రేపటినుంచి నెలపాటు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్
బాలకార్మికులు, వెట్టిచాకిరి, యాచకుల్ని గుర్తించనున్న ప్రత్యేక బృందాలు
సాక్షి, హైదరాబాద్: బాలకార్మికులు, వెట్టిచాకిరీ, యాచన చేసే చిన్నారులు, అదృశ్యమైన బాలలను గుర్తించేందుకు ఆపరేషన్ ముస్కాన్ పేరిట జూలై 1 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో స్థానిక పోలీసులతో కూడిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సిబ్బందితోపాటు కార్మికశాఖ, మహిళా శిశుసంక్షేమశాఖ, పాఠశాల విద్య, ప్రజారోగ్య, లీగల్ సరీ్వస్ అథారిటీతోపాటు ఎన్జీవోలు ఈ స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొంటాయి.
మొత్తం 120 సబ్ డివిజనల్ కమిటీలు ఈ స్పెషల్ డ్రైవ్‌ను ఈనెల 31 వరకు కొనసాగించనున్నాయి. నెలపాటు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్‌కు సంబంధించి సన్నాహక సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఇందులో అన్ని భాగస్వామ్య విభాగాల అధికారులు పాల్గొని క్షేత్ర స్థాయి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.
తప్పిపోయిన చిన్నారుల జాడ కనిపెట్టేందుకు తెలంగాణ పోలీసులు వినియోగిస్తున్న దర్పణ్ పరిజ్ఞానాన్ని సైతం ఈ డ్రైవ్‌లో అధికారులు వినియోగించనున్నారు. ఈ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో గుర్తించే చిన్నారుల వివరాలు నమోదు చేయడంతోపాటు అదృశ్యమైన చిన్నారుల కేసుల గణాంకాలను సరిపోల్చి చూస్తారు. ఇలా చేయడంతో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని అదృశ్యమైన చిన్నారుల కేసులు సైతం పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment