ఓ కన్నేసి ఉంచండి..  | Special Story On Womens Security And Cybercrime | Sakshi
Sakshi News home page

ఓ కన్నేసి ఉంచండి.. 

Published Thu, Aug 27 2020 9:02 AM | Last Updated on Thu, Aug 27 2020 9:02 AM

Special Story On Womens Security And Cybercrime - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మనిషి జీవితంలో స్మార్ట్‌ ఫోన్‌ భాగమైంది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఫోన్‌ లేనిదే క్షణం కూడా గడవలేని పరిస్థితికి వచ్చేశాడు. ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. విస్తృతమవుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాలు, ఆన్‌లైన్‌ షాపింగ్, వివాహ సంబంధాలు పేరిట, సోషల్‌ మీడియాలో పరిచయాలు పెంచుకుని మోసాలు, మహిళల గౌరవానికి భంగం కలిగేలా పోస్టింగ్‌లు, మొబైల్‌ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్‌ కార్డు పాస్‌వర్డ్‌లను హ్యాక్‌ చేయడం, ఓఎల్‌ఎక్స్‌ పేరిట మోసాలు, వీడియో గేమ్‌ల పేరిట వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్‌ చేయడం, ఆన్‌లైన్‌ లావాదేవీలు, లక్కీ డ్రాలు, లాటరీలు ఇలా.. ఎన్నో మోసాలకు సైబర్‌ నేరగాళ్లు తెగబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ‘ఈ–రక్షాబంధన్‌’ పేరుతో నిర్వహిస్తున్న వెబ్‌నార్‌ తరగతులు, అవగాహన సదస్సులకు అనూహ్య స్పందన వస్తోంది.  

‘ఈ–రక్షాబంధన్‌’కు మంచి స్పందన
సైబర్‌ నేరాలు పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ.. వాటిని అధిగమించాలంటే మహిళల్లో అవగాహన అవసరమని రాఖీ పౌర్ణమి రోజున ‘ఈ–రక్షాబంధన్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 3వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమం ప్రారంభించారు. అప్పటి నుంచి జిల్లాలోని మహిళలు, విద్యార్థినులు, మహిళా కో–ఆర్డినేటర్లు, మహిళామిత్రలు, పోలీస్‌ అధికారులకు పోలీసుశాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా వెబ్‌నార్‌ తరగతులు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. నేరుగా పోర్టల్‌లో లాగిన్‌ అయ్యేలా ఆయా పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. సైబర్‌ నేరాల నుంచి మహిళలు, బాలలకు రక్షణ  కల్పించేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా.. ఆయా వర్గాల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ నెలాఖరు వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.  

సైబర్‌ మోసాలెన్నో...  
విశాఖ నగరంలో రోజురోజుకూ సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా కేంద్రాలుగా విశాఖ నగరవాసులపై సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌లో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. గతంలో హనీట్రాప్‌ పేరుతో బెంగళూరు కేంద్రంగా కొందరు సైబర్‌ నేరగాళ్లు పలు వెబ్‌సైట్లు, యాప్‌లలో అందమైన యువతుల ఫొటోలు పెట్టి ఆకర్షించారు. అమ్మాయిలతో ఫోన్‌ ట్రాప్‌ చేయించి ముగ్గులోకి దించి నగదు దోపిడీకి పాల్పడ్డారు. ఈ ముఠాను సైబర్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నగరంలోని ఓ ప్రాంతంలో ఏటీఎంలో చోరీ జరిగిందని ఓ బ్యాంక్‌ మేనేజర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన క్రైం పోలీసులు.. ఢిల్లీ కేంద్రంగా ఏటీఎంలలో కొత్త తరహాలో దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరిని రెండు రోజుల కిందట అరెస్ట్‌ చేశారు. ఆన్‌లైన్‌ పెళ్లి సంబంధాల వెబ్‌సైట్‌ల్లో పలువురు మోసగాళ్లు నకిలీ ఫ్రొఫైల్, ఫొటోలు, వివరాలతో ఎన్నారై సంబంధాల పేరిట చేస్తున్న మోసాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. పెళ్లి సంబంధాల ముసుగులో పరిచయం చేసుకుని చాటింగ్‌ చేస్తూ..బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. సోషల్‌మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడం, మార్ఫింగ్‌ చేయడం తదితర ఘటనలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. లింక్‌లు పంపించి గుర్తింపు దొంగతనం, ఆన్‌లైన్‌లో ఉద్యోగాలంటూ మనీ ట్రాన్స్‌ఫర్‌ మోసాలు, బ్యాంక్‌ల పేరిట నకిలీ వెబ్‌సైట్లతో మోసాలు ఇలా అడుగడుగునా సైబర్‌ నేరగాళ్లు మనల్ని ఉచ్చులోకి దింపి.. మోసాలకు పాల్పడుతున్న ఘటనలు రోజూ వెలుగులోకి వస్తున్నాయి.  

‘వర్చువల్‌ సైబర్‌ సెక్యూరిటీ హ్యాకథాన్‌’పై వెబ్‌నార్‌ నేడు 
పెదవాల్తేరు(విశాఖతూర్పు): సైబర్‌ నేరాలకు పాల్పడే నిందితులకు భారతీయ శిక్షాస్మృతి ప్రకారం కఠిన శిక్షలు విధిస్తున్నారని సైబర్‌ నిపుణులు హెచ్చరించారు. ఈ–రక్షాబంధన్‌ కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఐడీ, సైబర్‌పీస్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ‘సైబర్‌ నేరాలు–శిక్షలు’ అంశంపై జరిగిన వెబ్‌నార్‌లో వారు మాట్లాడారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ సాంకేతిక నేరాలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్‌ యుగంలో సోషల్‌ మీడియా వినియోగదారులు, మహిళలు, టీనేజర్లు, నిరుద్యోగులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లా ప్రజలు ఫేస్‌బుక్, యూట్యూబ్‌ చానల్‌ ద్వారా వెబ్‌నార్‌ను వీక్షించారు. కాగా.. ఈ సిరీస్‌లోభాగంగా గురువారం ఉదయం 11 గంటలకు ‘వర్చువల్‌ సైబర్‌ సెక్యూరిటీ హ్యాకథాన్‌’అంశంపై జరిగే వెబ్‌నార్‌ను జిల్లా ప్రజలు వీక్షించాలని ఎస్పీ బి.కృష్ణారావు కోరారు.  

నిపుణుల సూచనలివీ..  
 ఇంటర్నెట్‌లో బ్రౌజ్‌ చేసేటప్పుడు.. హెచ్‌టీటీపీఎస్‌లతో ప్రారంభమయ్యే వెబ్‌సైట్‌లు సురక్షితం. 
సినిమాలు, వీడియోలు, ఆడియోలు డౌన్‌లోడ్‌ చేసేటప్పుడు లైసెన్స్‌ ఉన్న అధీకృత యాప్‌లను ఉపయోగించడం మంచిది.  
నీలి చిత్రాలు, అవాంఛిత వెబ్‌సైట్‌ల జోలికి వెళ్లకపోవడమే మంచిది.  
 సైబర్‌ బుల్లియింగ్‌ జోలికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి.  
 మైనర్లు స్మార్ట్‌ఫోన్‌లు చూసేటప్పుడు.. తల్లిదండ్రులు పరిశీలిస్తుండాలి.. 
 టెక్నాలజీ పరిమితంగా వాడితే ఉపయోగం.. అతిగా వాడితే అనర్థం 
 మితిమీరిన ఇంటర్నెట్‌ వినియోగంతో మానసిక, శారీరక రుగ్మతలతో పాటు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడే అవకాశం ఉంటుంది.  
డిజిటల్‌ ప్రపంచంలో టెక్నాలజీ వ్యసనంగా మారకూడదు.  
 ఏదైనా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు ప్రైవసీ పాలసీని కచ్చితంగా చదవాలి.  
 యువతులు, మహిళలు ఆన్‌లైన్‌ మాధ్యమాల్లో వీలైనంత మేరకు వ్యక్తిగత గోప్యత పాటించాలి.  
 సోషల్‌ మీడియాలో అపరిచితులతో ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్‌ సరికాదు. 
 ఓ ఎల్‌ఎక్స్‌ వెబ్‌సైట్లలో నకిలీ అడ్రస్‌లుంటాయి. వాటిని గుర్తించాలి.  
ఆన్‌లైన్‌లో బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరం. అసభ్యకరమైన, మహిళలను అగౌరవపరిచేలా, భంగం కలిగించేలా  పోస్ట్‌లు పెట్టకూడదు.  

పిల్లలపై పర్యవేక్షణ తప్పనిసరి 
రోజు రోజుకూ సాంకేతిక వినియోగం అధికమవుతున్న వేళ.. సాంకేతిక పరిజ్ఞానంపై అందరూ అవగాహన కలిగి ఉండాలి. పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు ఇచ్చినా.. వారిపై నిఘా ఉంచాలి. ఎంత బిజీగా ఉన్నా.. రోజులో ఏదో సమయంలో పిల్లలు స్మార్ట్‌ఫోన్‌/ ట్యాబ్‌లో చేస్తున్న కార్యకలాపాలను పర్యవేక్షించడం ముఖ్యం.
 –ఎల్‌.కె.వి.రంగారావు, డీఐజీ, విశాఖ రేంజ్‌

నిర్భయంగా ఫిర్యాదు చేయండి 
సైబర్‌ నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో ఈ–రక్షాబంధన్‌ పోర్టల్‌ను ప్రతి ఒక్కరూ వీక్షించాలి. సైబర్‌ నిపుణులు ఇచ్చే జాగ్రత్తలు పాటిస్తూ.. అవగాహన తరగుతులకు హాజరైన ప్రతి మహిళా.. తమ పరిధిలోని మిగతా వారికి వివరించాలి. ఎవరైనా మహిళలు సైబర్‌ నేరగాళ్ల బారిన పడితే.. వారికి పోలీస్‌ శాఖ అండగా ఉంటుంది. టోల్‌ఫ్రీ నంబర్‌ 112కు కాల్‌ చేసినా/ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసినా మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. నిర్భయంగా ఫిర్యాదు చేయండి. 
 – బొడ్డేటి కృష్ణారావు, ఎస్పీ

సైబర్‌ నేరాలపై జాగ్రత్తలు అవసరం 
స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఉపయోగించాలో తెలియక.. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడిపోతు న్నారు. ఇందులో యువత ఎక్కువగా బలైపోతున్నారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులను చూస్తున్నాం. నర్సీపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అవగాహన తరగతులకు హాజరయ్యాను. సైబర్‌ నేరాలపై అవగాహన వచ్చింది. సచివాలయ పరిధిలో ఉన్న మహిళలు, యువతకు ఈ–రక్షాబంధన్‌ పోర్టల్‌లో లాగిన్‌ అయ్యేలా, ఆన్‌లైన్‌ క్లాస్‌లు వినేలా చర్యలు తీసుకుంటాను.  
–పాలెపు అన్నపూర్ణ కామేశ్వరి, సచివాలయ మహిళా పోలీస్, నర్సీపట్నం

ఇక నుంచి అప్రమత్తంగా ఉంటాం 
సైబర్‌ నేరాల ఎలా జరుగుతున్నాయి.. ఎలా మోసపోతున్నామో తెలిసింది. నాతో పాటు మా వార్డులో ఉన్న మహిళలు, యువతకు వివరించడమే కాకుండా.. ఈ–రక్షాబంధన్‌ పోర్టల్‌లో లాగిన్‌ అవుతాం. ఆన్‌లైన్‌లో సైబర్‌ నేరాలు నుంచి రక్షణ పొందుతాం. 
–వై.మణి, శారదానగర్, వార్డు వలంటీర్‌ 

మహిళా సంబంధిత మోసాలపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 112

వాట్సాప్‌ నంబర్‌ 90716 66667  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement