వర్క్‌ ప్లేస్‌లో మహిళలకు భద్రత కల్పించాలి: మంత్రి సీతక్క | Minister Seethakka Comments On Women Safety At Work Places | Sakshi
Sakshi News home page

వర్క్‌ ప్లేస్‌లో మహిళలకు భద్రత కల్పించాలి: మంత్రి సీతక్క

Published Fri, Sep 20 2024 1:52 PM | Last Updated on Fri, Sep 20 2024 3:12 PM

Minister Seethakka Comments On Women Safety At Work Places

సాక్షి, హైదరాబాద్‌: తాము పని చేస్తున్న ప్రాంతాల్లో మహిళల మీద వేధింపులను సహించేది లేదన్నారు మంత్రి సీతక్క. అలాగే, తాము తక్కువ అనే ఆలోచన నుండి మహిళలు బయటపడాలని సూచించారు. సవాళ్లు ఎదురైనప్పుడు పారిపోకూడదు అంటూ కామెంట్స్‌ చేశారు.

మాదాపూర్‌లోని టెక్ మహీంద్రా క్యాంపస్‌లో CII ఇండియన్ ఉమెన్ నెట్‌వర్క్ తెలంగాణ 10వ వార్షిక లీడర్‌షిప్ సదస్సు జరిగింది. ఈ సదస్సును మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం, సీతక్క మాట్లాడుతూ..‘మహిళలు సమాజ సృష్టికర్తలు. కానీ మహిళలను చిన్నచూపు చూసే మెంటాలిటీ ఉంది. అందుకే మహిళలు ఇంకా వెనకబడే ఉన్నారు. ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తున్నా.. పురుషులే గొప్ప అనే భావన ఉంది. తక్కువ అనే ఆలోచన నుండి మహిళలు బయటపడాలి. నేను ఎవరి మీద ఆధారపడకుండా కష్టాన్ని నమ్ముకుని పనిచేశాను. మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా సేవలు అందిస్తున్నాను. ఆదివాసి మహిళ అయిన నాకు పంచాయతీరాజ్ వంటి పెద్ద శాఖను ఇచ్చారు. 13వేల గ్రామ పంచాయతీలు, రెండు కోట్ల మంది ప్రజలకు సేవ చేసే బాధ్యతను నాకు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించి పట్టుదలతో పనిచేస్తున్నాను.

పని ప్రాంతాల్లో మహిళలకు భద్రత కల్పించాలి. వర్క్ ప్లేస్‌లో మహిళలకు భద్రత లేకపోతే ఇంకెక్కడ భద్రత ఉంటుంది. ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే ప్రశ్నించడం నేర్చుకోవాలి. మీకు ఎదురవుతున్న సవాళ్లను మా దృష్టికి తీసుకొస్తే పరిష్కారం కోసం చట్టాలు చేస్తాం. పని ప్రాంతాల్లో మహిళల మీద వేధింపులను సహించేది లేదు. వ్యాపారాలు, వ్యాపారవేత్తలు పట్టణాలకే పరిమితం కాకూడదు. గ్రామీణ ప్రాంతాల నుంచి పారిశ్రామికవేత్తలు ఎదిగినప్పుడే సమాజంలో అంతరాలు తగ్గుతాయి. అభివృద్ధి ఒకే చోట కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు నెలకొల్పాలి. ఒక గ్రామీణ ప్రాంత బిడ్డగా నేను అదే కోరుకుంటున్నాను. స్థానిక వనరుల కేంద్రంగా వ్యాపార అభివృద్ధి జరగాలి.  

స్కిల్ డెవలప్‌మెంట్‌ కోసం సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రాంతాలకు ఐటీని విస్తరిస్తున్నారు. సవాళ్లు ఎదురైనప్పుడు పారిపోకూడదు. సవాళ్లను చాలెంజ్‌గా తీసుకొని మహిళలు నిలదొక్కుకోవాలి. మహిళా భద్రత, సాధికారత కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది. ప్రయాణాలు, పని ప్రాంతాల్లో మహిళా భద్రత కోసం టీ-సేఫ్ యాప్ తీసుకొచ్చాం. ఇతర రాష్ట్రాలకు టీ-సేఫ్ ఆదర్శంగా నిలుస్తోంది.

లింగ సమానత్వం రావాలంటే అన్నిచోట్ల మహిళలు ముందుకు రావాలి. మహిళలపై ఎలాంటి వివక్షత చూపకుండా సమాన అవకాశాలు కల్పించాలి. మహిళలు ఉన్నత స్థాయికి చేరే విధంగా అంతా పనిచేయాలి. పారిశ్రామిక రంగంలో ముందంజలో ఉన్న మహిళలు వెనుకబాటుతనంలో ఉన్న మహిళలకు తోడ్పాటు ఇవ్వాలి. అప్పుడే మహిళలు అభివృద్ధి బాటలో పరిగెత్తగలరు. మహిళలకు మానవత్వం ఎక్కువ. సమస్యల్లో ఉన్నవారికి అక్కలా చెల్లెలా తల్లిలా చేయూత ఇవ్వాలి. యంగ్ ఇండియాలో నిరుద్యోగము పెద్ద సమస్యగా మారింది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో మీ సేవలను అందించాలి. ఒకరికొకరు ఆసరాగా ఉండి తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: ప్రజాభవన్‌ చుట్టూ కంచెలు ఎందుకు?: కేటీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement