మహిళల రక్షణ కోసమే బహుభార్యత్వం!!
బహు భార్యత్వం చాలా అవసరమట.. దాని వల్ల మహిళలకు రక్షణ ఉంటుందట! ఒకరికి ముగ్గురు నలుగురు భార్యలు ఉంటే, సమాజంలో అక్రమ సంబంధాలు తగ్గిపోతాయని, దానివల్ల మహిళలకు రక్షణ కూడా లభిస్తుందని అంటున్నారు. తలాక్.. తలాక్.. తలాక్.. అని చెప్పేసి విడాకులు తీసుకునే పద్ధతిపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో బహు భార్యత్వాన్ని సమర్థించుకుంటూ ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ వాదనలు చేసింది.
ముస్లిం మహిళల విడాకుల విషయమై జరుగుతున్న వాదనలకు సంబంధించి ముస్లిం పర్సనల్ లాబోర్డు 68 పేజీల అఫిడవిట్ దాఖలుచేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో, ఇక కలిసి ఉండలేమని అనుకున్నప్పుడు జంటలకు సులభంగా విడాకులు ఇప్పించేందుకే తలాక్.. తలాక్.. తలాక్ పద్ధతిని ప్రవేశపెట్టారని బోర్డు వాదించింది. భార్యతో కలిసి ఉండకూడదని భర్త నిర్ణయించుకున్న తర్వాత.. బలవంతంగా ఇద్దరినీ కలిపి ఉంచడం కష్టమని, దానివల్ల అనవసరంగా ఆ మహిళ చిత్రహింసల పాలు కావల్సి వస్తుందని.. అలా ఉండకూడదనే విడాకులు ఇప్పిస్తున్నామని లాబోర్డు తమ వాదనలో తెలిపింది. పైగా దానివల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు వీధికి, కోర్టుకు ఎక్కకుండానే విడాకులు సాధ్యమవుతాయని వాదించింది. కోర్టులో వాదనలు దీర్ఘకాలం పాటు సాగడం, దానివల్ల ఇద్దరికీ భారీ మొత్తంలో ఖర్చులు కావడం.. ఇవన్నీ ఎందుకొచ్చిన తిప్పలని అడిగింది. పాశ్చాత్యదేశాల్లో కోర్టుల ద్వారా మాత్రమే విడాకులు ఇస్తారని, అయినా అక్కడ విడాకుల రేటు చాలా ఎక్కువని లాబోర్డు తెలిపింది.