ముఫ్తీ వకాస్
శ్రీనగర్: ఉగ్రవాదులను తుదముట్టించేందుకు జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాల్లో ఆదివారం రాత్రి ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌లో ఆరుగురు హతమయ్యారు. ఇందులో ఇద్దరు లష్కరే మిలిటెంట్లతోపాటు వారితో ఉన్న నలుగురినీ ఆర్మీ అంతమొందించింది. అయితే ఆ నలుగురూ ఉగ్రవాదులేనని ఆర్మీ స్పష్టం చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారు పౌరులేనంటోంది. ఆదివారం రాత్రి దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌లోని పహ్నూ ప్రాంతంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న జవాన్లు వేగంగా వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో ఆ రెండు వాహనాలనుంచి హఠాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో జవాన్లు ఆత్మరక్షణ కోసం కాల్పులు ప్రారంభించారు. జవాన్లు అప్రపమత్తమై కాల్పులు ప్రారంభించటంతో.. లష్కరే ఉగ్రవాది ఆమిన్ మాలిక్, ఆషిక్ సహా ఆరుగురు హతమయ్యారు.
ఆర్మీ చేతుల్లో జైషే ఉగ్రవాది హతం
ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థ కీలక నేతగా (ఆత్మాహుతి దాడులకు ప్రణాళికలు రూపొందిస్తూ) ముఫ్తీ వకాస్ భారత బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో హతమయ్యాడు. ఫిబ్రవరి 10న సంజువాన్ ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడిలో వకాస్ సూత్రధారి అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం అవంతీపూర్ జిల్లా హత్వార్‌లోని ఓ ఇంట్లో ముఫ్తీ వకాస్ ఉన్నాడన్న సమాచారంతో ఆ ఇంటిని చుట్టుముట్టిన బలగాలు 20 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తిచేశాయి.
Comments
Please login to add a commentAdd a comment