మరమగ్గాలకు దీటుగా చేనేత మగ్గం
ధర్మవరం కళాకారుడి ప్రతిభ
దర్మవరం టౌన్: అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన శ్రీనివాసమూర్తి చదివింది ఇంటర్. చేనేత కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఐదేళ్ల పాటు శ్రమించి ‘చేనేత బ్రహ్మాస్త్రం’ పేరిట ఆధునిక మగ్గాన్ని ఆవిష్కరించారు. దీనికి కరెంట్ కానీ, సోలార్ కానీ అవసరం లేదు. బుధవారం ఆయన విలేకరులకు తెలిపిన వివరాల మేరకు... సాధారణంగా చేనేత మగ్గం నేయాలంటే గుంతలో దిగి చెక్కను కాళ్లతో తొక్కుతూ శ్రమించాలి. ఈ ఆధునిక మగ్గం ద్వారా కుర్చీలో కూర్చుని కాళ్లతో పని లేకుండా నేయవచ్చు. వికలాంగులకు సైతం అనువుగా ఉంటుంది.
మగ్గంలోని చెక్కలను స్ప్రింగ్‌లతో అనుసంధానం చేసి పళ్ల చక్రాలతో తయారు చేశారు. కుర్చీలో కూర్చుని పలక (మగ్గం) లాగితే జాకార్డులలో డిజైన్, కొమ్ము వేయడానికి అడ్డదారం వంటి పనులు ఒకేసారి జరుగుతాయి. సాధారణ మగ్గంలో నేత కార్మికుడు వారం పాటు శ్రమించి చీరను నే స్తే ఈ మగ్గంలో రెండు రోజుల్లో నేయవచ్చు. ఈ మగ్గాన్ని త్వరలోనే నేత కార్మికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు శ్రీనివాస మూర్తి చెప్పారు.