
ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిపై సైన్యం బుల్లెట్ల వర్షం కురిపించిన దృశ్యం.
శ్రీనగర్: సీఆర్‌పీఎఫ్ శిబిరంపై దాడికి విఫల యత్నం చేసి ఓ ఇంట్లో దాక్కున్న ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇరు వర్గాల మధ్య సుమారు 32 గంటలు కొనసాగిన ఎన్‌కౌంటర్ మంగళవారం ముగిసింది. ఇక్కడి కరణ్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఇంట్లో నక్కిన ఉగ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన ఆపరేషన్‌లో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ఆపరేషన్ల బృందం(ఎస్‌ఓజీ), సీఆర్‌పీఎఫ్ జవాన్లు పాల్గొన్నారు.
సంఘటనా స్థలం నుంచి ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు, రెండు ఏకే 47 తుపాకులు, 8 మేగజీన్లను స్వాధీనం చేసుకున్నారు. మృతులు లష్కరే తోయిబాకు చెందినవారేనని పోలీసులు ధ్రువీకరించారు. సోమవారం సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై దాడి చేయడానికి వచ్చిన ఉగ్రవాదులపై అప్రమత్తంగా ఉన్న గార్డు కాల్పులు జరపడంతో వారు సమీపంలోని ఇంట్లోకి చొరబడ్డారు. ఆ తరువాత ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్ చనిపోగా, ఒక పోలీస్ గాయపడ్డాడు. సోమవారం రాత్రి విరామం అనంతరం మంగళవారం ఉదయం పునఃప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.
గార్డు అప్రమత్తతతో తప్పిన ముప్పు
ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ సందర్భంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఐజీ ఎస్పీ పాని వెల్లడించారు. వారు దాక్కున్న ఐదంతస్తుల భవనం నివాస, వాణిజ్య సముదాయాల మధ్య ఉండటం వల్లే ఎన్‌కౌంటర్ పూర్తవడానికి సమయం పట్టిందని తెలిపారు. సమీప ప్రాంతంలో నివసిస్తున్న సీఆర్‌పీఎఫ్ కుటుంబాలు, ప్రజలను అక్కడి నుంచి తరలించి పక్కా రెక్కీ నిర్వహించిన తరువాతే ముష్కరులపై ముప్పేట దాడిని ప్రారంభించామని సీఆర్‌పీఎఫ్ ఐజీ రవిదీప్ సాహి చెప్పారు. ఒకవేళ గార్డు ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేయకుంటే జరిగే నష్టం ఊహించలేమని చెప్పారు. ఆ ఇంట్లో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాక్కున్నారా? అని ప్రశ్నించగా..గార్డు ఇద్దరినే చూశాడని చెప్పారు.
మరో సైనికుడి మృతదేహం లభ్యం
సంజువాన్ సైనిక శిబిరంలో జరిగిన ఎన్‌కౌంటర్ స్థలంలో మరో భారత జవాన్ మృతదేహం లభించింది. దీంతో ఈ ఉగ్రదాడిలో మరణించిన వారి సంఖ్య ముగ్గురు ఉగ్రవాదులతో కలుపుకుని 10కి చేరింది. ఈ దాడిలో అమరులైన కశ్మీర్ లోయకు చెందిన జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ హాజరయ్యారు. సైనిక శిబిరాలకు సమీపంలో ఇళ్లు నిర్మించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అధికారుల అనుమతితోనే వీటిని కడుతున్నందున ఆ తరువాత తొలగించడం కష్టమవుతోందని పేర్కొన్నారు.
రాజ్‌నాథ్ సమీక్ష...
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వరసగా రెండోరోజు జమ్మూ కశ్మీర్‌లో భద్రతా పరిస్థితిపై సమీక్ష జరిపారు. మంగళవారం జరిగిన భేటీకి జాతీయ భద్రతా సలహాదారు దోవల్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా హాజరయ్యారు. సరిహద్దుల గుండా చొరబాట్లను నియంత్రించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు.
మరో కుట్ర భగ్నం
జమ్మూలో మరో సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడి కుట్ర భగ్నమైంది. జమ్మూ–అక్నూర్ రోడ్డులో ఉన్న దోమనా శిబిరం ప్రధాన గేటు సమీపంలోకి బైకుపై వచ్చిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు గార్డుపై కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు ప్రతికాల్పులకు దిగడంతో వారు పారిపోయినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ దేవేందర్ ఆనంద్ వెల్లడించారు. పరారైన ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.
మేమూ బదులిస్తాం: పాక్
భారత్, పాక్‌ల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. భారత్ దుస్సాహసానికి పాల్పడితే అదే రీతిలో బదులిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. సంజువాన్ సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడి వెనక పాక్ ఉందన్న రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖుర్రమ్ దస్తగిర్ ఖాన్ మంగళవారం నిర్మలా వ్యాఖ్యలపై స్పందిస్తూ.. భారత్ ఎలాంటి దుస్సాహసానికి దిగినా తామూ అలాగే బదులిస్తామని అన్నారు.
సంజువాన్‌లో అమరులైన జవాన్లకు మెహబూబా నివాళి
Comments
Please login to add a commentAdd a comment