‘అస్త్ర’ పరీక్ష విజయవంతం
బాలాసోర్: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర (గగనతలంలో సుదూర లక్ష్యాలను సైతం ఛేదించే–బీవీఆర్‌ఏఏఎమ్) క్షిపణిపై వివిధ దశల్లో నిర్వహించిన పరీక్ష విజయవంతంగా పూర్తయింది. నాలుగురోజులుగా జరుగుతున్న ఈ క్షిపణి ట్రయల్స్ సఫలీకృతమయ్యాయని రక్షణ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘బంగాళాఖాతంలో అస్త్ర క్షిపణి (బీవీఆర్‌ఏఏఎమ్) చివరి దశ పరీక్ష విజయవంతమైంది. సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు ఒడిశాలోని చాందీపూర్ తీరం నుంచి ఈ పరీక్షలు జరిగాయి’ అని ప్రకటనలో పేర్కొంది.
ఈ ప్రయోగం సఫలీకృతం కావటంతో త్వరలోనే భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగంలో పాలుపంచుకున్న డీఆర్‌డీవో, ఏఐఎఫ్‌లతో పాటుగా పలు డీపీఎస్‌యూలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు. క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థ డైరెక్టర్ జనరల్ జి. సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన సాంకేతికత ద్వారా గగనతలం నుంచి గగనతల లక్ష్యాలను, భూమిపైనుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే మరిన్ని విభిన్నమైన క్షిపణులను రూపొందించవచ్చని తెలిపారు.