ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు ఉనికి భయం పట్టుకుందా? అందుకే పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలను పట్టించుకోవడంలేదా? విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను నాశనం చేయడానికి చంద్రబాబు చేస్తున్న కుట్రలను టీడీపీ నేతలే అడ్డుకుంటున్నారా? విశాఖ రాజధాని సెంటిమెంట్‌కు భయపడి సైలెంట్ అవుతున్నారా?
చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం?
విశాఖకు చేస్తున్నది మేలా? కీడా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏదో ఒక రూపంలో విశాఖ నగరంపై కుట్రలు చేస్తూనే ఉన్నారు. విశాఖపై ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా ఉత్తరాంధ్ర టీడీపీ నేతలతో ప్రచారం చేయిస్తూనే ఉన్నారు. బినామీ రాజధాని అమరావతి కోసం విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికి కుట్రలు కుతంత్రాలు అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అంతా కలిసి విశాఖలో భూకబ్జాలు పెరిగిపోయాయంటూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలపాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు.
ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని తీసుకుని వరుసగా ఆరు రోజులపాటు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అంతా సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని హుకుం జారీ చేశారు. రుషి కొండపై విధ్వంసం పేరుతో ధర్నా చేయాలని.. ఆ తర్వాత వరుసగా దస్ పల్లా భూములు, గంజాయి సాగు, ఏజెన్సీలో అక్రమ మైనింగ్, ఉత్తరాంధ్రలో చక్కెర కర్మగారాలు మూసివేత అంటూ ఇలా ఆరు అంశాలపై ధర్నాలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ ఆరు కార్యక్రమాల్లో కేవలం ఒక్క కార్యక్రమాన్ని మాత్రమే నిర్వహించి టీడీపీ నేతలు చేతులు దులుపుకున్నారు. రుషి కొండ వద్ద దీక్షకు బయలుదేరి వెళ్లే సమయాన్ని ముందుగానే పోలీసులకు సమాచారం అందించి.. పార్టీ కార్యాలయం వద్దే అరెస్టయ్యారు. అసలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో సహా సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. మిగతా ఐదు నిరసన కార్యక్రమాలను తాము చేయలేమని చంద్రబాబుకు కరాకండిగా చెప్పేశారు.
ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాజధాని అంశం నుంచి దృష్టి మరల్చేందుకు ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు నాయుడుకు స్పష్టం చేశారు. రాజధానిని అడ్డుకోవడం కోసం విశాఖలో ఏదో జరిగిపోతుందన్నట్లు తప్పుడు ప్రచారం చేసినా, నిరసనలు దీక్షలు చేపట్టినా ప్రజల నుండి వ్యతిరేకత తప్పదని పచ్చ పార్టీ బాస్‌ను హెచ్చరించారు.
దసపల్లా భూముల్లోనే టీడీపీ ఆఫీసు
అసలు చంద్రబాబు సూచించిన నిరసన కార్యక్రమాలకు సంబంధించిన తప్పులు, ఘోరాలు అన్నీ జరిగింది టీడీపీ పాలనా కాలంలోనే అంటూ ఉత్తరాంధ్ర నేతలు రివర్స్‌లో ఝలక్ ఇచ్చారు. విశాఖలో టీడీపీ నేతలే స్వయంగా భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ బాబు హయాంలోనే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సిట్‌కు ఫిర్యాదు చేసిన అంశాన్ని టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు.
మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ గంజాయికు అడ్డగా మారిందని మీడియా ముఖంగా మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో చక్కెర కర్మాగారాలన్నీ టీడీపీ హయాంలోనూ మూతబడిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదంటున్నారు. దస్‌పల్లా భూముల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంటున్నారు.
ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురైంది, వలసలు పెరిగింది కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అని తేల్చేశారు ఉత్తరాంధ్ర నాయకులు. తప్పులన్నీ తమ పాలనలోనే చేసి.. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిస్తూ నిరసనలు, ధర్నాలు ఎలా చేయాలంటూ చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.
మీకో దండం బాబు
ఉత్తరాంధ్రలో నిరసన కార్యక్రమాలు నిర్వహించలేమంటున్న పార్టీ నేతలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. టీడీపీకి అమరావతి ఒక్కటే ముఖ్యమని వీలైనంతవరకు విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయాలని పార్టీ నేతలను ఆదేశిస్తున్నారు. ఎవరైనా పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. మరి ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు చంద్రబాబు ఆదేశాలను అమలు చేస్తారా? లేదంటే విశాఖ పరిపాలనా రాజధానిగా కావాలని పోరాటం చేస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్ గౌరవిస్తారా అన్నది వేచి చూడాలి.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment