
కోడ్‌ను స్కాన్ చేస్తున్న విద్యార్థినులు
సంగారెడ్డి క్రైం: ఆటోల్లో ప్రయాణించే వారి భద్రతకు, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణించే మహిళల రక్షణ కోసం సంగారెడ్డి జిల్లా పోలీసులు రాష్ట్రంలోనే మొదటిసారిగా ‘‘మై వెహికల్ ఈజ్ సేఫ్’’పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లా పరిధిలోని ఆటోలన్నింటికీ ప్రత్యేకంగా ఓ బార్‌కోడ్ కేటాయించారు. స్మార్ట్‌ఫోన్‌తో ఆ బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే క్షణాల్లో డ్రైవర్‌కు సంబంధించిన వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఆటో ఎక్కిన మరుక్షణమే కోడ్‌ను స్కాన్ చేసి ఆ వివరాలను కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఇలా ఎవరికైనా ముందు జాగ్రత్తగా పంపించుకోవచ్చు. దీని సాయంతో డ్రైవర్లు ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, నేరాలకు పాల్పడినా పోలీసులు వారిని సులువుగా గుర్తించి అదుపులోకి తీసుకునే వీలుంటుంది.
గత సంఘటనల నేపథ్యంలోనే..
పల్లె జనం, ముఖ్యంగా మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు ఆకతాయిలు గతంలో పలు అఘాయిత్యాలకు పాల్పడిన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం నేరాల నియంత్రణకు ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసి ఆటోవాలాల్లో బాధ్యతను, భయాన్ని నింపేందుకు ప్రతి ఆటోకు ప్రత్యేక నంబర్ కేటాయించి అతని పూర్తి వివరాలు సేకరించింది.
అక్రమాలు అరికట్టేందుకే..
ఆటోలో ప్రయాణించేటప్పుడు మీ వస్తువులు మర్చిపోయినా, మిమ్మల్ని వేధింపులకు గురి చేసినా, మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా స్కాన్ చేసిన కోడ్ నుంచి వచ్చిన వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. జిల్లాలో మొత్తం 4,000 ఆటోలు ఉండగా పోలీసులు ఇప్పటికే 2,200 ఆటోల వివరాలను సేకరించారు. ఒక్క సంగారెడ్డి పట్టణంలోనే 1,600 ్డఆటోలను గుర్తించారు. వాటన్నింటికీ కోడ్‌తో కూడిన బోర్డులను అమర్చారు. ప్రయాణికులను చేరవేసే టాటా సుమోలు, తుపాన్‌లాంటి వాహనాలకు సైతం ఇదే విధానాన్ని అమలు చేసేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
ఆటో ముందు, వెనుక కోడ్‌తో కూడిన స్టిక్కర్లు
ఆటో ముందు అద్దానికి ప్రింట్ మిర్రర్ స్టిక్కర్ అతికిస్తారు. అలాగే ఆటో వెనకాల సైతం ఓ స్టిక్కర్ ఉంటుంది. వీటిపై ఆటో సీరియల్ నంబర్, ఆటో నంబర్‌తో కూడిన క్యూఆర్ కోడ్ ఉంటాయి. ఆటోను ఎవరైనా నేరం చేయడానికి ఉపయోగిస్తే జిల్లావ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా గుర్తించి నేరానికి పాల్పడిన డ్రైవర్ వివరాలను సులువుగా గుర్తించవచ్చు.
స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు..
డ్రైవర్ సీటు వెనకాల ‘మై వెహికల్ ఈజ్ సేఫ్’అనే క్యాప్షన్‌తో యూవీ ప్రింటెడ్ బోర్డు ఉంటుంది, దీనిపై ఆటో సీరియల్ నంబర్, ఆటో నంబర్, ఆటో డ్రైవర్ పేరు, అడ్రస్ ఉంటాయి. ఆటోలో ప్రయాణించే వారి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. ప్లేస్టోర్ నుంచి క్యూఆర్ కోడ్ స్కానర్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింటెడ్ బోర్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఆటో వివరాలతో పాటు, డ్రైవర్, ఓనర్ వివరాలు తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఆటోడ్రైవర్ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. దర్యాప్తులో పోలీసులకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
సురక్షిత ప్రయాణానికి భరోసా
పోలీసులు చేపట్టిన ఈ చర్య ప్రయాణికులకు ఎంతో భరోసా కల్పిస్తుంది. గతంలో ఒంటరిగా ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో సురక్షితమైన ప్రయాణం చేయడానికి ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుంది.
–దేవవాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్, సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment