Laskaretoyiba
-
భారత్ ప్రతిపాదనకు నో.. పాకిస్థాన్ ఉగ్రవాదికి చైనా అండ!
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కీలక నాయకుడు షాహిద్ మహమూద్‌కు ఐక్యరాజ్య సమితిలో చైనా అండా నిలిచింది. మహమూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్, అమెరికాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదులపై చర్యలు చేపట్టకుండా ఐక్యరాజ్య సమితిలో గత కొన్ని నెలల్లో చైనా అడ్డుకోవడం ఇది నాలుగోసారి కావటం గమనార్హం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ కింద షాహిద్ మహమూద్‌పై చర్యలు తీసుకోవాలని.. భారత్, అమెరికా ప్రతిపాదనలు చేశాయి. అయితే, పాకిస్థాన్ మిత్రదేశమైన చైనా అందుకు అడ్డుపడింది. ఈ ప్రతిపాదనలను నిలిపివేసింది. మరోవైపు.. 2016లోనే అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ షాహిద్ మహమూద్, మహుమ్మద్ సార్వర్లపై ఆంక్షలు విధించింది. ఉగ్రవాదానికి వీరు నిధులను సమకూర్చటాన్ని అడ్డుకునే క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ భారత పర్యటనలో భాగంగా 26/11 ముంబై ఉగ్రదాడిలో మరణించి వారికి నివాళులర్పించిన క్రమంలోనే.. చైనా టెర్రరిస్టులకు అండగా నిలవటం గమనార్హం. ఎవరీ షాహిద్? అమెరికా ట్రెజరీ విభాగం వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. షాషిద్ మహమూద్ కరాచీలోని లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో సీనియర్ సభ్యుడు. 2007 నుంచి లష్కరే ఉగ్రసంస్థ కోసం పనిచేస్తున్నాడు. 2013లో అతడు లష్కరే పబ్లికేషన్స్ విభాగ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టాడు. 2014 నుంచి లష్కరే అనుబంధ విభాగమైన ఫలహ్ ఇ ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్)లో కొనసాగి.. 2015-16 మధ్యలో ఆ సంస్థ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించాడు. సిరియా, టర్కీ, బంగ్లాదేశ్, గాజా వంటి ప్రాంతాల్లో పర్యటించి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చాడు. మరో ఉగ్రనేత సాజిద్ మిర్‌తో కలిసి విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించాడు. ఇదీ చదవండి: ఎందుకింత ఉగ్రరూపం? జెలెన్స్కీ ట్వీట్ -
లష్కరే తొయిబా ఉగ్రవాదులు అరెస్ట్
శ్రీనగర్: సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను శనివారం అరెస్ట్ చేశారు. అదే విధంగా బుద్గాం జిల్లాలో ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని ఛేదించనట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. కశ్మీర్‌లోని ఖాన్సాయిబ్ పోలీసుస్టేషన్ పరిధిలోని అరిజల్ గ్రామంలో సీఆర్పీఎఫ్ భద్రతా దళాలు, బుద్గాం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో టాప్ టెర్రరిస్ట్ జహూర్ వాని అతను ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాద స్థావరంలో భద్రతా దళాలు అరెస్ట్ చేశారు. One hideout busted in Arizal Khansaib,Budgam & a top Over Groud Wirker of LeT, namely Zahoor Wani was arrested. Arms and ammunition recovered from his possession. More arrests and recoveries are expected. Case registered. pic.twitter.com/sFMfVft7Dh — J&K Police (@JmuKmrPolice) May 16, 2020 అతని రహస్య ఉగ్రస్థావరంలో ఉన్న మారణాయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రత దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మరో నలుగురు ఉగ్రవాదులు.. యునిస్ మిర్, అసలాం షేక్, పవైజ్ షేక్, రెహమాన్ లోన్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఖాన్సాయిబ్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా వీరు లష్కరే తోయిబా ఉగ్గవాదులకు సాయం అందిస్తూ.. ఆశ్రయం కల్పిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. వీరిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మళ్లీ భారత్‌పై దాడి జరిగితే..
