
ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న యాప్ టిక్‌టాక్. సినిమా డైలాగులు, పాటలు, భావోద్వేగాలకు అనుగుణంగా వీడియోలు అప్‌లోడ్ చేయడం ద్వారా తమ టాలెంట్‌ను బయటపెట్టేందుకు అవకాశం ఉన్న ఈ యాప్ పట్ల... యువతతో పాటు చిన్నారులు, పెద్దలు కూడా ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టిక్‌టాక్ పట్ల ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు ఉత్తరాఖండ్ పోలీసులు సిద్ధమయ్యారు. మహిళలకు ఆత్మరక్షణ మెళకువలను నేర్పేందుకు ఈ యాప్‌ను ఎంచుకున్నారు. రోడ్డు భద్రత, సెల్ఫ్ డిఫెన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ ఇప్పటికే లక్ష హార్ట్‌లను సంపాదించుకున్న పోలీసులు.. మరిన్ని సరికొత్త వీడియోలను అప్‌లోడ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ విషయం గురించి ఉత్తరాఖండ్ డీజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ..‘ ప్రజలకు త్వరగా..మరింత చేరువకావడానికి టిక్‌టాక్ ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం. రోడ్డు భద్రత, సైబర్ సెక్యూరిటీ, మహిళా రక్షణకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నాం. వీటికి మంచి స్పందన కూడా వస్తోంది’ అని పేర్కొన్నారు. పలు సామాజిక కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దిశగా మరిన్ని వీడియోలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోలకు నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. టిక్‌టాక్‌తో ఇటువంటి లాభాలు కూడా ఉంటాయని కామెంట్లు చేస్తున్నారు.