణకు పెప్పర్ స్ప్రే, లాఠీలను అందించారు. గుంటూరు ఎస్పీ కార్యాలయం పక్కనే ప్రత్యేకంగా సబల కంట్రోల్ రూమును ఏర్పాటు చేసి ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా సేవలందించేలా అన్ని ఏర్పాట్లు చేశారు.
అంతేకాకుండా బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి విషయాలతోపాటు, సమాజంలో జరుగుతున్న వివిధరకాలైన వేధింపుల నుంచి ఏ విధంగా బయటపడాలనే దానిపై డాక్యుమెంటరీ ద్వారా వీడియోలు చిత్రీకరించి వారిలో అవగాహనను పెంచే కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగిస్తున్నారు. సబల ప్రారంభమైన ఎనిమిది నెలల వ్యవధిలో 400లకు పైగా ఫిర్యాదులను సేకరించి వాటన్నింటిని పరిష్కరించగలిగారు. 27 మంది మైనర్ బాలికల వివాహాలను అడ్డుకుని వారి భవిష్యత్తును కాపాడగలిగారు. రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు రూరల్ జిల్లా శక్తి బృందానికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. గత ఏడాది నవంబరు 24న ఢిల్లీలో జరిగిన ఉమెన్ సేఫ్టీ ఇనిషియేటివ్ అనే ఓ కార్యక్రమంలో గుంటూరు రూరల్ జిల్లా తెనాలి డీఎస్పీ పి.స్నేహిత ‘శక్తి’ పనితీరు గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దీంతో ఫిబ్రవరి 25న ఢిల్లీలో ‘స్కోచ్ అవార్డ్ ఆఫ్ మెరిట్’ అవార్డును (స్మార్ట్ గవర్నెన్స్‌కి ఇస్తారు. గుంటూరు రూరల్ జిల్లా శక్తి బృందం తరుపున నోడల్ ఆఫీసర్ స్నేహిత అవార్డును అందుకున్నారు.
- ఎన్.మాధవరెడ్డి, సాక్షి, గుంటూరు
మహిళలకు భరోసా
నేటి సమాజంలో మహిళలు, విద్యార్థినులపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. చాలామంది తమపై జరుగుతున్న అకృత్యాలను బయటకు చెప్పుకోలేక కుమిలిపోతుంటారు. ఇలాంటి సంఘటనలు మా దృష్టికి రావడంతో శక్తి బృందాలను ఏర్పాటు చేశాం. వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తూ సమాజంలో నిశ్చింతగా తిరిగేలా చేయడమే ‘శక్తి’ ముఖ్య లక్ష్యం.
ఎస్.వి.రాజశేఖర్‌బాబు,
రూరల్ ఎస్పీ
తొమ్మిది మందిని కాపాడాం
శక్తి బృందాల పనితీరు మహిళలకు వరంగా మారింది. ఆవేదనను బయటకు చెప్పుకోలేక తొమ్మిది మంది యువతులు ఆత్మహత్యకు పాల్పడే సమయంలో సబలకు ఫోన్ చేసి చెప్పడం, మా బృందం వెంటనే స్పందించి వారి ఇళ్లకు వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని రక్షించడం జరిగింది. ఎలాంటి సమస్య అయినా సరే సబల ద్వారా పరిష్కారం పొందేందుకు మహిళలు, విద్యార్థులు ముందుకు రావాలి. అప్పుడే వారికి న్యాయం జరుగుతుంది.
స్నేహిత, శక్తి నోడల్ ఆఫీసర్,
తెనాలి డీఎస్పీ
నిర్భయంగా ఫిర్యాదు
సొంత కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేని సమస్యలు, ఇబ్బందులను సబలతో పంచుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఫిర్యాదు చేసినవారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. వారికి ఇష్టం లేకుండా కేసులు నమోదు చేయం. అయినప్పటికీ సబలను ఆశ్రయిస్తే సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం. సబలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇతర జిల్లాల ఫిర్యాదులను ఆయా పరిధిలోని ఎస్‌హెచ్‌ఓలకు తెలియజేసి సమస్యను పరిష్కరించేలా చూస్తున్నాం.
– సుభాషిణి, సి.ఐ., శక్తి నోడల్ ఆఫీసర్
అండగా ఫేస్‌బుక్, వాట్సాప్
చిన్న పిల్లలు, మహిళలు నేరుగా సబలకు ఫిర్యాదులు చేసే అవకాశంతోపాటు, డయల్ 100కు ఫిర్యాదు చేసినా లేదా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో అయితే https://www. facebook.com/sabalaguntur rural.9కు, వాట్సాప్ ద్వారా అయితే 9440900866కు,ఈమెయిల్ ద్వారా అయితే sabalagrr@gmail. comకు వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు స్వీకరించి వెంటనే వారితో మాట్లాడి పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment