న్యూఢిల్లీ: కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆర్మీ స్థావరాల చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసేందుకు రక్షణశాఖ రూ.1,487 కోట్లను మంజూరుచేసింది. ఈ ప్రాజెక్టును 10 నెలల్లోగా పూర్తిచేయాలని రక్షణ మంత్రి సీతారామన్ ఆదేశించినట్లు అధికారిక వర్గాలు చెప్పాయి. కశ్మీర్‌లో నియంత్రణ రేఖ, కొన్ని చోట్ల ఆర్మీ స్థావరాలపై ఉగ్రదాడులు పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
పఠాన్‌కోట్ ఉగ్రదాడి తర్వాత భద్రతను కట్టుదిట్టం చేయడానికి లెఫ్టినెంట్ జనరల్ ఫిలిప్ కాంపోస్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఆడిట్ కమిటీ పలు సిఫార్సులు చేసింది. వీటి ఆధారంగా భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసేందుకు వీలుగా ప్రామాణిక నిర్వహణ విధానాలను(ఎస్‌వోపీ) త్రివిధ దళాలకు అందజేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించి భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన 600 అత్యంత సున్నితమైన, 3 వేల సున్నితమైన స్థావరాలను గుర్తించినట్లు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment