వివాహ చట్టంతో సమన్యాయం | Justice Done With Marriage Act | Sakshi
Sakshi News home page

వివాహ చట్టంతో సమన్యాయం

Published Wed, Jun 19 2019 2:21 PM | Last Updated on Wed, Jun 19 2019 2:26 PM

Justice Done With Marriage Act - Sakshi

మాట్లాడుతున్న డీడబ్ల్యూఓ శంకరాచారి

సాక్షి, మహబూబ్‌నగర్‌ : వివాహాల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసుకోవాలని జిల్లా లీగర్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి చంద్రశేఖర్‌  అన్నారు. వివాహ నమోదు చట్టం–2002పై ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. మహిళా, శిశు, దివ్యాంగులు,  వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో డీడబ్ల్యూఓ జి.శంకరాచారి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు.

జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటి కార్యదర్శి చంద్రశేఖర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేవాలయాలు, ప్రార్థన మందిరాలలో జరిగిన వివాహాలకు సంబంధించి వారు జారీ చేసిన వివాహ ధ్రువీకరణ పత్రాలు రిజిస్టేషన్‌ నిమిత్తం సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ చట్టం ద్వారా ఎవరు ఎవరిని మోసం చేసేందుకు అవకాశం లేకుండా ఉంటుందన్నారు. అమ్మాయికీ, అబ్బాయికి రెండో వివాహం చేసుకునేటప్పుడు మొదటి వివాహానికి సంబంధించి విడాకులు తీసుకున్నారా లేదా అన్న వివరాలు తెలుసుకునేందుకు వీలుకలుగుతుందని అన్నారు. ఎవరైనా మొదటి వివాహానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేకుండా రెండో వివాహం చేసుకుంటే ఈ చట్టం ద్వారా చర్య తీసుకోవచ్చని చెప్పారు.   

30రోజుల్లోపు రిజిష్ట్రేషన్‌ చేసుకోవాలి 
డీడబ్ల్యూఓ శంకరాచారి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు రిజిస్ట్రేషన్‌ అధికారులుగా ఉంటారని వివాహ తేదీనుంచి 30 రోజులలోపు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని తెలిపారు. వరుడి, వధువులకు సంబంధించిన పూర్తి సమాచారం నమోదు చేయాల్సి ఉంటుందని అన్నారు. వివాహ చట్టం గురించి పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, వివాహం రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే ప్రభుత్వం చేపట్టిన పథకాలు పొందుటకు అవకాశం కలుగుతుందని అన్నారు.  

మహిళలకు భదత్ర 
ఈ చట్టం ద్వారా మహిళలకు వ్యక్తిగత భద్రత లభిస్తుందని, బహుభార్యత్వాన్ని నిలువరించడానికి, విడాకులు పొందకుండా రెండో వివాహం చేసుకునేందుకు, ఎవరిని మోసగించుటకు అవకాశం లేకుండా ఉంటుందని అన్నారు. మహిళా శక్తి కేంద్రం కోఆర్డినేటర్‌ అరుణ మాట్లాడుతూ వివాహం రిజిస్ట్రేషన్‌ చేయించునేటప్పుడు నిర్లక్ష్య ధోరణితో, ఉద్దేశ పూర్వకంగా, మోసపూరితంగా తప్పుడు సమాచారం అందిస్తే వారికి రూ.వెయ్యి జరిమానా, ఏడాది జైలుశిక్ష ఉంటుందని తెలిపారు. వివాహ రిజిస్ట్రేషన్‌ నిమిత్తం దరఖాస్తు వచ్చిన తర్వాత అధికారులు నిర్లక్ష్యం వహిస్తే రూ.వెయ్యి జరిమానా, మూడు నెలల జైలుశిక్ష ఉంటుందని సూచించారు. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన దరఖాస్తులపై పంచాయతీ కార్యదర్శులు వారి స్థాయిలో ప్రాథమిక విచారణ జరిపించాలని అన్నారు. 

పథకాలు పొందే అవకాశం   
వివాహ రిజిస్ట్రేషన్‌ చట్టంపై వివిధ మత పెద్దలు మాట్లాడారు. ఈ చట్టం ద్వారా పేదలకు ప్రభుత్వం అందించే అన్ని పథకాలు పొందే అవకాశం ఉం టుందని, విదేశాలకు వెళ్లేందుకు జారీ చేసే పాస్‌పోర్టు పొందేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటుందని తెలిపారు. ఈ సదస్సులో మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌తో పాటు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, సీడీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement