సాక్షి, చెన్నై/తిరుపూరు: కాంగ్రెస్ పార్టీకి రక్షణ రంగమంటే బ్రోకర్లతో ఒప్పందాలేనని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ‘సముద్రాల నుంచి ఆకాశం వరకు.. రక్షణ రంగంలో జరిగిన అనేక కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉంది. బ్రోకర్లతో బేరసారాల్లో పడి ఆ పార్టీ అధికారంలో ఉండగా రక్షణ బలగాల ఆధునీకరణ గురించి కూడా పట్టించుకోలేదు’ అని మోదీ ఆరోపించారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం అంశంలో రక్షణ శాఖతోపాటు ప్రధాని కార్యాలయం కూడా సమాంతర చర్చలు జరిపిందంటూ ఇటీవల ఓ వార్తా కథనం రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రఫేల్ విషయంలో మోదీ ప్రభుత్వంపై ఆరోపణల వాడిని మరింత పెంచారు.
రాహుల్ వ్యాఖ్యలకు తమిళనాడులోని తిరుపూరు సమీపంలోని పెరుమనళ్లూరు సభలో మోదీ స్పందిస్తూ ‘దశాబ్దాల తరబడి అధికారంలో ఉండే అవకాశం దక్కినవారు భారత రక్షణ రంగం గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. వారికి ఈ రంగం అంటే కేవలం బ్రోకర్లతో చర్చలు జరిపి తమ మిత్రులకు మేలు జరిగేలా చూడటమే. దేశ భద్రత కోసం మేం అనుసరిస్తున్న విధానాలు వేరు. రక్షణకు అవసరమైన అన్ని ఆయుధాలు, పరికరాలను మన దేశంలోనే తయారు చేసుకోవాలనేది మా ప్రభుత్వ కల. అందుకోసమే రెండు రక్షణ కారిడార్లను నిర్మిస్తున్నాం. వాటిలో ఒకటి మీ రాష్ట్రంలోనే వస్తోంది. దీని ద్వారా ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అని వివరించారు. ప్రతిపక్ష నాయకులు తనను దూషిస్తే వారు ఇప్పుడు టీవీలు, పత్రికల్లో కనిపిస్తారేమో కానీ, ఎన్నికల్లో వారి గెలుపునకు అది సరిపోదనీ, అందుకు కావాల్సింది దార్శనికత తప్ప దుర్భాషలు, దాడులు కాదని అన్నారు.
తిరుపూరు నుంచే మా ప్రచార దుస్తులు
పెరుమనళ్లూరులో తన ప్రసంగాన్ని మోదీ ‘వణక్కం’ అంటూ తమిళంలో ప్రారంభించారు. కాంగ్రెస్‌లో నాటి అగ్రనేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత కె. కామరాజార్ గొప్ప నాయకుడని మోదీ కొనియాడారు. ఎన్నికల్లో తమ ప్రచార దుస్తులైన ‘నమో’ టీ–షర్టులు తిరుపూరులో తయారైనవేనని మోదీ తెలిపారు. కాగా, కావేరీ నదీ జలాలు సహా అనేక అంశాల్లో తమిళనాడు ప్రయోజనాలకు విరుద్ధంగా మోదీ వ్యవహరిస్తున్నారంటూ తిరుపూరులో డీఎండీకే చీఫ్ వైగో నేతృత్వంలో నిరసనలు జరిగాయి. ఒకానొక సమయంలో వైగో ప్రసంగిస్తుండగా అక్కడి జనంలోకి బీజేపీకి చెందిన మహిళ వచ్చి మోదీ అనుకూల నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆమెను పోలీసులు పక్కకు తీసుకెళ్లారు. చెన్నై, తిరుచ్చిల్లో వివిధ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు చేశారు.
సీఎం అయినందుకు కుమారస్వామి విలాపం
సాక్షి, బెంగళూరు: తమిళనాడు నుంచి మోదీ కర్ణాటకలోని హుబ్లీకి చేరుకుని ఆ రాష్ట్రంలోనూ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హుబ్లీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ కర్ణాటకలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరో ఆ బ్రహ్మదేవుడికే తెలియాలని మోదీ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాధినేత ఎవరో ప్రజలకు తెలియడం లేదని, తాను ఎందుకు ముఖ్యమంత్రిని అయ్యానో అనుకుంటూ కుమారస్వామి రాత్రులు ఏడుస్తూ కూర్చుంటుంటే మరికొందరు నేతలు ఢిల్లీలో చక్కర్లు కొడుతూ కనిపిస్తారని మోదీ విమర్శించారు. కాంగ్రెస్‌లో అంతర్గత వివాదాలకు కుమారస్వామి ఒక పంచింగ్ బ్యాగ్ అవుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. కుమారస్వామి అత్యంత బలహీనమైన ముఖ్యమంత్రి అని, సంకీర్ణ ప్రభుత్వంలో ఆధిపత్యం కోసం నిత్యం కోట్లాట జరుగుతోందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment