మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హింసాత్మక సంఘటనలలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం అత్యంత ఆందోళనకరం. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు; బాలికలపై, చిన్నారులపై జరిగే లైంగిక నేరాలు అంతకంతకూ పెరుగుతున్నాయని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లల్లో 3,026 అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. రాష్ట్ర రాజధాని నగరం అమరావతి ఉన్న గుంటూరు జిల్లాలో అత్యధికంగా 993 అత్యాచార ఘటనలు జరిగినట్లు పోలీసు రికార్డులు పేర్కొంటున్నాయి. గుంటూరు జిల్లాలో అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న అత్యాచార ఘటనలకు పరాకాష్టగా దాచేపల్లి సంఘటన నిలిచింది. ఫలితంగానే స్థానిక ప్రజల్లో ఆగ్రహావేశాలు అదుపుతప్పాయి. వారం తిరగకుం డానే అదే దాచేపల్లిలో మరో 12 ఏళ్ల మైనర్ బాలిక అత్యాచారానికి గురై గర్భం దాల్చడం తాజాగా సంచలనం సృష్టిస్తున్నది. గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలంలో మాతృదినోత్సవం రోజు 80 సంవత్సరాలు పైబడిన మహిళపై అత్యాచారం జరిగింది.
దాచేపల్లి మొదటి సంఘటన తర్వాత.. సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో చేసిన సమీక్షలో రాష్ట్రంలో పెరుగుతున్న ఇటువంటి నేరాలను ఎలా నియంత్రించాలో ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు కనపడలేదు. నేరం చేసిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని, నేరం జరిగిన వెంటనే శిక్ష పడుతుందన్న భయం నేరస్తుల్లో కలగాలని ముఖ్యమంత్రి పోలీసులకు ఆదేశాలిచ్చారు. పోలీసులు ఏవిధంగా నిందితుల్ని కఠి నంగా శిక్షించగలరు? నిందితుడు దొరకగానే అతనిని పట్టుకొని ఎన్‌కౌంటర్ చేయడాన్ని, మరోవిధంగా అదేరోజు తుదముట్టించడాన్ని కఠినంగా శిక్షించడంగా భావించాలా?
గత నాలుగేళ్లలో బాబు పరిపాలన తీరుతెన్నులను పరిశీలిస్తే.. జాతీయ క్రైమ్ రికార్డు జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలబడటంలో ఎటువంటి ఆశ్చ ర్యమూ కలగదు. సమర్థ పోలీసింగ్‌తో క్రైమ్ రేట్‌ను సున్నా శాతానికి చేరుస్తానని డిజీపీ ఆఫీసు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చెప్పిన మాటలు ఆచరణలో కనపడవు. ఉదాహరణకు నాగార్జున యూనివర్సిటీలో ‘రిషితేశ్వరి’ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఉదంతంలో రాష్ట్ర ప్రభుత్వం కనబర్చిన ఉదాసీనత, నేరస్తులను వెనకేసుకొచ్చిన తీరు దారుణం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మరో ఉదంతం మహిళా తహసీల్దారు ‘వనజాక్షి’ పై అధికార పార్టీనేత చేసిన దౌర్జన్యం. ప్రజాధనాన్ని రక్షించడానికి, అధికారాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోయిన ఓ అధికార పార్టీ నేతను ఎంతో ధైర్యంగా అడ్డుకున్న ఆ మహిళా అధికారిపై జరిగిన దౌర్జన్యం ఏ ఒక్కరూ మర్చిపోలేరు. ఆ ఆడపడుచుకు జరిగిన అన్యాయానికి యావత్ రాష్ట్రం స్పందించింది. కానీ స్వయంగా ముఖ్యమంత్రే కలుగజేసుకుని తన ఇంట్లో ప్రైవేటు పంచాయితీ నిర్వహించి తమ పార్టీ నేతపై కేసు లేకుండా తప్పించారు.
జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (నల్సా) సుప్రీం కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం 2017లో ఆంధ్రప్రదేశ్‌లో 901 లైంగిక దాడి కేసులు నమోదు కాగా, కేవలం ఒక్క బాధితురాలికే పరిహారం అందిందని, 2016లో 850 కేసుల్లో 8 మందికి, పోక్సో చట్టం కింద నమోదైన 1,028 కేసుల్లో 11 మంది మాత్రమే పరిహారం పొందారని వెల్లడించింది.
వాస్తవాలు ఇలా ఉంటే.. దాచేపల్లి సంఘటన తర్వాత హడావుడిగా ‘ఆడపిల్లలకు రక్షగా కదులుదాం’ అనే ఓ ప్రచార కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహించింది. అధికారం చేపట్టిన గత నాలుగేళ్లుగా ‘ఆడపిల్లల రక్షణ’కు బాబు ప్రభుత్వం ఏ మేరకు నిజాయితీగా కృషి చేయగలిగింది? ఇటీవల తిరుపతిని సందర్శించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కాన్వాయ్‌పై జరిగిన దాడి టీడీపీ బరితెగింపునకు నిదర్శనం. నిరసనలు తెలియజేయడానికి శాంతియుతమైన పోరాట మార్గాలను విడిచిపెడితే.. అలాంటి చర్యలు వికటిస్తాయే తప్ప ఫలి తాలు అందించవు. మనిషిలో మానవత్వం లోపిస్తే మృగం అవుతాడు. ప్రభుత్వంలో మానవీయత లోపిస్తే నేరాలు వ్యవస్థీకృతం అవుతాయి.
డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు (మొబైల్ : 99890 24579)
Comments
Please login to add a commentAdd a comment