సాక్షి, గుంటూరు: పైరవీలతో పోస్టింగులు.. సిఫార్సులతో పదోన్నతులు.. అనుకూలుడైతే చాలు అందలం ఖాయం.. నిజాయితీ, నిబద్ధతతో అస్సలు పనేలేదు. ఇవన్నీ అక్షర సత్యాలు.. జిల్లా పోలీసు యంత్రాంగంలో సాగుతున్న లాలూచీ వ్యవహారాలు. కొందరు అధికారులు అడ్డదారులు తొక్కుతూ.. అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ పోలీసు శాఖ గౌరవాన్ని బజారుకీడుస్తున్నారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ శాఖ బదిలీల్లో చక్రం తిప్పుతూ, అనుయాయులను నియమిస్తూ టీడీపీ నాయకులకు కొమ్ముకాస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన ఎస్‌ఐల బదిలీలు. ఓ ముగ్గురు సీఐలు టీడీపీ ముఖ్యనేతల అండతో తమ మాట వినే ఎస్‌ఐల జాబితాను సిద్ధం చేసి పోస్టింగ్‌లు కేటాయించడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
జిల్లాలో ఇటీవల జరిగిన ఎస్‌ఐల బదిలీల్లో ముగ్గురు సీఐలు కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్‌ఐలకు సీఐలు పోస్టింగ్‌లు ఇప్పించడమేమిటని ఆశ్చర్యం కలుగక మానదు. అయితే ఇది అక్షర సత్యమని పోలీస్ వర్గాలే చెబుతున్నాయి. జిల్లాలో అధికార పార్టీ ముఖ్యనేతల అండదండలు ఉన్న ముగ్గురు సీఐలు తమ అనుయాయులకు ప్రాధాన్యత గల పోస్టింగ్‌లు ఇప్పించుకోవడంలో సఫలీకృతులయినట్లు సమాచారం.
పైరవీల కింగ్‌లు..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుతం పోలీస్‌శాఖలో జరిగే బదిలీలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. తమ మాట విని ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేసే ఎస్‌ఐల కోసం జిల్లాకు చెందిన అధికారపార్టీ ముఖ్యనేతలు అన్వేషిస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న కొందరు సీఐలు వారితో పైరవీలు సాగించి ఎస్‌ఐల జాబితాను సిద్ధం చేసి అందించినట్లు తెలుస్తోంది.
సీఐలు అధికారపార్టీ ముఖ్యనేతలకు తొ త్తులుగా వ్యవహరించడమే కాకుండా ఎస్‌ఐలను కూడా వారి వద్దకు పిలిపించి ఎన్నికల్లో అనుకూలంగా పనిచేస్తామని చెప్పించిన పిదపే పోస్టిం గ్‌లు ఇప్పించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆరోపణలు ఉన్న వారికే అందలం..
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో అధికారపార్టీ నేతలు చెప్పిన వారికే పోస్టింగ్‌లు ఇస్తూ వస్తున్నారు. ఎంతటి ప్రాధాన్యం ఉన్న పోస్టు అయినా సరే అధికారపార్టీ నేతల సిఫార్సు ఉంటే చాలు.. అదే అర్హతగా భావించి ఎన్ని ఆరోపణలు ఉన్నా, సమర్థత లేకపోయినా పోస్టింగ్‌లు ఇచ్చేస్తున్న వైనం బహిరంగ విషయమే.
ముఖ్యంగా పోలీస్‌శాఖలో పరిస్థితి మరింత దిగజారింది. నిజాయితీగా పనిచేసే అధికారులను లూప్‌లైన్‌లకు పరిమితం చేస్తూ, అవినీతికి పాల్పడుతూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొనే వారికి మాత్రం వరుసగా లాఅండ్ ఆర్డర్ పోస్టింగ్‌లు ఇస్తూ వస్తున్నారు. దీంతో పోలీస్‌శాఖలో నిజాయితీగా పనిచేసే అధికారులు మనోస్థైర్యాన్ని కోల్పోతుండటం పోలీస్‌శాఖకు ప్రమాదకర పరిస్థితిని తెచ్చిపెట్టేదిగా మారనుంది.
అవినీతి అధికారులు కనిపించడం లేదా?
ఆరోపణలు ఎదుర్కొని విచారణలు జరుగుతున్న డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలకు వరుస పోస్టింగ్‌లు ఇప్పిస్తుండటంతో వీరు బాధ్యత మరిచి అధికారపార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో పనిచేసే కొందరు డీఎస్పీలు, సీఐలు అవినీతి, అడ్డగోలు వ్యవహారాల్లో అడ్డంగా దొరికిపోయినప్పటికీ.. తమపై చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులపై అధికారపార్టీ ముఖ్యనేతల ద్వారా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. అధికారపార్టీ నేతల అండతో ఉన్నతాధికారులను సైతం టార్గెట్ చేసేంత స్థాయికి వచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎస్‌ఐల బదిలీల్లో ముగ్గురు సీఐల ‘కీ’ రోల్..
ఇటీవల జిల్లాలో జరిగిన ఎస్‌ఐల బదిలీల్లో జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు సీఐలు ‘కీ’ రోల్ పోషించినట్లు సమాచారం. ‘కోట’లో యువరాజును పట్టుకుని ఓ సీఐ.. పల్నాడులో ముఖ్యనేత అండతో మరో సీఐ.. డెల్టా ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధి ద్వారా ఇంకో సీఐ అనేక మంది ఎస్‌ఐలకు పోస్టింగ్‌లు ఇప్పించారనే విషయం చర్చనీయాంశమైంది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారపార్టీ నేతలు చెప్పినట్లుగా పనిచేయాలని చెప్పి సదరు సీఐలే జాబితాలు తయారు చేసి పంపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పైరవీలు చేస్తున్న సీఐలంతా టీడీపీ అధికారంలోకి వచ్చాక వరుస పోస్టింగ్‌లు పొంది ప్రస్తుతం ఎన్నికల నిబంధనల వల్ల లూప్‌లైన్‌లకు వెళ్తూ తమ ప్రతినిధులుగా గతంలో తమ వద్ద పనిచేసిన ఎస్‌ఐలను అధికారపార్టీ నేతలకు అప్పగించి స్వామి భక్తిని చాటుకుంటున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment