విజయవాడ, సాక్షి: నారా చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు రెడ్ బుక్ బెదిరింపుల కేసు నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో కోర్టు ఆదేశాలానుసారం సీఐడీ, లోకేష్‌కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నోటీసులు అందుకోకపోవడంపైనా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇవాళ ఆయన కోర్టుకు హాజరవుతారా? లేదా? అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
యువగళం పేరిట యాత్ర చేపట్టిన నారా లోకేష్.. ముగింపు రోజున పలు ఇంటర్వ్యూల్లో కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేశారు. దీంతో గత నెలలో ఏసీబీ కోర్టులో సీఐడీ ఒక మెమో దాఖలు చేసింది. లోకేష్‌కి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ.. ఆధారాలతో సహా పిటిషన్‌లో సీఐడీ కోరింది. దీంతో తమ ముందు హాజరై స్వయంగా హాజరైగానీ లేదంటే న్యాయవాది ద్వారాగానీ వివరణ ఇవ్వాలని కోర్టు లోకేష్‌ను ఆదేశించింది.
మెమోలో ఏముందంటే..
యువగళం ముగింపు సమయంలో లోకేష్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో.. తన తండ్రి చంద్రబాబు నాయుడిపై సీఐడీ తప్పుడు కేసులు బనాయించిందని, రిమాండ్ విధించడం తప్పంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థను కించపరిచేలా ఉన్నాయని.. ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాల్ని తప్పుబట్టేలా ఉన్నాయని.. అన్నింటికి మించి కోర్టు ఆదేశాల్ని ధిక్కరించేలా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ మెమోలో సీఐడీ పేర్కొంది.
ఆ వాంగ్మూలాలు తప్పేనంటూ..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్‌రోడ్ కుంభకోణం, ఫైబర్ నెట్ స్కామ్.. తదితర కేసులలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారు. అయితే.. ఆ సమయంలో తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని టీడీపీ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాలను నారా లోకేష్ తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు.
‘‘అసలు అధికారులు 164 సీఆర్‌పీసీ క్రింద వాంగ్మూలం ఎలా ఇస్తారు? వాళ్ల పేర్లు రెడ్ బుక్ లో పేర్లు రికార్డు చేశా. మా ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తా’ అంటూ లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు. ఇది సాక్ష్యులను బెదిరించి.. కేసు దర్యాప్తుని పక్కదారి పట్డించడమే అవుతుందని సీఐడీ ఏసీబీ కోర్టు పిటిషన్‌లో పేర్కొంది. అంతేకాదు.. గతంలో లోకేష్‌కి జారీ చేసిన 41ఏ నోటీసులలో పేర్కొన్న షరతులకీ విరుద్ధంగా ఆయన మాట్లాడారని పేర్కొంది.
లోకేష్‌పై కోర్టు సీరియస్
రెడ్ బుక్ బెదిరింపుల వ్యవహారంలో కేసులో.. నారా లోకేష్‌కు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులును లోకేష్ తొలుత స్వీకరించలేదు. ఈ పరిణామంలో లోకేష్ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్టర్ పోస్టులో పంపాలని సీఐడీని ఆదేశించింది. దీంతో చేసేది లేక రిజిస్టర్ పోస్టులో సీఐడీ, లోకేష్‌కు నోటీసులు పంపింది.
Comments
Please login to add a commentAdd a comment