కుటుంబం, పిల్లలు, భర్త అంటూ చాలామంది మహిళలు తమ శారీరక ఆరోగ్యాన్నిఅస్సలు పట్టించుకోరు. భర్త పిల్లలకు పెట్టి, మిగిలింది తిని కడుపునింపుకునే శ్రామిక మహిళలు చాలా మందే ఉన్నారు. భారతీయ మహిళలు, యువతులు పోహకాహారం లోపంతో బాధపడు తున్నారు. రోజంతా ఉత్సాహంగా ఉండాలన్నా, కుటుంబానికి సేవ చేయాలన్నా శరీరానికి సమతులాహారం అందాలంటారు పోషకాహార నిపుణులు.
క్రమం తప్పని వ్యాయామం
ఇంటి పనిచేస్తున్నాంకదా అని శారీరక వ్యాయామాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాయామం చేయడం శారీరక బలాన్ని కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది.
అలాగే పనిలోపని బ్రేక్ ఫాస్ట్‌ను అస్సలు పట్టించుకోరు.
ఆహారం పట్ల నిర్లక్ష్యం
ఉదయం లేచింది మొదలు.. పడుకునేదాకా, ఏం టిఫిన్ చేయాలి. ఏం కూరలు ఉండాలి. ఎలాంటివెరైటీ ఫుడ్‌ను అందించాలి అంటూ తపన పడే చాలామంది అమ్మలు తమ అలవాట్లను, అభిరుచులను మర్చిపోతారు. పనిలో పడి అస్సలు దేన్నీ పట్టించుకోరు. కానీ ఉదయం అల్పాహారం చాలా ముఖ్యం.
కార్బ్స్ ఎక్కువ కాకుండా, ఫైబర్ ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడండి. తద్వారా ప్రసవం తరువాత లావు కాకుండా ఉంటారు. అందుకే కేలరీలు అందేలా చూసుకోవాలి. నూనెలేని ఇడ్లీ, దోశలు, మిల్లెట్స్‌తో చేసిన వాటిని తీసుకోండి. లేదంటే ఉడకబెట్టిన గుడ్లు, పాలు, మొలకెత్తిన గింజలు, నట్స్, వెజిటబుల్ సలాడ్ కొద్దిగా నిమ్మరసం వేసుకొని తినండి.
కింగ్ లాంటి లంచ్
కింగ్ లాంటి భర్తే కాదు, అంతకంటే కింగ్ లాంటి లంచ్ అవసరం. మధ్యాహ్నంహ భోజనం ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. అన్నం లేదా చపాతీతోపాటు ఆకుకూరలు, కాయగూరలు, బఠాణీలూ, బీన్స్, పుట్టగొడుగులూ, పప్పు ధాన్యాలూ గుడ్లూ, చేపలూ, చికెన్ ఇలా మీకిష్టమైనదాన్ని ఎంచుకోండి. అలాగే రోజూ ఒకేలా రొటీన్‌లా కాకుండా, మంచి పోషకాలుండేలా చూసుకోండి.
స్నాక్స్
రోజంతా పనిచేసిన తరువాత సాయంత్రం ఏదైనా తినాలనిపిస్తుంది. మరోవైపు పిల్లలు స్కూలునుంచి ఇంటికి వచ్చే సమయం. మరి వారి అల్లరిని భరించాలన్నా, ఓపిగ్గా వారిని లాలించాలన్నా శక్తి తప్పదు. అందుకే మొక్కజొన్నతో చేసినవి, పండ్ల ముక్కలూ, చిరుధాన్యాల పిండితో చేసిన మురుకులూ, పల్లీ పట్టీ, నువ్వులు బెల్లం ఉండలు ఇలాంటి.. అప్పుడపుడూ పకోడీ, మిరపకాయ బజ్జీలాంటివి తినేయొచ్చు.
చివరిగా
ఏదైనా అనారోగ్యం అనిపించినా.. అదే తగ్గిపోతుందిలే అని ఊరుకోవద్దు. వెంటనే వైద్యులను సంప్రదించడం, సరైన చికిత్స తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మానసికంగా ఒంటరిగా అనిపించినా, ఏమాత్రం సంకోచించ కుండా కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా భర్తతో పంచుకోండి. తగిన పరిష్కారాన్ని వెదుక్కోండి. అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంగా ఉండండి! దీంతో మీ పిల్లలు, మీ కుటుంబం మొత్తం ఆరోగ్యం ఆనందంగా ఉండటమే కాదు, సమాజం, దేశం కళకళలాడుతూ ఉంటుంది.
మహిళలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
Comments
Please login to add a commentAdd a comment