తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న మహిళల భద్రత, రక్షణలను మరింత మెరుగుపరచడం కోసం వారి తరఫున ప్రాతినిధ్యం వహించేలా ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లుగా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు ‘మా’ అధ్యక్షుడిగా నాది ఒక విజ్ఞప్తి.
తెలుగ చిత్ర పరిశ్రమలోని మహిళల భద్రత, రక్షణ మరింత మెరుగుపడేలా, వారి తరఫున ప్రాతినిధ్యం ఉండేలా ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయండి. కెమెరా ముందు, వెనక ప్రతి ఒక్కరికీ భద్రతతో కూడిన పరిస్థితులు ఉండాలన్న దానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. భద్రత, సాధికారితలకు చలన చిత్ర పరిశ్రమ ప్రతిరూపంగా నిలిపేందుకు తెలుగు ఇండస్ట్రీలో భాగమైన ప్రతి ఒక్కర్నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నాం’’ అంటూ గురువారం ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే... మలయాళ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీ నివేదికలోని అంశాలు వెలుగులోకి వచ్చాక ఇతర పరిశ్రమల్లోనూ ఆ తరహా కమిటీ ఏర్పాటు చేయాలని పలువురు స్టార్స్ అంటున్న విషయం తెలిసిందే. తెలుగులో ఉన్న విభాగాల్లో ఓ కీలక విభాగం అయిన ‘మా’ తరఫున మంచు విష్ణు కమిటీ ఏర్పాటుని ప్రతిపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment