Loom
-
మగ్గానికి మహర్దశ.. సొంత మగ్గం ఉన్న కుటుంబానికి ఏటా రూ.24 వేలు
సాక్షి, అమరావతి: మగ్గానికి మహర్దశ వ చ్చింది. పోగు పోగుగా సంక్షేమం అందుతోంది. నేతన్నల నరాలు సత్తువ పుంజుకున్నాయి. మొత్తంగా చేనేత రంగం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిన ప్రత్యేక శ్రద్ధతో సంక్షేమాన్ని అద్దుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత రంగానికి ప్రముఖ పాత్ర ఉంది. అందుకే 1905లో ప్రారంభించిన స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశవ్యాప్తంగా చూస్తే ఇతర రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ చేనేత రంగం తన ప్రాభవాన్ని కోల్పోయి శిథిలావస్థకు చేరుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మగ్గానికి మహర్దశ పట్టింది. సీఎం వైఎస్ జగన్ అందించిన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ చేనేత కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది. మగ్గాల ఆధునికీకరణతోపాటు చేనేత సామగ్రి కొనుగోలుకు ఊతమి చ్చింది. ఆధునిక డిజైన్లు, పోటీ మార్కెట్‌కు అనుగుణంగా నాణ్యమైన వ్రస్తాల తయారీలో ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ చేనేతకు కొత్త హంగులు అందిస్తోంది. ప్రత్యేకంగా క్లస్టర్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టి శిక్షణ అనంతరం ఆధునిక యంత్రాలను సబ్సిడీపై అందించే కార్యక్రమం చేనేతల తలరాతలను మారుస్తోంది. ‘నేతన్న నేస్తం’తో రూ.969.77 కోట్లు చేనేత కుటుంబాలకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం వరుసగా ఐదేళ్లు ‘నేతన్న నేస్తం’ ద్వారా రూ.969.77 కోట్లు అందించింది. సొంత మగ్గం కలిగిన ప్రతి నేతన్నకూ ఏడాదికి రూ.24 వేల చొప్పున ఒక్కొక్కరికి రూ.1.20 లక్షల చొప్పున అందించింది. ఈ పథకం అమలు తర్వాత చేనేత కారి్మకులు తమ మగ్గాలను డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్ చేసి కొత్త డిజైన్లతో నాణ్యమైన వ్రస్తాలను ఉత్పత్తి చేస్తూ జీవితాలను మెరుగుపర్చుకున్నారు. దీంతోపాటు నేతన్నల పెన్షన్ కోసం రూ.1,396.45 కోట్లు ఇ చ్చింది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. నేతన్న నేస్తం, నేతన్న పెన్షన్, ఆప్కోకు మూడు పథకాల ద్వారానే నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.2,835.06 కోట్లు వ్యయం చేసింది. గత ప్రభుత్వం నేతన్నల కోసం ఐదేళ్లలో కేవలం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం కేవలం నాలుగేళ్లలోనే నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం విశేషం. చేనేత వారోత్సవాల నిర్వహణకు ఆదేశాలు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. చేనేత రంగాన్ని, క్లిష్టమైన బట్టలను నేయడానికి అంకితమైన కళాకారులను, ప్రోత్సహించేలా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారానికి ఒక రోజు చేనేత వ్రస్తాలు ధరించాలని 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు ఇ చ్చిందని గుర్తు చేసిన జవహర్‌రెడ్డి అదే స్ఫూర్తితో యువతరం సైతం చేనేత వ్రస్తాలు ధరించేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతి కలెక్టరేట్, ఎమ్మార్వో కార్యాలయాల ఆవరణలో చేనేత వస్త్రాల ప్రదర్శన, విక్రయాలు నిర్వహించేలా స్టాల్స్ ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలని ఆదేశించారు. ఆగస్టు 7న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేనేత వ్రస్తాలు (చీర, ధోతీ) ధరించి వాక్‌థాన్ నిర్వహించాలన్నారు. ఇకపై ప్రతి శనివారం స్వచ్ఛందంగా చేనేత వ్రస్తాలు ధరించాలని ఉద్యోగులను కోరారు. -
కాగితం ఖాదీ
పత్తిని వడికి దారం చేసి మగ్గం మీద నేస్తే అది ఖాదీ. అదే రాట్నం, అదే మగ్గం మీద కాగితాన్ని వడికి వస్త్రాన్ని నేస్తే అది కాగితం ఖాదీ. ఆ ప్రయోగం చేసిన ఖాదీ ఇంటి అమ్మాయి పాలిశెట్టి నీరజ.. చేనేతలకు జీవాన్ని, పునరుజ్జీవాన్నీ ఇస్తోంది. ‘అహ నా పెళ్లంట’ సినిమాలో రాజేంద్రప్రసాద్ పెళ్లి కోసం పరమ పిసినారిగా నటిస్తుంటాడు. ఈ వెధవ దేహాన్ని కప్పుకోవడానికి దుస్తులెందుకు దండగ? కాగితంతో కప్పుకుంటే చాలదూ... అంటూ పేపర్ లుంగీ కట్టుకుంటాడు. అది చూసిన కోట శ్రీనివాసరావు (మామ పాత్ర) పేపర్ చీర ఎలా ఉంటుందో అని ఆలోచనలో పడతాడు. ఇది జంధ్యాల హాస్య చతురతకు పరాకాష్ట. ఆ సీన్‌కి హాలంతా పొట్టపట్టుకుని మరీ నవ్వేసింది. ఇప్పటికీ ఎప్పుడు టీవీలో ఆ సినిమా వచ్చినా ఆ సీన్ గుర్తొచ్చి... అప్పటి వరకు మునిగితేలుతున్న స్ట్రెస్‌ను చుట్టచుట్టి డస్ట్‌బిన్‌లో పడేసి, ఓ చిరునవ్వు నవ్వుతుంటాం. కాగితం నుంచి వస్త్రం అది సినిమా కోసం రాసుకున్న కామెడీ సీన్. అయితే ఆ ఫార్ములాతో క్లాత్ తయారవుతుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పుడు పాలిశెట్టి నీరజ అనే తెలుగమ్మాయి ఓ ప్రయోగం చేసింది. పేపర్ని సన్నని పోగులుగా చేసి రాట్నంలో వేసి వడుకుతోంది. మగ్గం మీద నేసి కంప్లీట్ క్లాత్‌ను తయారు చేస్తోంది. ఇలా ఎకో ఫ్రెండ్లీ టెక్స్‌టైల్‌తో ఓ చిన్న వ్యాపార సామ్రాజ్యానికి తొలి అడుగు వేసింది. ఇప్పుడామె వీవింగ్ స్టూడియోలో ఫొటో ఫ్రేమ్‌లు, కుషన్ కవర్లు, ఫోల్డర్లు, పెన్ స్టాండ్, ల్యాంప్ షేడ్, పౌచ్‌లు, హ్యాండ్ బ్యాగ్, రూమ్ పార్టిషన్స్, కర్టెన్స్, సోఫా కవర్ వంటివి తయారవుతున్నాయి. ఇవన్నీ హ్యాండ్‌మేడ్ ఉత్పత్తులే. వీటి తయారీలో కరెంట్ వాడకం తక్కువ. వేస్ట్ పేపర్, రీసైకిల్డ్ పేపరే వీటికి ముడిసరుకు. పొందూరు నుంచి జైపూర్ నీరజ పాలిశెట్టిది శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో చేనేతకారుల కుటుంబం. మగ్గం చప్పుళ్ల మధ్యనే పెరిగిందామె. నేతకారుల వారసులు కొత్త ఉపాధి మార్గాలను వెతుక్కుంటున్న నేపథ్యంలో ఆమె తన మూలాలను వదలకుండా అందులోనే కొత్త రూపాలను సృష్టిస్తోంది. మరి కొందరికి ఉపాధినిస్తోంది. టెక్స్టైల్ కోర్సులనే చదివింది. కానీ ప్రయోగాలు చేయడానికి చదువొక్కటే సరిపోదు కదా. ఆచరణలో ఎదురయ్యే కష్టాలు తెలియాలి. ఆ అనుభవం కోసం తమిళనాడు, తిర్పూర్ వస్త్ర వ్యాపార సంస్థలలో పనిచేశారు. కోయంబత్తూర్, జైపూర్లలో డిజైన్ ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పారు. మరోవైపు వస్త్ర ప్రపంచంలో కొత్తగా మరేదైనా చేయాలనే తపన ఆమెను వెంటాడుతూనే ఉంది. పొందూరు నేత నైపుణ్యాన్ని, జైపూర్ సూత్రకార చేనేతల కళాత్మకతను జోడించి ఓ ప్రయోగం చేశారు. తన ప్రయోగానికి జపాన్ టెక్నాలజీని అనుసంధానం చేశారు. పేపర్ వస్త్రం తయారైంది. పేపర్ క్లాత్ తయారీకి పేపర్ని రెండు నుంచి నాలుగు మిల్లీమీటర్ల పోగులుగా కత్తిరిస్తారు. వాటిని చరఖా మీద వడికి దారాన్ని తయారు చేస్తారు. ఆ దారాలతో వస్త్రాన్ని నేస్తారు. నేతకారులకు బతుకు ఇప్పుడు నీరజ దగ్గర నాలుగు మగ్గాల మీద పని జరుగుతోంది. ఉత్పత్తులు ఫేస్బుక్ ద్వారా మార్కెట్ అవుతున్నాయి. ‘నేత నిలవాలి. నేతకారులు బతకాలి. పర్యావరణానికి హాని కలగని రీతిలో ప్రయోగాలు జరగాలి. నేతకారులకు మేలు చేయడంతోపాటు భూమాతకు హాని చేయని మెథడ్ కోసం ప్రయత్నించాను. విజయవంతమయ్యాను కూడా. ఇప్పుడు దీనిలో వీలయినంత ఎక్కువ మందిని మమేకం చేయాలి. సమాజంలో వచ్చే మార్పులకు తగ్గట్టు మన ప్రొఫెషన్లో మార్పులు చేసుకుంటూ ప్రొఫెషన్ని బతికించుకోవాలి. అప్పుడే అది మనకు బతుకునిస్తుంది’’ అంటారు నీరజ. – మంజీర చేనేత చేతుల్లో పెరిగింది మా తాత మగ్గం మీద నేయడాన్ని చూశాను. స్కూల్‌డేస్‌లో ప్రాజెక్ట్ కోసం జ్యూట్‌తో స్వయంగా నేశాను కూడా. మా నాన్న టెక్స్టైల్ డిజైనింగ్‌లో కోర్సు చేశారు. అహ్మదాబాద్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ తొలి బ్యాచ్ స్టూడెంట్ ఆయన. చిన్నప్పుడు ఇంట్లో చూసిన వాతావరణం, నాన్న ప్రభావంతో నేను కూడా టెక్స్టైల్ రంగంలోకే రావాలనిపించింది. బరోడాలోని మహారాజా షాయాజీరావు యూనివర్సిటీలో క్లోతింగ్ అండ్ టెక్స్టైల్స్ కోర్సు చేశాను. పీజీ తర్వాత ఫ్యాషన్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ సెక్టార్లలో మొత్తం పదిహేడేళ్లు పనిచేశాను. ఈ రంగంలో మా తాత, నాన్నలకంటే ఎక్కువ పరిజ్ఞానాన్ని సంపాదించానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. – నీరజ పాలిశెట్టి, ఫౌండర్, సూత్రకార్ క్రియేషన్స్ -
మరమగ్గాలకు దీటుగా చేనేత మగ్గం
ధర్మవరం కళాకారుడి ప్రతిభ దర్మవరం టౌన్: అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన శ్రీనివాసమూర్తి చదివింది ఇంటర్. చేనేత కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఐదేళ్ల పాటు శ్రమించి ‘చేనేత బ్రహ్మాస్త్రం’ పేరిట ఆధునిక మగ్గాన్ని ఆవిష్కరించారు. దీనికి కరెంట్ కానీ, సోలార్ కానీ అవసరం లేదు. బుధవారం ఆయన విలేకరులకు తెలిపిన వివరాల మేరకు... సాధారణంగా చేనేత మగ్గం నేయాలంటే గుంతలో దిగి చెక్కను కాళ్లతో తొక్కుతూ శ్రమించాలి. ఈ ఆధునిక మగ్గం ద్వారా కుర్చీలో కూర్చుని కాళ్లతో పని లేకుండా నేయవచ్చు. వికలాంగులకు సైతం అనువుగా ఉంటుంది. మగ్గంలోని చెక్కలను స్ప్రింగ్‌లతో అనుసంధానం చేసి పళ్ల చక్రాలతో తయారు చేశారు. కుర్చీలో కూర్చుని పలక (మగ్గం) లాగితే జాకార్డులలో డిజైన్, కొమ్ము వేయడానికి అడ్డదారం వంటి పనులు ఒకేసారి జరుగుతాయి. సాధారణ మగ్గంలో నేత కార్మికుడు వారం పాటు శ్రమించి చీరను నే స్తే ఈ మగ్గంలో రెండు రోజుల్లో నేయవచ్చు. ఈ మగ్గాన్ని త్వరలోనే నేత కార్మికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు శ్రీనివాస మూర్తి చెప్పారు.