
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ గోపీనాథ్ జట్టి
కర్నూలు : మహిళలు, బాలికల రక్షణ కోసం ‘ఆడబిడ్డలకు రక్షణగా కదులుదాం’ పేరుతో పోలీస్‌శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 7వ తేదీన ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమ నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందుకు సంబంధించి శనివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయం వ్యాస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ గోపీనాథ్‌జట్టి మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటలకు అన్ని ప్రభుత్వ శాఖలతో కలసి మండల కేంద్రాలు మొదలు జిల్లా కేంద్రం వరకు ర్యాలీలు నిర్వహిస్తున్నామని, బాధ్యత కల్గిన ప్రతిపౌరుడు తన వంతుగా పాల్గొని చిన్న పిల్లలపై లైంగిక దాడులను ముక్తకంఠంతో ఖండించాలన్నారు. అలాంటి ఘటనలను వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. 2012లో అమలులోకి వచ్చిన పోక్సో యాక్ట్ కింద ఇప్పటివరకు జిల్లాలో 256 కేసులు నమోదు చేయగా 204 కేసులు ఫైనలైజ్ అయ్యాయని వెల్లడించారు. 52 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇందుకు సంబంధించి నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. 27 కేసుల్లో చార్జిషీట్ వేశామన్నారు. కర్నూలు పాతబస్తీలో క్రైం నంబర్ 81/2015 కేసులో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పఠాన్ కాజా ఖాన్‌కు మరణించేవరకు కోర్టు జైలు శిక్ష ఖరారు చేసిన సంగతిని ఈ సందర్భంగా ఎస్పీ గుర్తు చేశారు. అడిషనల్ ఎస్పీ షేక్‌షావలితో పాటు జిల్లాలోని అన్ని సబ్ డివిజన్‌ల అధికారులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
ఆడపిల్లలకు అండగా నిలుద్దాం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పిలుపు
కర్నూలు(అగ్రికల్చర్): ఆడపిల్లలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్న నేపథ్యంలో వారికి రక్షణ కవచంగా నిలుద్దామని కలెక్టర్ సత్యనారాయణ జిల్లా యంత్రాంగానికి పిలుపునిచ్చారు. శనివారం ఉదయం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో.. కొద్ది రోజులుగా ఆడ పిల్లలపై జరుగుతున్న ఘటనలపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆడ పిల్లలకు రక్షణ కవచంగా నిలిచేందుకు ఈ నెల 7వ తేదీ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిద్దామని తెలిపారు. ఉదయం 7 గంటలకు కలెక్టరేట్ నుంచి అంబేడ్కర్ భవనం, జిల్లా పరిషత్, కొండారెడ్డి బురుజు నుంచి బ్యాచ్‌ల వారీగా ర్యాలీ ప్రారంభమై అవుట్ డోర్ స్టేడియం చేరుకోవాలన్నారు. అక్కడ నిర్వహించే సమావేశంలో మహిళలపై అత్యాచారాలను ఖండిస్తూ వక్తలు ప్రసంగిస్తారని, ఈ కేసుల్లో పడే శిక్షల తీవ్రతను వివరిస్తారని తెలిపారు. సమావేశంలో ఎస్పీ గోపీనాథ్ జట్టీ, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, డీఆర్వో శశీదేవి, ఐసీడీఎస్, డీఆర్‌డీఏ పీడీలు జుబేదాబేగం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment