సరిహిత | Special storty to Andhra Pradesh Women Protection Cell Incharge SP Sarita | Sakshi
Sakshi News home page

సరిహిత

Published Fri, Sep 28 2018 12:09 AM | Last Updated on Fri, Sep 28 2018 5:11 AM

Special storty to Andhra Pradesh Women Protection Cell Incharge SP Sarita - Sakshi

సరిత, ఆంధ్రప్రదేశ్‌ విమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌పి

పోలిసింగ్, పేరెంటింగ్‌..  రెండూ టఫ్‌ జాబ్స్‌. ఈ రెండు జాబ్స్‌నీ ఎంతో  ఇష్టంగా చేస్తున్నారు సరిత! హ్యూమన్‌ టచ్‌తో  ఎంత టఫ్‌ జాబ్‌నైనా డీల్‌ చెయ్యొచ్చంటారు  ఈ పోలీస్‌ ఆఫీసర్‌. అంటే.. క్రైమ్‌ వెనుక వ్యథను తాకి చూస్తారు.పిల్లలకు హృదయాన్ని తాకేలా కథను చెప్తారు. హితవు పలుకుతారు.

పాండవులు వనవాసం చేస్తున్నప్పడు ఒకరోజు నకులసహదేవులు ఇద్దరూ వాకింగ్‌కి బయలుదేరుతారు. వెళ్తుంటే ఒక అందమైన గుర్రం కనిపిస్తుంది. ‘‘ఎన్నో గుర్రాలను చూశాం.. కాని ఇలాంటి గుర్రాన్ని చూడలేదెన్నడు. ఎలాగైనా దీన్ని సొంతం చేసుకోవాలి’’ అని అనుకుంటూ ఆ గుర్రం ఆసామి దగ్గరకు వెళ్తారు. ఆ గుర్రం కావాలి అని అడుగుతారు. ‘‘ఈ గుర్రం సొంతం చేసుకోవాలంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి’’ అంటాడు ఆ ఆసామి. ‘‘ఓ దానికేం.. చెప్తాం’’ అంటారు అన్నదమ్ములిద్దరూ. తమ జ్ఞానసముపార్జన మీదున్న నమ్మకంతో. ‘‘ఇక్కడ అయిదు చిన్న చెరువులు, ఒక పెద్ద చెరువు ఉంది. పెద్ద చెరువులోని నీళ్లతో చిన్న చెరువులను నింపొచ్చు. కాని చిన్న చెరువుల నీళ్లతో పెద్ద చెరువును నింపలేం. ఎందుకు?’’ అని అడుగుతాడు ఆసామి. ‘‘ఏముంది.. పెద్ద చెరువు లోతెక్కువుండి ఉంటుంది’’ అని, ‘‘పెద్ద చెరువులో మట్టి నీటిని బాగా పీల్చుకుంటుందేమో’’నని.. రకరకాల జవాబులు చెప్పసాగారు వాళ్ల జ్ఞానానికి తోచినట్టు. ఆ సమాధానాలకు సంతృప్తిపడలేదు ఆసామి. నకులసహదేవుల కంటే పెద్దయిన అర్జునుడు వచ్చాడు ఆన్సర్‌ చెప్పడానికి. అతని జవాబూ సరికాదు అన్నాడు గుర్రం యజమాని. భీముడు వచ్చాడు. చెప్పాడు. పెదవి విరిచాడు ఆసామి. అతనికి ధర్మరాజే సరైన జవాబివ్వగలడని అగ్రజుడిని పిలిపించారు. ప్చ్‌.. ధర్మరాజు సమాధానమూ తప్పే. హతవిధీ అనుకున్నారు పంచపాండవులు. అప్పుడు చెప్పాడు ఆసామి.. ‘‘ఈ పెద్ద చెరువు మన తల్లిదండ్రుల్లాంటిది. తతిమావన్నీ పిల్ల చెరువులు. తల్లిదండ్రుల ప్రేమ అనంతం.. ఎంత తోడుకున్నా.. ఇంకా ఊరుతూనే ఉంటుంది. వాళ్ల రుణం తీర్చుకోలేనిది. అందుకే పిల్ల చెరువులు ఖాళీ అయినా పెద్ద చెరువు నిండదు’’ అని చెప్తాడు ఆసామి. 

ఈ కథ ఇప్పుడు వాట్సప్‌లో వైరల్‌. ఆ కథ చెప్పిన ఆవిడ పేరు కేజీవి సరిత. ఆంధ్రప్రదేశ్‌ విమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌పిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిన్న చిన్న కథలతో పిల్లలను ఇలా మోటివేట్‌ చేయడం ఆమెకు ఇష్టం. నేరం జరిగాక విచారించడం కన్నా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నమ్ముతారు. ఆ విశ్వాసాన్ని ప్రాక్టీస్‌లో కూడా పెడ్తారు. అందులో భాగమే ఇలాంటి మోటివేషనల్‌ స్పీచెస్‌. కొంచెం వీలు చిక్కినా దగ్గర్లో ఉన్న బడికి వెళ్లి పిల్లలకు తను నేర్చుకున్న జీవన సత్యాలను చెప్తుంటారు. తన వృత్తిలో ఎదురైన సంఘటనల తాలూకు సారాన్ని పాఠంగా మలిచి వివరిస్తుంటారు.‘‘పిలల్లు భవిష్యత్‌ నిర్మాతలు. వాళ్లు ఆరోగ్యంగా ఆలోచిస్తే భావి భారతమూ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే పిల్లలకే చెప్తాను’’ అంటారు సరిత. 

కానిస్టేబుల్‌ కూతురు
సరిత పుట్టిపెరిగింది విజయవాడలో. తండ్రి సీతారామయ్య. రిటైర్డ్‌ స»Œ  ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌. సరిత పుట్టినప్పుడు కానిస్టేబులే. ‘‘నేను కానిస్టేబుల్‌ కూతురిని’’ అని గర్వంగా చెప్తుంటారు సరిత. తల్లి సీతారత్నం. ఎమ్మే సోషియాలజీ చేశారు. గృహిణి. కాని ఆధునిక ఆలోచనలున్న అమ్మ.  ‘‘మా అమ్మది బ్రాడర్‌ అవుట్‌లుక్‌. ఆడపిల్లలు కూడా చదవాలి, అని నాన్నకు చెప్పి నన్ను బాగా చదివించింది. నా మీద అమ్మ ఇన్‌ఫ్లుయెన్స్‌ ఎక్కువ. నాకు ఆమె ఇన్‌స్పిరేషన్‌ కూడా’’ అని అమ్మ గురించీ అంతే గొప్పగా ఫీలవుతారు సరిత. సీతారత్నం  పుస్తకాలు బాగా చదివేవారట. ముఖ్యంగా నవలలు. వాటి ప్రభావంతోనే కూతురు ఇండిపెండెంట్‌గా ఉండాలని కోరుకునేవారు. అమ్మాయిని ఐఏఎస్‌ చేయాలని అనుకున్నారు. అందుకే అంతగా ఆర్థికస్థోమత లేకపోయినా కూతురుని మంచి స్కూల్లో చేర్పించారు.అంతే మంచి కాలేజ్‌లో చదివించారు. వాళ్లమ్మ వల్ల సరితా కలెక్టర్‌ కావాలనే గోల్‌ పెట్టుకున్నారు చిన్నప్పుడే. ఆరో క్లాస్‌లో ఉన్నప్పుడే ‘‘పెద్దయ్యాక ఏమవుతావ్‌?’’ అని ఎవరైనా అడగగానే.. టక్కున ‘‘కలెక్టర్‌ అవుతా’’ అని  చెప్పేవారట.  అన్నట్టుగానే డిగ్రీ అయ్యాక సివిల్స్‌ రాశారు. కాని రాలేదు. గ్రూప్‌ వన్‌లో డీఎస్‌పీగా వచ్చింది. ‘‘పోలీస్‌ అంటే చాలా హార్డ్‌ జాబ్‌. నువ్వు చాలా సెన్సిటివ్‌.  నీకు సరిపడదు వద్దులే’’ అని  తండ్రి అనడంతో ఊరుకున్నారు సరిత. అయితే తనలో ఆశ చావక మళ్లీ సివిల్స్‌ రాశారు. రాలేదు. ఈలోపు పెళ్లియింది. (భర్త.. కోటేశ్వరరావు, అడ్వకేట్, విజయవాడ). ఒక కొడుకు కూడా పుట్టాడు. ఈసారి  గ్రూప్స్‌రాశారు. మళ్లీ డీఎస్‌పీగా సెలెక్ట్‌ అయ్యారు. ఆ రిజల్ట్స్‌ వచ్చేటప్పటికి రెండో బిడ్డతో ప్రెగ్నెంట్‌. ఈసారి తండ్రి వారించలేదు. ‘‘కిందటిసారే తప్పు చేశాను నిన్ను ఆపి. ఈ సారి ఆ తప్పు చేయను’’ అని ప్రోత్సహించారు. సర్వీస్‌లో జాయిన్‌ అయ్యారు సరిత. సివిల్స్‌ రాలేదని నిరుత్సాహ పడలేదు. ‘‘నేను దేనికీ రిగ్రెట్స్‌ ఫీల్‌ కాను. నాకు అందిన దానిపట్ల నిజాయితీగా ఉంటాను. హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎఫర్ట్స్‌ పెడ్తాను’’ అంటారు సరిత. 

పెరుగుతున్న నేరాలు
‘‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం 2015 నుంచి నేరాల రేటు ఎక్కువవుతోందని తేలింది. 15 శాతం పెరిగింది. అన్నీ ఆడవాళ్ల మీద జరుగుతున్నవే. వీటిల్లో తెలిసిన వాళ్లు చేస్తున్న నేరాలే ఎక్కువ. అంటే కుటుంబంలో, లేదంటే ప్రేమ పేరుతో జరుగుతున్నవి అన్నమాట. నేరాలు పెరగడానికి సాంకేతిక అభివృద్ధి కూడా ఒక కారణం. టెక్నాలాజికల్‌ డెవలప్‌మెంట్‌ను బెస్ట్‌ యూజ్‌కి కాకుండా వరెస్ట్‌ యూజ్‌కే వాడుకుంటున్నాం. రంగురాళ్ల వేటలో పడి మేలిమి వజ్రాలను వదులుకుంటున్నాం. టెక్నాలజీ అవసరమే కాని ఎంత వరకు? నాకూ ఇద్దరు మగపిల్లలు. ఆరేడు తరగతుల్లోనే వాళ్లకు సెల్‌ఫోన్స్‌ఉన్నాయి. నెట్‌ కనెక్షనూ ఉంది. క్రికెట్‌ చూడ్డం కోసం, కార్టూన్స్‌ చూడ్డం కోసం కావాలంటారు. అవి చూస్తుంటే పక్కన అవసరంలేనివి చాలా కనిపిస్తుంటాయి. వాటిని క్లిక్‌ చేస్తే మెదడులోకి ఏ చెత్త వెళ్తుందో నా పిల్లలకు చెప్తాను. మళ్లీ మన దగ్గర సెక్స్‌ ఎడ్యుకేషన్‌ అంటే తప్పుగా అనుకుంటారు. అదొక రిప్రొడక్టివ్‌ సిస్టమ్‌కు సంబంధించిన సైన్స్‌ అని అనుకోరు. అలా అనుకోక, వాటి గురించి పరిజ్ఞానం ఇవ్వకపోవడం వల్లే అనర్థాలు జరుగుతున్నాయి. క్రైమ్‌కీ అదే కారణం. ఈ రోజు ప్రేమించారని హత్యలు జరిగినా.. ప్రేమించలేదని అటాక్స్‌ జరిగినా ఇలాంటి రీజన్సే. పొసెసివ్‌నెస్‌ కారణం. పిల్లల పట్ల తల్లిదండ్రులకు, అమ్మాయి పట్ల అబ్బాయికి ఉన్న పొసెసివ్‌నెస్‌. పిల్లలు మన బాధ్యత ప్రాపర్టీ కాదు. పిల్లలకూ టీన్స్‌ జరిగే హార్మోనల్‌ చేంజెస్‌కి, జీవితంలో స్థిరపడ్డాక అంటే సామాజికంగా, ఆర్థికంగా ఇండిపెండెంట్‌ అయ్యాక ఏర్పడే అభిప్రాయాలకు మధ్య ఉన్న తేడాను చెప్పగలగాలి. ఆ ఇండిపెండెన్స్‌ సాధించడానికి చదువు ఎంత ముఖ్యమో చెప్పాలి. చదువుతోపాటు మానవసంబంధాల గొప్పదనాన్ని, విలువనూ వివరించాలి. ఇవ్వాళ్టి పిల్లలకు రోల్‌ క్లారిటీ ఉండాలి.. అంటే తమ మీద తమకు స్పష్టత ఉండాలి. అలాగే గోల్‌ క్లారిటీ ఉండాలి. ఏం సాధించదల్చుకున్నారో తెలిసుండాలి. సమాజంలో తను ఎలా ఉండాలి? తను సమాజం ఎలా ఉంటున్నాడో ఎరిగి ఉండాలి. కలలు కనాలి.. సాధించుకునే సత్తా తెచ్చుకోవాలి.

స్పర్శ కోల్పోతున్నాం 
నాకనిపిస్తుంది మనం స్పర్శ కోల్పోతున్నామేమోనని. నా పిల్లలిద్దరికీ చిన్నప్పుడు నా చేయి లిక్‌ చేసే అలవాటు ఉండేది. మా బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్లు.. ‘‘ఒరేయ్‌ నా చేయి పట్టుకోరేమర్రా’’ అని వాళ్లు సరదాకి అడిగినా.. ‘‘నీ దగ్గర మమ్మీ స్మెల్‌ రాదు’’ అని చెప్పేవాళ్లు. స్పర్శ అంత ప్రభావం చూపిస్తుంది.  టచ్‌ కోల్పోవడం వల్ల ఇంటర్‌పర్సనల్‌ రిలేషన్స్‌ని కోల్పోతున్నాం. సెన్సిటివిటీ పోయి భయం పెరిగింది. భరోసా తగ్గింది. అదే చెడు పరిణామాలకు దారితీçస్తుంది. ఇవన్నిటికీ ఇంకో కారణం.. పేరెంట్స్‌ రోల్‌ తగ్గిపోవడం. డ్యూ టు బిజీనెస్‌. ఇలాంటప్పుడే టీచర్‌ రోల్, పోలీస్‌ రోల్‌ పెరగాలి. క్రైమ్‌ ప్రివెన్షన్‌ను సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీగా తీసుకోవాలి’’ అంటారు కేజీవీ సరిత. 

యూనిఫామ్‌..  ఒక ఇన్‌స్పిరేషన్‌
ఇప్పటి తెలంగాణ (అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌) లోని నిజామాబాద్‌ జిల్లా, బోధన్‌ పట్టణంలో డీఎస్పీగా ఫస్ట్‌ పోస్టింగ్‌. అక్కడే ప్రారంభించారు ఆమె... క్రైమ్‌ ప్రివెన్షన్‌ మెథడ్స్‌ను. తన జ్యూరిస్‌ డిక్షన్‌లోని సర్కారు బడులన్నిటికీ వెళ్లారు. ప్రతి సోషల్‌వెల్‌ఫేర్‌ హాస్టల్‌కూ వెళ్లారు.  ‘‘నేరస్తులను పట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్‌ చేయడంతో పోలీస్‌గా నా డ్యూటీ అయిపోతుంది. కాని మళ్లీ మళ్లీ నేరాలు జరక్కుండా ఆపాలి. అంటే నేరం వెనకున్న ఆర్థిక, సామాజిక కోణాలు పరిశీలించాలి. అప్పుడే పరిష్కారం దొరుకుతుంది. నేరం జరక్కుండా ఆపగలిగే జాగ్రత్త అదే. వాటిని పిల్లలకు చెప్పాలి. అదీ  నా అసలైన డ్యూటీ. యూనిఫామ్‌లో అడ్రస్‌ చేస్తే  పిల్లలు ఇన్‌స్పైర్‌ అవుతారు’’ అంటారు సరిత. ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు అవేర్‌నెస్‌ క్యాంప్స్‌ కూడా నిర్వహించారు. బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్‌ పోటీలు పెట్టేవారు. క్రిస్‌మస్, న్యూ ఇయర్‌ హాస్టల్స్‌లో, స్కూళ్లల్లో పిల్లలతో కలిసి సెలబ్రేట్‌ చేసేవారు. ఐ డొనేషన్‌ క్యాంప్స్‌ పెట్టేవారు. వరంగల్, ఏలూరు, గుంటూరు .. ఇలా ఏ పట్టణం వెళ్లినా ఆ పద్ధతినే అనుసరించారు. పిల్లలు, మహిళలను చైతన్యపరచాలనేదే ఆమె ధ్యేయం. పిల్లలంటే అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఉండాలి. ‘‘ఏ స్కూల్‌ వాళ్లయినా, కాలేజ్‌ వాళ్లయినా కేవలం అమ్మాయిలనే కూర్చోబెట్టి చెప్పండి అంటే నేను చెప్పకపోయేదాన్ని. ఏ.. అబ్బాయిలు నేర్చుకోనక్కర్లేదా? అసలు అబ్బాయిలే ఎక్కువ  నేర్చుకోవాలి అని అబ్బాయిలనూ పిలిపించేదాన్ని. ఇప్పటికీ పిలిపిస్తాను కూడా’’ అంటారు సరిత.  
– సరస్వతి రమ
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement