
సీటీఆర్‌ఐ (తూర్పు గోదావరి): జనసేన పార్టీలో మహిళలకు రక్షణలేదని.. ఇక్కడ మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నా పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ పట్టించుకోవటంలేదని పార్టీ వీర మహిళా విభాగం సభ్యురాలు సునీత బోయ ఆరోపించింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడింది. జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సినీ నిర్మాత ఉదయ శ్రీనివాస్ అలియాస్ బన్నీ వాసు 2019 ఎన్నికల సమయంలో రాజమహేంద్రవరం వచ్చినప్పుడు తనకు పరిచయం అయ్యాడని చెప్పింది.
జూనియర్ ఆర్టిస్టుగా చేస్తున్నానని తాను చెప్పడంతో సినిమాల్లో అవకాశమిస్తానని నమ్మబలికాడని తెలిపింది. జనసేనలో తాను క్రియాశీలకంగా ఉండటంతో వీర మహిళ విభాగంలో పనిచేయాలని చెప్పాడని సునీత వెల్లడించింది. నిజానికి, తాను సొంత డబ్బుతో పవన్‌కళ్యాణ్ కోసం పనిచేశానని.. ఎన్నికల సమయంలో బన్నీ వాసు రాజమహేంద్రవరంలో ఆయన వెంట తిప్పుకుని లైంగికంగా లోబరుచుకున్నాడని, డ్రగ్స్ ఎక్కించి పిచ్చిదాన్ని చేయాలని చూశారని ఆరోపించింది.
మూడేళ్లుగా ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నా తనని మానసిక రోగిగా చిత్రీకరించి తనపై కేసులు పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ దృష్టికి కూడా తీసుకెళ్లానని సునీత తెలిపింది. పార్టీలో వీర మహిళ విభాగంలో పనిచేస్తున్న తనకే రక్షణ కల్పించలేని పవన్‌కళ్యాణ్ రాష్ట్రంలోని మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించింది. రెండ్రోజుల్లో పవన్ స్పందించకపోతే న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment