World Sleep Day March 18th, 2022 Special Story In Telugu - Sakshi
Sakshi News home page

World Sleep Day: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్‌ విషయాలు

Published Fri, Mar 18 2022 8:53 AM | Last Updated on Fri, Mar 18 2022 10:42 AM

World Sleep Day Special Story - Sakshi

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): జో అచ్యుతానంద జోజో ముకుందా ! లాలి పరమానంద లాలి గోవిందా జోజో జో అచ్యుతానంద జోజో ముకుందా ! లాలి పరమానంద లాలి గోవిందా జోజో అనగానే పిల్లలు నిద్రలో జారుకునేవాళ్లు... ఇప్పడు ఏ జోల పాట పనిచేయడం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు నిద్ర సమస్యతో బాధపడుతున్నారు. పిల్లలు సైతం రాత్రి 11 గంటల వరకూ మేల్కొనే ఉంటున్నారు. స్కూల్‌లో హోంవర్కులు, టాస్క్‌లతో మేల్కోనే ఉంటున్నారు. ఇక యువత..పెద్దవాళ్లు సైతం నిద్రలేమితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.  అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. అందుకే వరల్డ్‌ స్లీప్‌ సొసైటీ హాయిగా పడుకోవాలని.. సకాలంలో నిద్రించాలని కోరుతోంది.

చదవండి: Holy 2022: హోలీ మరకలు త్వరగా పోవాలంటే..  

నిద్ర..మనిషికి..ఎంతో అవసరం..ప్రస్తుతం ఉరుకులు..పరుగుల మధ్య కనీసం కొద్దిసేపైనా నిద్రపోయే వారు చాలా తక్కువగా ఉంటున్నారు..ఒకప్పుడు రాత్రి 8 గంటలకు పడుకొని ఉదయం 6 గంటలకు మధ్య లేచేవాళ్లు. ఇప్పుడు అంతా ఉల్టా..పల్టా..ఉదయం 3–4 గంటలకు పడుకొంటున్నారు. ఉదయం 10-11 గంటలకు నిద్ర లేస్తున్నారు. మొబైల్, టీవీ చూడడం, వర్క్‌ చేయడమో..లాంటి ఇతరత్రా పనులు చేస్తూ రాత్రి పూట ఎక్కువ సేపు మెళకువతో ఉంటున్నారు. ఇలా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు ఎద్కుకోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. సరిపడే నిద్రం చేయటం వలన కలిగే లాభాలు, నిద్రలేమి కారణంగా కలిగి నష్టాలను ప్రజలకు తెలియజేసేందుకు వరల్డ్‌ స్లీప్‌ సొసైటీ ఆధ్వర్యంలో  ఏటా  ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని మార్చినెల మూడో శుక్రవారం నిర్వహిస్తున్నారు.

నిద్ర లేని వారిలో...  
కంటినిండా నిద్ర ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. రోజులో 24 గంటలు..అందులో సుమారు 7 నుంచి 8 గంటల పాట నిద్రకు కేటాయించాలని అంటుంటారు. 8 గంటల నిద్ర సరిగ్గా లేకపోతే..16 గంటల మెలకువ సమయం అంతా డిస్ట్రట్‌ అవుతుంది. రోజు వారీ పనులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కానీ..చాలా మందికి కరెక్టు టైంకు నిద్ర రాదు..మారుతున్న జీవన విధానాలు...అలవాట్లు ప్రభావం చూపెడుతున్నాయి.. శరీర జీవ గడియారం దెబ్బతింటోంది.

రాత్రి వేళ వర్క్‌ చేయటం పొద్దునే పడుకోవడం చేస్తున్నారు. నిద్ర సరిగ్గా లేకపోతే..మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపెడుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. రక్తప్రసరణ విషయంలో మార్పులు చోటు చేసుకుంటాయంటున్నారు. దీని ఫలితంగా..గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. అంతేగాకుండా సరిగ్గా నిద్రపోని వారు బరువు పెరగడం ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని వెల్లడిస్తున్నారు. నిద్ర లేకపోవడంతో ఒత్తిడి ఎక్కువ కావడం నిరాశలో మునిగిపోతుంటారని తెలిపారు.. అందువలన నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నా వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని అంచనా.

మంచి నిద్ర వల్లే కలిగే లాభాలు 
మంచి నిద్ర నిరాశ..ఒత్తిడి నుంచి దూరం చేస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. గుండెకు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పనిపై దృష్టి పెట్టడానికి దోహద పడుతుంది. అంతేగాకుండా జ్ఞాపకశక్తి మెరుగుపరచడంలో నిద్ర పాత్ర కీలకం. సరైన నిద్ర అనేద మనసుపై మొదడుపై కలిగే ఒత్తిడిని తగ్గించడమే కాకుండా..ఆరోగ్యానికి  సహకరిస్తుంది..దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

నిద్ర కోసం షెడ్యూల్‌ 
మంచి నిద్ర కోసం ఒక షెడ్యూల్‌ను రూపొందిందించుకోండి. ఫలానా టైంలో నిద్ర పోవాలని నిర్ణయం తీసుకోండి. నిద్ర పోయే ముందు టీవీ, సెల్‌ఫోన్లకు దూరంగా ఉండండి..బెడ్‌ రూం సరైన టెంపరేచర్‌లో ఉండే విధంగా చూసుకోవాలి. నిశ్శబ్దంగా..మనస్సు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. కెఫిన్, అల్కాహాల్‌ ఇతరత్రా వ్యసనాలకు దూరంగా ఉండాలి..నిద్ర సమస్యలు ఉంటే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

ఒత్తిడితో నిద్ర సమస్యలు.. 
నిద్ర సమస్యకు ప్రాధాన కారణం ఒత్తిడి. మనిషి ఒత్తిడికి గురైనప్పుడు నిద్ర సమస్య ఎక్కువవుతోంది. ఈ ఒత్తిడి నుంచి దూరంగా ఉండేందుకు యోగా లాంటివి చేస్తుండాలి. నిద్రలు రెండు రకాలుగా చెప్పవచ్చు ఒకటి రాపిడ్‌ ఐ మూమెంట్, రెండోది నాన్‌ రాపిడ్‌ ఐ మూమెంట్‌. రాపిడ్‌ ఐ మూమెంట్‌ నిద్ర అనేది నిద్రలో మొదటి దశగా చెప్పవచ్చు. నాన్‌ రాపిడ్‌ ఐ మూమెంట్‌ అంటే మంచి నిద్రగా చెప్పవచ్చు. నాన్‌ రాపిడ్‌ ఐ మూమెంట్‌ నిద్ర ఎక్కువ సమయం చేస్తే వారు ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే సాయంత్రం 4 గంటల తరువాత నిద్ర పోకూడదు.

టీ, కాఫీలు వంటి వాటిని సేవించకూడదు. రాత్రి సమయంలో ఆహారం తక్కువగా తీసుకోవాలి. ప్రోటిన్లు ఎక్కువగా ఉండే పాలు, పండ్లు తీసుకుంటే మంచిది. ఒక రాత్రి నిద్ర లేకపోతే మద్యం సేవించిన వ్యక్తితో సమానం. అందుకే రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా మద్యం సేవించటం లేదా నిద్ర లేకపోవటం వలనే జరుగుతాయి. మంచి నిద్ర చేసేందుకు రాత్రి సమయంలో వెలుతురు తక్కువగా ఉండే లైట్స్‌ వేసుకోవడం..మొబైల్స్‌కు దూరంగా ఉండటం..బెడ్‌ శుభ్రం ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.     –డాక్టర్‌ పి.విజయ్‌ కుమార్, జనరల్‌ మెడిసిన్‌

నిద్రతో ఉత్సాహం.. 
రోజు 7 నుంచి 8 గంటల సమయం నిద్ర పోవడం వల్ల మిగిలిన సమయంలో ఎంతో ఉత్సాహంగా ఉండొచ్చు. ఎటువంటి చిరాకు, అలసట దరికి చేరవు. నిద్ర లేకపోతే ప్రతి చిన్న విషయానికి కూడా ఎదుటి వారిపై చిరాకు పడడం, ఒత్తిడికి గురవడం జరుగుతుంది.  
–రమ్య, ఉద్యోగిని 

సమయానికి నిద్రపోవాలి 
రాత్రి త్వరగా నిద్రపోవడం వల్ల ఉదయం పని చేసేటప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క రోజు నిద్ర సరిగ్గా లేకపోతే మరుసటి రోజు పని మొత్తం ఏదో గందరగోళంగా ఉన్నట్టు ఉంటుంది. పనిపై ధ్యాస ఉండాలంటే మంచి నిద్ర ఎంతో అవసరం. రాత్రి సమయంలో అవసరం మేరకు మాత్రమే మొబైల్స్‌ను ఉపయోగించాలి. 
–సాయి మీర, ఉద్యోగిని 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement