కాగితం ఖాదీ | piece of paper on the loom is made of garment, it is a paper | Sakshi
Sakshi News home page

కాగితం ఖాదీ

Published Fri, Apr 20 2018 12:45 AM | Last Updated on Fri, Apr 20 2018 12:45 AM

piece of paper on the loom is made of garment, it is a paper - Sakshi

పత్తిని వడికి దారం చేసి మగ్గం మీద నేస్తే  అది ఖాదీ. అదే రాట్నం, అదే మగ్గం మీద కాగితాన్ని వడికి వస్త్రాన్ని నేస్తే అది కాగితం  ఖాదీ. ఆ ప్రయోగం చేసిన ఖాదీ ఇంటి  అమ్మాయి పాలిశెట్టి నీరజ.. చేనేతలకు  జీవాన్ని, పునరుజ్జీవాన్నీ ఇస్తోంది. 

‘అహ నా పెళ్లంట’ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ పెళ్లి కోసం పరమ పిసినారిగా నటిస్తుంటాడు. ఈ వెధవ దేహాన్ని కప్పుకోవడానికి దుస్తులెందుకు దండగ? కాగితంతో కప్పుకుంటే చాలదూ... అంటూ పేపర్‌ లుంగీ కట్టుకుంటాడు. అది చూసిన కోట శ్రీనివాసరావు (మామ పాత్ర) పేపర్‌ చీర ఎలా ఉంటుందో అని ఆలోచనలో పడతాడు. ఇది జంధ్యాల హాస్య చతురతకు పరాకాష్ట. ఆ సీన్‌కి హాలంతా పొట్టపట్టుకుని మరీ నవ్వేసింది. ఇప్పటికీ ఎప్పుడు టీవీలో ఆ సినిమా వచ్చినా ఆ సీన్‌ గుర్తొచ్చి... అప్పటి వరకు మునిగితేలుతున్న స్ట్రెస్‌ను చుట్టచుట్టి డస్ట్‌బిన్‌లో పడేసి, ఓ చిరునవ్వు నవ్వుతుంటాం.

కాగితం నుంచి వస్త్రం
అది సినిమా కోసం రాసుకున్న కామెడీ సీన్‌. అయితే ఆ ఫార్ములాతో క్లాత్‌ తయారవుతుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పుడు పాలిశెట్టి నీరజ అనే తెలుగమ్మాయి ఓ ప్రయోగం చేసింది. పేపర్‌ని సన్నని పోగులుగా చేసి రాట్నంలో వేసి వడుకుతోంది. మగ్గం మీద నేసి కంప్లీట్‌ క్లాత్‌ను తయారు చేస్తోంది. ఇలా ఎకో ఫ్రెండ్లీ టెక్స్‌టైల్‌తో ఓ చిన్న వ్యాపార సామ్రాజ్యానికి తొలి అడుగు వేసింది. ఇప్పుడామె వీవింగ్‌ స్టూడియోలో ఫొటో ఫ్రేమ్‌లు, కుషన్‌ కవర్లు, ఫోల్డర్‌లు, పెన్‌ స్టాండ్, ల్యాంప్‌ షేడ్, పౌచ్‌లు, హ్యాండ్‌ బ్యాగ్, రూమ్‌ పార్టిషన్స్, కర్టెన్స్, సోఫా కవర్‌ వంటివి తయారవుతున్నాయి. ఇవన్నీ హ్యాండ్‌మేడ్‌ ఉత్పత్తులే. వీటి తయారీలో కరెంట్‌ వాడకం తక్కువ. వేస్ట్‌ పేపర్, రీసైకిల్‌డ్‌ పేపరే వీటికి ముడిసరుకు. 

పొందూరు నుంచి జైపూర్‌
నీరజ పాలిశెట్టిది శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో చేనేతకారుల కుటుంబం. మగ్గం చప్పుళ్ల మధ్యనే పెరిగిందామె. నేతకారుల వారసులు కొత్త ఉపాధి మార్గాలను వెతుక్కుంటున్న నేపథ్యంలో ఆమె తన మూలాలను వదలకుండా అందులోనే కొత్త రూపాలను సృష్టిస్తోంది. మరి కొందరికి ఉపాధినిస్తోంది. టెక్స్‌టైల్‌ కోర్సులనే చదివింది. కానీ ప్రయోగాలు చేయడానికి చదువొక్కటే సరిపోదు కదా. ఆచరణలో ఎదురయ్యే కష్టాలు తెలియాలి. ఆ అనుభవం కోసం తమిళనాడు, తిర్పూర్‌ వస్త్ర వ్యాపార సంస్థలలో పనిచేశారు. కోయంబత్తూర్, జైపూర్‌లలో డిజైన్‌ ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పారు. మరోవైపు వస్త్ర ప్రపంచంలో కొత్తగా మరేదైనా చేయాలనే తపన ఆమెను వెంటాడుతూనే ఉంది. పొందూరు నేత నైపుణ్యాన్ని, జైపూర్‌ సూత్రకార చేనేతల కళాత్మకతను జోడించి ఓ ప్రయోగం చేశారు. తన ప్రయోగానికి జపాన్‌ టెక్నాలజీని అనుసంధానం చేశారు. పేపర్‌ వస్త్రం తయారైంది. పేపర్‌ క్లాత్‌ తయారీకి పేపర్‌ని రెండు నుంచి నాలుగు మిల్లీమీటర్ల పోగులుగా కత్తిరిస్తారు. వాటిని చరఖా మీద వడికి దారాన్ని తయారు చేస్తారు. ఆ దారాలతో వస్త్రాన్ని నేస్తారు. 

నేతకారులకు బతుకు
ఇప్పుడు నీరజ దగ్గర నాలుగు మగ్గాల మీద పని జరుగుతోంది. ఉత్పత్తులు ఫేస్‌బుక్‌ ద్వారా మార్కెట్‌ అవుతున్నాయి. ‘నేత నిలవాలి. నేతకారులు బతకాలి. పర్యావరణానికి హాని కలగని రీతిలో ప్రయోగాలు జరగాలి. నేతకారులకు మేలు చేయడంతోపాటు భూమాతకు హాని చేయని మెథడ్‌ కోసం ప్రయత్నించాను. విజయవంతమయ్యాను కూడా. ఇప్పుడు దీనిలో వీలయినంత ఎక్కువ మందిని మమేకం చేయాలి. సమాజంలో వచ్చే మార్పులకు తగ్గట్టు మన ప్రొఫెషన్‌లో మార్పులు చేసుకుంటూ ప్రొఫెషన్‌ని బతికించుకోవాలి. అప్పుడే అది మనకు బతుకునిస్తుంది’’ అంటారు నీరజ.
– మంజీర

చేనేత చేతుల్లో పెరిగింది
మా తాత మగ్గం మీద నేయడాన్ని చూశాను. స్కూల్‌డేస్‌లో ప్రాజెక్ట్‌ కోసం జ్యూట్‌తో స్వయంగా నేశాను కూడా. మా నాన్న టెక్స్‌టైల్‌ డిజైనింగ్‌లో కోర్సు చేశారు. అహ్మదాబాద్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ తొలి బ్యాచ్‌ స్టూడెంట్‌ ఆయన. చిన్నప్పుడు ఇంట్లో చూసిన వాతావరణం, నాన్న ప్రభావంతో నేను కూడా టెక్స్‌టైల్‌ రంగంలోకే రావాలనిపించింది. బరోడాలోని మహారాజా షాయాజీరావు యూనివర్సిటీలో క్లోతింగ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ కోర్సు చేశాను. పీజీ తర్వాత ఫ్యాషన్‌ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్‌ సెక్టార్‌లలో మొత్తం పదిహేడేళ్లు పనిచేశాను. ఈ రంగంలో మా తాత, నాన్నలకంటే ఎక్కువ పరిజ్ఞానాన్ని సంపాదించానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. 
– నీరజ పాలిశెట్టి, ఫౌండర్, సూత్రకార్‌ క్రియేషన్స్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement