పవన్‌ కళ్యాణ్‌ దత్తపుత్రుడన్న సంగతి ప్రధాని మోదీకి తెలిసిపోయిందా?! | Yellow Media Speculative news Pawan Kalyan Meeting with PM Modi | Sakshi
Sakshi News home page

పవన్‌ కళ్యాణ్‌ దత్తపుత్రుడన్న సంగతి ప్రధాని మోదీకి తెలిసిపోయిందా?!

Published Sat, Nov 12 2022 4:03 PM | Last Updated on Sat, Nov 12 2022 4:19 PM

Yellow Media Speculative news Pawan Kalyan Meeting with PM Modi - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ రావడం, పవన్‌ కళ్యాణ్‌ను కలవడం.. ఇది ఎల్లో మీడియాకు మహాదానందం కలిగించిందన్నది వారి పత్రికల్లో అచ్చేసిన రాతలను బట్టి సగటు ఆంధ్రులందరికీ అవగాహన కలిగిన విషయం. ఎలాంటి అవకాశం రాకున్నా.. ప్రభుత్వంపై విష ప్రచారానికి తరచుగా దిగుతూ దుష్ట చతుష్టయంగా పేరు పడ్డ పచ్చ మీడియా..  విశాఖలో జరిగిన సమావేశంతో తమ ఆక్రోశాన్ని అంతా వెల్లగక్కింది. పవన్‌ కళ్యాణ్‌ కలిసినప్పుడు సహజంగానే గదిలో ప్రధాని ఒక్కరే ఉండి ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత లోన ఏం జరిగిందన్నది ప్రధాని ఎలాగు చెప్పరు కాబట్టి పవన్‌ కళ్యాణ్‌.. తనకు తెలిసిన నాలుగు ముక్కలు చెప్పి ఉంటాడు. దానికి ఎల్లో మీడియా పుంఖానుపుంఖాలుగా వ్యాఖ్యానాలు జోడించి  కథనాలు అల్లుకుంటు వెళ్లిపోయింది. 

ఆ మాటలకు అర్థాలు వేరులే
ప్రధాని రెండు మూడు సార్లు ఐ నో ఎవ్రీ థింగ్‌ (I Know Everything) అన్నట్టుగా ఎల్లో మీడియా కథనాల్లో పేర్కొన్నారు. దాంతో పాటు ఐ నో ఇట్‌ ఆల్సో (I Know it Also)  అని కూడా అన్నారని రాశారు. అంతకు మించి ప్రధాని నిజంగానే పవన్‌తో ఏం మాట్లాడినట్టు లేరు. రాసిన రెండు వ్యాక్యాలు దేని గురించి అన్న విషయంలో ఎల్లో మీడియా పూర్తి స్వేచ్ఛ తీసుకుంది. గత కొన్నాళ్లుగా రోజు అచ్చేసే వార్తలన్నింటిని జాగ్రత్తగా ఆర్‌ఆర్‌జీ నుంచి సేకరించి మరోసారి అచ్చేసి ఆ విషయాలపైనే ప్రధాని ప్రస్తావించినట్టుగా ఓ అందమైన అబద్దాన్ని అన్వయించేసింది. 

నిజానికి ప్రధాని ఏ విషయాలను ఐ నో ఎవ్రీ థింగ్‌ (I Know Everything) అన్నారు? ప్రధానికి ఇటీవల కాలంలో కొత్తగా ఏ ఏ విషయాలు తెలిసాయి? రాష్ట్ర బీజేపీ నేతలు ఏ ఏ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి ఉంటారన్నది పచ్చమీడియా ఎక్కడా పేర్కొనలేదు. నిజానికి  ప్రధాని మదిలో ఏముంది? ప్రధాని ఏ విషయాలను తెలుసు అన్నారో ఆయనే చెప్పాలి కానీ.. జన బాహుళ్యంలో ఉన్న, జనం అంతా చర్చించుకుంటున్న కొన్ని విషయాలు మాత్రం ఇవి. 

ప్రధాని చెప్పిన ఐ నో ఎవ్రీ థింగ్‌ (I Know Everything)  ఇవి ఎందుకు కాకుడదు? 
1. నిన్నటిదాకా బీజేపీతో దోస్తీ అని తిరిగి.. ఇప్పుడు చంద్రబాబుతో చేతులు కలిపావు.. అంటే పవన్‌ కళ్యాణ్‌ నిజంగా దత్తపుత్రుడన్న విషయం ప్రధానికి తెలిసిపోయిందా?
2. సొంత మామకే వెన్నుపోటు పొడిసి ముఖ్యమంత్రి సీటును లాక్కున్న చంద్రబాబు.. బీజేపీకి దగ్గర కావడానికే నలుగురు ఎంపీలను పంపిన విషయం ప్రధానికి తెలిసిందా?
3. సినిమా నటుడే అయినా రాజకీయ నాయకుడంటూ ఫోజులు కొడుతూ.. బహిరంగ సమావేశం పెట్టి చెప్పులు చూపించి రాజకీయాల హుందాతనాన్నిపవన్‌ కళ్యాణ్‌ దిగజార్చిన విషయం ప్రధానికి తెలిసిపోయిందా?
4. 2019కి ముందు పాచిపోయిన లడ్డులంటూ నానా తిట్లు తిట్టి ఇప్పుడు మళ్లీ దగ్గరవ్వాలనుకుంటోన్న అవకాశవాదం గురించి ప్రధానికి తెలిసిందా?
5. ఇప్పటం గ్రామానికి వెళ్లి విలువలను విప్పేసి బూతులు తిట్టిన సంగతి ప్రధాని గుర్తించారా? 

నిజానికి ఇవన్నీ మోదీకి తెలిసి ఉంటాయి. ఈ విషయం ఎల్లో మీడియాకు కూడా తెలిసి ఉంటుంది. అయినా అతి జాగ్రత్తగా కథనాన్ని అల్లుకుని ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో ఇలాంటి కుప్పిగంతులు మాములే కానీ ప్రధాని  నోటి వెంట వచ్చిన రెండో వ్యాక్యం ఐ నో ఇట్‌ ఆల్సో (I Know it Also)కు అర్థమేంటీ?

బహుశా.. ఇదే అయింటుంది..
పొత్తుల్లేకుండా ఇప్పటివరకు ఒక్కసారి కూడా నెగ్గని చంద్రబాబును ఎలాగైనా మళ్లీ కలుపుకుని ముందుకెళ్లాలన్న పవన్‌ కళ్యాణ్‌ ప్రయత్నం గురించి తెలిసిపోయి ఉంటుంది. 1999లో బీజేపీని అడ్డంగా వాడేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. తర్వాతర్వాత కమలనాథులను ఏం చేశాడో మోదీకి బాగానే గుర్తుంటుంది. అంతెందుకు తిరుమలకు వచ్చినప్పుడు అమిత్‌షా మీద రాళ్లేయడం, 2019 జనరల్‌ ఎలక్షన్స్‌లో బెంగాల్‌, తమిళనాడు, యూపీ, కర్ణాటక వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా కూటములు కట్టడం కూడా ప్రధాని మోదీ ఎప్పటికీ మరిచిపోలేని అంశాలు. అందుకే పవన్‌తో అన్న ఐ నో ఇట్‌ ఆల్సోకు అసలు అర్థం ఇదే కావొచ్చు.

పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement