How to Use Disha App | దిశ యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే.. | AP Government | in Telugu - Sakshi
Sakshi News home page

దిశ యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే..

Published Fri, Feb 14 2020 12:42 PM | Last Updated on Fri, Feb 14 2020 3:12 PM

How to Use Disha SoS App by AP Government in Telugu - Sakshi

సాక్షి, అమరావతి : మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోచ్చిన దిశ యాప్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందిస్తున్న తీరుపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఉన్న మహిళల కోసం రూపొం‍దించిన ఈ యాప్‌ను కేవలం నాలుగు రోజుల్లోనే 50 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అలాగే ఓ అన్నగా తమ భద్రత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మహిళలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇటీవల ఓ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ దిశ యాప్‌ ద్వారా సాయం కోరగా.. కేవలం ఆరు నిమిషాల్లోనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆమెను వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

తొలుత ఇంటర్నెట్‌ సాయంతో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు.. ఆ తర్వాత ఇంటర్నెట్‌ ఉన్నా లేకున్నా ఫోన్‌ ద్వారా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు. ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కడం ద్వారా గానీ, ఫోన్‌ను గట్టిగా అటూఇటూ ఉపడం ద్వారా గానీ  ఆపదలో ఉన్న మహిళలు దిశ కాల్‌ సెంటర్‌కు సమాచారం ఇవ్వవచ్చు. ఆ తర్వాత ప్రమాదంలో ఉన్న మహిళలను కాపాడేందుకు దిశ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పోలీసులకు ఆటోమేటిక్‌గా సమాచారం అందుతుంది.

దిశ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి, కంట్రోల్‌ రూమ్‌కు ఎలా ఫిర్యాదు చేయాలో పూర్తి వివరాలు ఓసారి చుద్దాం..

ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ మొబైల్‌ ఫోనుల్లో ప్లేస్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
► ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికి ఇంటర్నెట్‌ అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్నెట్‌ ఉన్నా, లేకున్నా మొబైల్‌ ద్వారా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు.
► ఆపదలో ఉన్నవారు ఈ యాప్‌ను ఓపెన్‌ చేసి అత్యవసర సహాయం(ఎస్‌వోఎస్‌) బటన్‌ నొక్కితే చాలు.. వారి ఫోన్‌ నంబర్, చిరునామా, వారున్న ప్రదేశం వివరాలు దిశ కంట్రోల్‌ రూమ్‌కు చేరతాయి. 
► ఎస్‌వోఎస్‌ బటన్‌ ప్రెస్‌ చేసే సమయం లేనప్పుడు చేతిలోని ఫోన్‌ను గట్టిగా అటూఇటూ ఊపితే చాలు.. దిశ కమాండ్‌ రూమ్‌కు సమాచారం చేరుతుంది. 
► ఎస్‌వోఎస్‌ బటన్‌ను నొక్కితే వాయిస్‌తోపాటు పది సెకన్ల వీడియోను కూడా రికార్డు చేసి కమాండ్‌ రూమ్‌కు పంపించే వీలు ఉంది. 
► ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కగానే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం వెళ్లి.. అక్కడి నుంచి వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు, పోలీస్‌ రక్షక్‌ వాహనాలకు ఆటోమేటిక్‌గా కాల్‌ వెళ్తుంది.
► ప్రమాదంలో ఉన్నవారిని చేరుకోవడానికి జీపీఎస్‌ అమర్చిన పోలీస్‌ రక్షక్‌ వాహనాల్లోని ‘మొబైల్‌ డేటా టెర్మినల్‌’ సహాయపడుతుంది.
► అలాగే ఆపదలో ఉన్నప్పుడు సమాచారాన్ని పోలీసులతోపాటు తక్షణం కుటుంబ సభ్యులు/మిత్రులకు పంపేలా ఐదు ఫోన్‌ నంబర్ల (ఎమర్జెన్సీ కాల్స్‌)ను దిశ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. 
► దిశ యాప్‌లోని ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ ఆప్షన్‌ వినియోగిస్తే వారు వెళ్లాల్సిన ప్రాంతాన్ని కూడా నమోదు చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా వారు ప్రయాణిస్తున్న వాహనం వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా దారి మళ్లితే ఆ సమాచారాన్ని కంట్రోల్‌ రూమ్, బంధుమిత్రులకు పంపి అప్రమత్తం చేయొచ్చు. 
► ఈ యాప్‌లోనే డయల్‌ 100, డయల్‌ 112 నంబర్లను కూడా పొందుపర్చారు. డయల్‌ 100 అయితే నేరుగా కాల్‌ చేసి విషయం చెప్పాలి. డయల్‌ 112 అయితే మిస్డ్‌ కాల్‌ ఇచ్చినా సరిపోతుంది. 
► దిశ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్‌ నంబర్లు, సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ వివరాలు తెలుసుకునేందుకు ఆప్షన్లు ఉంటాయి. వైద్య సేవలు అవసరమైనప్పుడు యాప్‌ ద్వారా దగ్గర్లోని ఆస్పత్రులు, బ్లడ్‌ బ్యాంకులు, ఫార్మసీల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement