ఒకరికి ఒకరు తోడు నీడగా జీవిస్తున్న ఆదర్శదంపతులు.. | Special Story Ideal Couples Living Shadows Each Other | Sakshi
Sakshi News home page

ఒకరికి ఒకరు తోడు నీడగా జీవిస్తున్న ఆదర్శదంపతులు..

Published Wed, Jan 26 2022 1:57 PM | Last Updated on Wed, Jan 26 2022 2:10 PM

Special Story Ideal Couples Living Shadows Each Other - Sakshi

నీవు లేక సృష్టిలో మానవ ప్రపంచం వికసించి వర్థిల్లడానికి మూలం దాంపత్యం. ఆలుమగల పవిత్ర బంధమే దాంపత్యం. వివాహంతో ప్రారంభమయ్యే దాంపత్యం జీవిత పరిసమాప్తి వరకు తోడూనీడగా కొనసాగుతుంది. సంతాన ఫలాలను పండిస్తుంది. సహజీవన సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. అనురాగాల తేనెలను చిందిస్తుంది. కష్టసుఖాల్లో ఒకరికొకరి అండతో ఎన్నో అనుభూతులను పలికిస్తుంది. మనో గృహ ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులను అలికిస్తుంది. అందుకే దాంపత్యం మానవ జీవితానికి ఒక అమూల్య వరం. అర్థం చేసుకుని జీవిస్తే కష్టాలు..కన్నీళ్లైనా కరిగిపోతాయి. ఇలా ఒకరికి ఒకరు తోడు నీడగా జీవిస్తున్న ఆదర్శదంపతులపై ఈ ప్రత్యేక కథనం..

చీడికాడ(విశాఖపట్నం): ఓర్పే దాంపత్య జీవన గమనానికి పునాదని వృద్ధ దంపతులు బలిరిశెట్టి నారాయణరావు, జయలక్ష్మి దంపతులు చాటి చెబుతున్నారు. నేటి సమాజంలో భార్యాభర్తలు చిన్ని చిన్న వాటికే ఇగోలకు పోయి కాపురాలు నాశనం చేసుకుంటూ ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఆస్తులు లేకపోయినా కన్నవారు  అండగా నిలవక పోయినా ఒకరికి ఒకరు తోడుంటే అడవైనా.. ఆశ్రమమైనా స్వర్గమేనని ఈ దంపతులను చూస్తే అర్థమవుతోంది. 

మాడుగులకు చెందిన బలిరిశెట్టి నారాయణరావు, జయలక్ష్మీలకు 1970లో వివాహమైంది. నారాయణరావు ఎస్‌ఎస్‌ఎల్‌సి వరకు, జయలక్ష్మి 7వ తరగతి చదువుకున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. నారాయణరావు కిరాణాదుకాణంలో రూ.100 జీతానికి గుమాస్తాగా పనిచేస్తూ తల్లితండ్రులు, తమ్ముడు, భార్యాపిల్లలను పోషించేవాడు. ఆదాయం సరిపోకపోవడంతో 40 ఏళ్ల క్రితం విశాఖకు వలస వెళ్లి అద్దింట్లో కాపురం పెట్టారు.

అక్కడ నారాయణరావు మరో కిరాణాదుకాణంలో రూ.200 కు గుమాస్తాగా చేరగా జయలక్ష్మి కాలనీలో చిన్నపిల్లలకు ప్రైవేట్లు చెబుతూ రూ.100 సంపాదించేది. ఈ డబ్బుతోనే ఇంటి అద్దె, పిల్లల చదువులు, తల్లిదండ్రుల పోషణకు భారంగా మారేది. ఖర్చులు ఎక్కువ ఆదాయం తక్కువైనా భార్యాభర్తలిద్దరూ పస్తులుండైనా కుటుంబ అవ సరాలు తీర్చుతూ ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశారు. అయితే భార్యభర్తలిద్దరూ ఏనాడు తమ సంపాదనపై కించపరచకోలేదు. ఉన్నదాంట్లోనే సంతోషం వెతుకున్నారు.  

ఇదిలా ఉంటే ఇటీవల జయలక్ష్మి అనారోగ్యానికి గురైంది. జయలక్ష్మిని రమ్మని  పిల్లలు కోరినా భారం కాకూడదని దంపతులిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేక అప్పలరాజుపురంలోని లలితాదేవి వృద్ధాశ్రమంలో చేరారు. నారాయణరావుకు చెవులు వినిపించవు, అయినా ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ దాంపత్య జీవనానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

ఎవర్నీ ఇబ్బంది పెట్టకూడదనుకున్నాం 
డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): అందరూ సంతోషంగా ఉండాలి. మా వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు. శేష జీవితం హాయిగా సాగిపోవాలి... అంటూ నగరానికి చెందిన వృద్ధ భార్యాభర్తలు ప్రేమసమాజంలో ఆనందంగా గడుపుతున్నారు. కోరకాన లక్ష్మణరావు, భార్య సుశీల భార్యాభర్తలు. వీరి దాంపత్య జీవితానికి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. లక్ష్మణరావు 1959లో బిలాస్‌ స్టీల్‌ప్లాంట్‌లో డ్రాఫ్ట్‌మన్‌గా విధుల్లో చేరారు. 1993 నవంబర్‌ 30న పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ పొందిన సరిగ్గా ఏడాదికి అంటే..1994 నవంబర్‌ 30న తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమారుడు చనిపోవడంతో కుంగిపోయారు. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతూ..మూడేళ్ల కిందట వారిద్దరూ ప్రేమసమాజంలో (పేయింగ్‌ గెస్ట్‌గా) చేరారు. ప్రస్తుతం వారు సంతోషంగా..అక్కడ ఉన్న వారితో గౌరవ ప్రదమైన శేష జీవితాన్ని గడుపుతున్నారు. 

శేష జీవితంగా హాయిగా ఉండాలని 
కష్టాలు చూశాం. సుఖాలు అనుభవించాం. మాకు కావల్సింది శేషజీవితం హాయిగా సాగిపోవాలి. అది ఇక్కడ దొరికింది. ఉదయం 5 గంటలకు నిద్ర లేస్తాం.  5.15 గంటలకు టీ ఇస్తారు. అనంతరం కాలకృత్యాలు పూర్తయిన తర్వాత కొంతసేపు యోగా అనంతరం పూజ చేసుకుంటాం. టిఫిన్‌ చేస్తాం. తర్వాత మ్యాగజైన్లు, దినపత్రికలు, పారాయణ చేసుకుంటాం. మధ్యాహ్నం 12.15కు భోజనం చేసిన తరువాత... ఒంటి గంట నుంచి 3 గంటల వరకు నిద్రిస్తాం. 3.15కు టీ ఇస్తారు. 6 గంటలకు భజన కీర్తనల్లో పాల్గొంటాం. సరిగ్గా 7  గంటలకు భోజనం పెడతారు. తర్వాత కొంత సేపు  వాకింగ్‌ చేసి నిద్రిస్తాం. పిల్లలు వస్తుంటారు. పిల్లల్ని ఎంఎస్సీ వరకు చదివించాం.  
–కోరకాన లక్ష్మణరావు, సుశీల దంపతులు  

భారం కాకూడదనే.. 
భర్త తెచ్చే సంపాదనపై ఎప్పుడు చులకనగా మాట్లాడవద్దని ఇచ్చిన దాంట్లోనే ఇల్లు చక్కదిద్దుకుని భర్తతో మంచిగా ఉండాలని నా తల్లి, అత్త చెప్పిన మాటలు ఎప్పుడూ జవదాటలేదు. ఎన్ని ఇబ్బందులెదురైనా ఇద్దరూ సర్దుకుపోయాం. వయస్సు మళ్లిన ఈ సమయంలో ఎవరికీ భారం కాకూడదని భావించే వృద్ధాశ్రమంలో చేరాం. 
–బి.జయలక్ష్మి 

ఆమె సహనానికి రుణపడి ఉంటా 
నా భార్య సహనం మరెవరికీ ఉండదు. ఆమెకు ఏమిచ్చినా తక్కువే. నేనేం చేసినా సర్దుకుపోయేది తప్ప..ప్రశ్నించేది కాదు..నేను పడుతున్న కష్టాన్ని గుర్తించిన వ్యక్తి నా అర్థాంగి. వేడినీళ్లకు చన్నీళ్లుగా కుటుంబ పోషణలో ఆమె పాత్ర నాకంటే ఎక్కువ. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేని బంధం మాది. భగవంతుడు మా ఇద్దరిని ఒకేసారి తన ఒడిలోకి చేర్చుకోవాలని కోరుకుంటున్నాం. 
– బి.నారాయణరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement