మాజీ జవాన్లపై పోలీసు జులుం
- ఢిల్లీలో ధర్నాచేస్తున్న వారిపై ఖాకీల బలప్రయోగం
- ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ కోసం 62 రోజులుగా నిరసన
- టెంట్లు తీసేసి, బలవంతంగా ఖాళీ చేయించిన పోలీసులు
- ఖండించిన రాహుల్, మాజీ సైనికులకు సంఘీభావం
- ‘ఓఆర్‌ఓపీ’అమలు తేదీ చెప్పాలని ప్రధానికి డిమాండ్
న్యూఢిల్లీ: రక్షణ శాఖలో ‘ఒకే ర్యాంకు ఒకే పెన్షన్(ఓఆర్‌ఓపీ)’ అమలు చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 62 రోజులుగా ధర్నా చేస్తున్న మాజీ సైనికులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దేశం కోసం ప్రాణాలను అడ్డుపెట్టినవారిని భద్రతకు ముప్పంటూ బలవంతంగా ఖాళీ చేయించా రు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ విజ్ఞప్తి మేరకు స్వాతంత్య్ర దిన భద్రతా ఏర్పాట్లలో భాగంగా మాజీ సైనికులను జంతర్ మంతర్ వద్ద నుంచి ఢిల్లీ పోలీసులు శుక్రవారం బలవంతంగా తరలించారు. ధర్నా వేదిక వద్ద టెంట్లను తొలగించారు. భద్రత పేరుతో పోలీసులు ఇలా మాజీ సైనికులపై బలప్రయోగం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం తర్వాత వెనక్కి తగ్గింది.
ఘటనపై విచారం తెలిపింది. జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికులు ధర్నా కొనసాగించేందుకు అనుమతించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ సైనికులకు తెలిపారు. కేంద్రం అనుమతించినందున తొలగించిన టెంట్లను మళ్లీ ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీకి మాజీ సైనికులు విజ్ఞప్తిచేశారు. కాగా, ఓఆర్‌ఓపీ విధానాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మాజీ సైనికులపై పోలీసులు బలప్రయోగాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ధర్నా స్థలికి చేరుకుని మాజీ జవాన్లకు సంఘీభావం ప్రకటించారు.
ప్రధాని సులభంగా హామీలిస్తారని, కానీ వాటిని నెరవేర్చడంలో విఫలమవుతుంటారన్నారు. ‘యువతకు ఉద్యోగాల హామీనిచ్చారు. మేక్ ఇన్ ఇండియా విఫలమైంది. స్వచ్ఛ భారత్ ఫలప్రదం కాలేదు. తన కార్పొరేట్ మిత్రులకు భూ బిల్లును తెస్తానని హామీనిచ్చినా, సాధ్యం కాలేదు. ఓఆర్‌ఓపీనీ నెరవేర్చలేదు’ అని విమర్శించారు. అయితే, రాహుల్‌కు మాజీ సైనికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లుగా రాహుల్ ఎందుకు మౌనంగా ఉన్నారని వారు ప్రశ్నించారు. జంతర్‌మంతర్ వద్దకు రావడం కంటే ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్లమెంట్‌లో ప్రస్తావిస్తే బాగుండేదన్నారు. దీన్నిప్పుడు రాజకీయం చేయొద్దన్నారు. ఢిల్లీ సీఎంకేజ్రీవాల్ కూడా మాజీ సైనికులకు సంఘీభావం ప్రకటించారు. ఓఆర్‌ఓపీ అమలు గురించి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని ప్రకటించాలని కోరారు.
హామీని నెరవేరుస్తాం..
ఓఆర్‌ఓపీపై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ డెహ్రాడూన్‌లో మాట్లాడుతూ.. ఈ విధానం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, అయినా హామీని నెరవేరుస్తామన్నారు. ప్రభుత్వ పదవీకాలంలోపు ఈ హామీని నెరవేరుస్తామన్నామని, వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు. ఓఆర్‌ఓపీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అరుణ్ జైట్లీ కూడా తెలిపారు. ఈ విధానం అమలుకు కసరత్తు జరుగుతోందన్నారు. రక్షణశాఖలో ఒకే ర్యాంకు, ఒకే సర్వీస్‌తో రిటైర్ అయ్యే సిబ్బందికి ఓఆర్‌ఓపీ విధానం అమలుచేయాలని మాజీ సైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానం అమలైతే తక్షణం 22 లక్షల మంది మాజీ సైనికులు, 6 లక్షలకు పైగా అమరసైనికుల భార్యలు లబ్ధి పొందనున్నారు. అయితే, ఓఆర్‌ఓపీ త్వరలోనే అమలు కానుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ జైపూర్‌లో విలేకరులకు తెలిపారు.
మేం దేశ భద్రతకు ముప్పా?
దేశం కోసం ఒకప్పుడు ప్రాణాలను అడ్డుపెట్టిన తాము ఇప్పుడు దేశ భద్రతకు ముప్పుగా కనిపిస్తున్నామా? అంటూ పోలీసుల తీరుపై మాజీ సైనికులు మండిపడ్డారు. ‘మమ్మల్ని ఎలా అనుమానిస్తారు? దేశాన్ని రక్షించిన మేం ఇప్పుడు ముప్పుగా మారామా?’ అని ఒకరన్నారు. ‘భద్రతా కారణాల రీత్యా మమ్మల్ని ఖాళీ చేయిస్తున్నట్లు చెప్పారు. కానీ నన్ను తోసేశారు. చొక్కా చిరిగింది’ అంటూ 82 ఏళ్ల మాజీ సైనికుడు తప్పుట్టారు. పంద్రా గస్టుకు ఒక రోజు ముందు తమ స్వాతంత్య్రాన్ని హరించడం ఆటవికమన్నారు.