వాషింగ్టన్: భారత్‌పై మరో ఉగ్రదాడి కనుక జరిగితే పాక్ ప్రమాదంలో పడినట్లేనని అమెరికా హెచ్చరించింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. భారత ఉపఖండంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకూడదని అమెరికా కోరుకుంటున్నట్లు బుధవారం వైట్‌హౌజ్‌లో సీనియర్ అధికారి చెప్పారు. ‘ఉగ్రసంస్థలపై పాకిస్తాన్ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల భారత్‌పై మళ్లీ ఉగ్రదాడి జరిగితే పాకిస్తాన్‌కు అది తీవ్ర సమస్యాత్మకంగా మారుతుంది. దీనివల్ల భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ఆస్కారం ఉంది’అని ఆయన పేర్కొన్నారు. ‘గతంలో కూడా చాలా మంది ఉగ్రవాదులను పాకిస్తాన్ అరెస్ట్ చేయడం చూశాం. కానీ కొద్ది నెలలకే వారిని విడుదల చేశారు. కొందరు ఉగ్రవాద నేతలు దేశవ్యాప్తంగా ప్రయాణించేందుకు ఇంకా అనుమతి ఉంది’అని చెప్పారు. ఆర్థికంగా అందుతున్న సహాయసహకారాలు కావాలో వద్దో పాకిస్తానే తేల్చుకోవాలని ఆయన సూచించారు. పాక్‌ను చైనా కాపాడొద్దు.. పాకిస్తాన్‌ను కాపాడటం చైనా బాధ్యత కాదని, దీనికి బదులు ప్రపంచ దేశాలతో కలసి ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాక్‌పై ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారి పేర్కొన్నారు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పెట్టిన ప్రతిపాదనను చైనా వీటో అధికారంతో అడ్డుకోవడం ఎంతో నిరాశ కలిగించిందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు సాంకేతిక కారణాలు చూపి నాలుగు సార్లు ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. -
ఆర్మీ x కశ్మీర్ సర్కార్
శ్రీనగర్: ఉగ్రవాదులను తుదముట్టించేందుకు జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాల్లో ఆదివారం రాత్రి ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌లో ఆరుగురు హతమయ్యారు. ఇందులో ఇద్దరు లష్కరే మిలిటెంట్లతోపాటు వారితో ఉన్న నలుగురినీ ఆర్మీ అంతమొందించింది. అయితే ఆ నలుగురూ ఉగ్రవాదులేనని ఆర్మీ స్పష్టం చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారు పౌరులేనంటోంది. ఆదివారం రాత్రి దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌లోని పహ్నూ ప్రాంతంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న జవాన్లు వేగంగా వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో ఆ రెండు వాహనాలనుంచి హఠాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో జవాన్లు ఆత్మరక్షణ కోసం కాల్పులు ప్రారంభించారు. జవాన్లు అప్రపమత్తమై కాల్పులు ప్రారంభించటంతో.. లష్కరే ఉగ్రవాది ఆమిన్ మాలిక్, ఆషిక్ సహా ఆరుగురు హతమయ్యారు. ఆర్మీ చేతుల్లో జైషే ఉగ్రవాది హతం ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థ కీలక నేతగా (ఆత్మాహుతి దాడులకు ప్రణాళికలు రూపొందిస్తూ) ముఫ్తీ వకాస్ భారత బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో హతమయ్యాడు. ఫిబ్రవరి 10న సంజువాన్ ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడిలో వకాస్ సూత్రధారి అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం అవంతీపూర్ జిల్లా హత్వార్లోని ఓ ఇంట్లో ముఫ్తీ వకాస్ ఉన్నాడన్న సమాచారంతో ఆ ఇంటిని చుట్టుముట్టిన బలగాలు 20 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తిచేశాయి. -
32 గంటల ఎన్కౌంటర్
శ్రీనగర్: సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడికి విఫల యత్నం చేసి ఓ ఇంట్లో దాక్కున్న ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇరు వర్గాల మధ్య సుమారు 32 గంటలు కొనసాగిన ఎన్కౌంటర్ మంగళవారం ముగిసింది. ఇక్కడి కరణ్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఇంట్లో నక్కిన ఉగ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన ఆపరేషన్‌లో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ఆపరేషన్ల బృందం(ఎస్ఓజీ), సీఆర్పీఎఫ్ జవాన్లు పాల్గొన్నారు. సంఘటనా స్థలం నుంచి ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు, రెండు ఏకే 47 తుపాకులు, 8 మేగజీన్లను స్వాధీనం చేసుకున్నారు. మృతులు లష్కరే తోయిబాకు చెందినవారేనని పోలీసులు ధ్రువీకరించారు. సోమవారం సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేయడానికి వచ్చిన ఉగ్రవాదులపై అప్రమత్తంగా ఉన్న గార్డు కాల్పులు జరపడంతో వారు సమీపంలోని ఇంట్లోకి చొరబడ్డారు. ఆ తరువాత ప్రారంభమైన ఎన్కౌంటర్లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ చనిపోగా, ఒక పోలీస్ గాయపడ్డాడు. సోమవారం రాత్రి విరామం అనంతరం మంగళవారం ఉదయం పునఃప్రారంభమైన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. గార్డు అప్రమత్తతతో తప్పిన ముప్పు ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ సందర్భంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఐజీ ఎస్పీ పాని వెల్లడించారు. వారు దాక్కున్న ఐదంతస్తుల భవనం నివాస, వాణిజ్య సముదాయాల మధ్య ఉండటం వల్లే ఎన్కౌంటర్ పూర్తవడానికి సమయం పట్టిందని తెలిపారు. సమీప ప్రాంతంలో నివసిస్తున్న సీఆర్పీఎఫ్ కుటుంబాలు, ప్రజలను అక్కడి నుంచి తరలించి పక్కా రెక్కీ నిర్వహించిన తరువాతే ముష్కరులపై ముప్పేట దాడిని ప్రారంభించామని సీఆర్పీఎఫ్ ఐజీ రవిదీప్ సాహి చెప్పారు. ఒకవేళ గార్డు ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేయకుంటే జరిగే నష్టం ఊహించలేమని చెప్పారు. ఆ ఇంట్లో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాక్కున్నారా? అని ప్రశ్నించగా..గార్డు ఇద్దరినే చూశాడని చెప్పారు. మరో సైనికుడి మృతదేహం లభ్యం సంజువాన్ సైనిక శిబిరంలో జరిగిన ఎన్కౌంటర్ స్థలంలో మరో భారత జవాన్ మృతదేహం లభించింది. దీంతో ఈ ఉగ్రదాడిలో మరణించిన వారి సంఖ్య ముగ్గురు ఉగ్రవాదులతో కలుపుకుని 10కి చేరింది. ఈ దాడిలో అమరులైన కశ్మీర్ లోయకు చెందిన జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ హాజరయ్యారు. సైనిక శిబిరాలకు సమీపంలో ఇళ్లు నిర్మించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అధికారుల అనుమతితోనే వీటిని కడుతున్నందున ఆ తరువాత తొలగించడం కష్టమవుతోందని పేర్కొన్నారు. రాజ్‌నాథ్ సమీక్ష... కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వరసగా రెండోరోజు జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితిపై సమీక్ష జరిపారు. మంగళవారం జరిగిన భేటీకి జాతీయ భద్రతా సలహాదారు దోవల్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా హాజరయ్యారు. సరిహద్దుల గుండా చొరబాట్లను నియంత్రించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. మరో కుట్ర భగ్నం జమ్మూలో మరో సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడి కుట్ర భగ్నమైంది. జమ్మూ–అక్నూర్ రోడ్డులో ఉన్న దోమనా శిబిరం ప్రధాన గేటు సమీపంలోకి బైకుపై వచ్చిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు గార్డుపై కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు ప్రతికాల్పులకు దిగడంతో వారు పారిపోయినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ దేవేందర్ ఆనంద్ వెల్లడించారు. పరారైన ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. మేమూ బదులిస్తాం: పాక్ భారత్, పాక్‌ల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. భారత్ దుస్సాహసానికి పాల్పడితే అదే రీతిలో బదులిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. సంజువాన్ సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడి వెనక పాక్ ఉందన్న రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖుర్రమ్ దస్తగిర్ ఖాన్ మంగళవారం నిర్మలా వ్యాఖ్యలపై స్పందిస్తూ.. భారత్ ఎలాంటి దుస్సాహసానికి దిగినా తామూ అలాగే బదులిస్తామని అన్నారు. సంజువాన్‌లో అమరులైన జవాన్లకు మెహబూబా నివాళి -
ఉగ్రవాది ఆరిఫ్ ఉరి అమలుపై స్టే
న్యూఢిల్లీ: ఎర్రకోటపై దాడి చేసిన లష్కరేతోయిబా ఉగ్రవాది మహమ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్‌కు విధించిన ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. తాను ఇప్పటికే 13 ఏళ్లపాటు జైలులో గడిపానని, తనను విడుదల చేయాలని కోరుతూ ఆరిఫ్ చేసుకున్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం... దీనిపై సమాధానం ఇవ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 2000వ సంవత్సరం డిసెంబర్ 22న ఎర్రకోటపై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఇద్దరు జవానులు సహా ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కింది కోర్టు ఆరిఫ్‌కు ఉరిశిక్ష విధించగా... ఢిల్లీ హైకోర్టు దానిని 2007 సెప్టెంబర్ 13న ధ్రువీకరించింది, దీనిని సవాలు చేస్తూ ఆరిఫ్ వేసిన పిటిషన్‌ను 2011 ఆగస్టులో సుప్రీంకోర్టు కొట్టివేసింది కూడా. అయితే తాజాగా.. ఆరిఫ్ సుప్రీంలో మరో పిటిషన్ దాఖలు చేశాడు. తాను ఇప్పటికే 13 ఏళ్లుగా జైల్లో ఉన్నానని.. ఇప్పటివరకూ తాను శిక్ష కోసం ఎదురుచూస్తూ వేదన అనుభవించానని ఆరిఫ్ సుప్రీంకు తెలిపాడు. దానివల్ల శారీరకంగా, మానసికంగా దెబ్బతిన్నానని.. తనను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసుకున్నాడు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఉరిశిక్ష అమలుపై స్టే ఇస్తూ.. కేంద్రానికి నోటీసులు జారీచేసింది.